నిశ్శబ్దమైన శబ్దమే పరమపదం

ABN , First Publish Date - 2020-10-15T07:15:46+05:30 IST

అని శ్రీ శంకరాచార్యుల ‘యోగతారావళి’లో చెప్పబడినది. అనగా ‘‘యోగమునందు పరిపూర్ణతను సాధింపగోరువారు, అన్ని చింతలనూ మాని, నిశ్చల చిత్తంతో నాదాన్ని మాత్రమే అతి సన్నిహితంగా వినాలి’’ అని అర్థం. నాదం అంటే శబ్దం.

నిశ్శబ్దమైన శబ్దమే పరమపదం

సర్వచింతాం పరిత్యజ్య, సావధానేనచేతసా

నాదయేవాను సంధేయో, యోగ సామ్రాజ్యమిచ్ఛతా


అని శ్రీ శంకరాచార్యుల ‘యోగతారావళి’లో చెప్పబడినది. అనగా ‘‘యోగమునందు పరిపూర్ణతను సాధింపగోరువారు, అన్ని చింతలనూ మాని, నిశ్చల చిత్తంతో నాదాన్ని మాత్రమే అతి సన్నిహితంగా వినాలి’’ అని అర్థం. నాదం అంటే శబ్దం. నాదం.. శివ-శక్తి. అనగా శివుడు, శక్తి సంయోగం. వారి పరస్పర సంబంధమే నాదం. ‘హఠయోగ ప్రదీపిక’లో.. నాదం, బిందువు, కళగా శివుడు కనిపిస్తున్నాడని చెప్పబడినది.  నిరాకారుడైన ఆ పరమాత్మ మొదటి రూపం నాదం. అది ‘ఓంకారం’ లేక బ్రహ్మం. యోగుల దృష్టిని కేంద్రీకరింపజేసిన ఒక గుప్తమైన అంతర్వాణి. నాదం శబ్దంతో కూడి అక్షర బ్రహ్మముతో లీనమవుతుంది. నిశ్శబ్దమైన శబ్దమే పరమపదం. సూక్ష్మ ధ్వనుల నుండి మనస్సు నిశ్శబ్ద శబ్దం వైపు మళ్ళితే.. మనస్సు, ప్రాణం నిరాకార బ్రహ్మము నందు లయ దశకు చేరుకొంటాయి.


శబ్దం నాలుగు భాగాలుగా ఉంటుంది. అవి.. పరావాక్కు, పశ్యంతీవాక్కు, మధ్యమవాక్కు, వైఖరీ వాక్కు. శబ్దం వాక్కుగా వ్యక్తం కావడానికి ముందు భావంతో కలుస్తుంది. అనగా.. భావాల పేర్పుతో వాక్కు నిర్మాణమవుతుంది. ఇచ్ఛాశక్తి ప్రాణమయ తరంగాలతో ప్రేరేపింపబడి వాక్కును పుట్టిస్తుంది. ఈ ఇచ్ఛా శక్తే బ్రహ్మ. ఈ శబ్ద బ్రహ్మ.. పరబ్రహ్మము యొక్క మొదటి అవతరణ. ఇదే కొన్ని చోట్ల సకల పరమేశ్వర స్థితిగా చెప్పబడింది. పరావాక్కులో శబ్దం అభేద్య రూపంలో ఉంటుంది. పశ్యంతి వాక్కు స్థానం.. ‘నాభి’ లేక మణిపూరక చక్రం. మధ్యమ వాక్కు స్థానం.. హృదయం. ఇది శబ్దం యొక్క అవ్యక్తమైన మధ్యస్థ దశ. శబ్దం కుండలినీ శక్తితో కలిసి విశుద్ధిచక్రమం చేరి దాన్నుంచి వైఖరీ వాక్కుగా వ్యక్తమవుతుంది. ఈ దశలోనే వాక్కు భౌతిక శబ్దంగా, ఉచ్చారణగా మార్పు చెందుతుంది.


ఈ నాలుగు వాక్కులూ నాలుగు స్థితుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మను తెలియజేస్తాయి. గుడిలో గంట మోగిస్తే వచ్చే శబ్దం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.  అట్లా తగ్గుతూ వినబడే శబ్దానికి ఆకారం లేనట్లనిపిస్తుంది. గంటానాదంలాగా భగవంతుడు రూపంతోనూ, రూపం లేకుండా కూడా ఉన్నాడంటారు శ్రీరామకృష్ణ పరమహంస. ‘‘నాస్తి నాదాత్పరో మంత్రః అని యోగశిఖోపనిషత్తు చెబుతోంది. ‘‘నాదానుసంధానం కంటే ముముక్షువులకు శ్రేష్ఠమైన మంత్రం లేదు. కనుక మహర్షులు పశ్యంతి వాణి మూలంగా ప్రణవతత్వం నుండి సాక్షాత్కరించిన ఆత్మజ్ఞానాన్ని భద్రపరచారు. అంతర్ముఖులై ఉన్న సాధకులు పరా- పశ్యంతి అనే వాణి మూలంగా వెలువడే విషయాలను గుర్తించగలుగుతారు. జాగ్రదావస్థయందు బహిర్ముఖులగు వారు మధ్యమ- వైఖరీ అనేవాణి మూలంగా వెలువడే విషయాలను గుర్తించగలుగుతారు. 


మౌని అంటే మనన శీలుడని అర్థం. మాటలాడని వానిని ‘మౌని’ అని కొందరంటారు. మాటలు మానడం నిజమైన మౌనానికి ఒక బాహ్య సాధనం మాత్రమే. మనం మాట్లాడే వాక్కులు వైఖరీ వాక్కులు. ఈ వైఖరీ వాక్కును మధ్యమ వాక్కులో, మధ్యమను పశ్యంతి వాక్కులో, పశ్యంతిని పరావాక్కులో లయం చేయాలి. ఆ ప్రణవానికి లక్ష్యమైన పరబ్రహ్మమే తానై ఉండడం అంటే అదే. నిజమైన మౌనం అన్నా కూడా అదే. సిద్ధావస్థయొక్క అసలైన లక్షణం అదే.


 మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-10-15T07:15:46+05:30 IST