36 నుంచి 328 వరకు..

ABN , First Publish Date - 2021-01-20T06:48:46+05:30 IST

అడిలైడ్‌లో 36 పరుగులకే కుప్పకూలిన వేళ భారత క్రికెట్‌ జట్టుపై ఇంటాబయటా ఎన్ని విమర్శలో.. ఇది సరిపోదన్నట్టు ఆ మ్యాచ్‌ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌, సారథి విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమవడంతో అభిమానులకు కూడా అంచనాల్లేని

36 నుంచి 328 వరకు..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

అడిలైడ్‌లో 36 పరుగులకే కుప్పకూలిన వేళ భారత క్రికెట్‌ జట్టుపై ఇంటాబయటా ఎన్ని విమర్శలో.. ఇది సరిపోదన్నట్టు ఆ మ్యాచ్‌ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌, సారథి విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమవడంతో అభిమానులకు కూడా అంచనాల్లేని పరిస్థితి. ఇక ఆసీస్‌ మాజీ ఆటగాళ్ల హేళనకైతే అడ్డూఆపూ లేకుండా పోయింది. కోహ్లీలేని భారత జట్టా.. ఇంకేముంది ఆసీస్‌ 4-0తో క్లీన్‌స్వీ్‌ప చేయడమే తరువాయి అంటూ అవాకులు చవాకులు పేలారు. భారత జట్టు కూడా చివరి టెస్ట్‌ వరకు ఎన్నో కఠిన సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది.


బ్యాటింగ్‌కు స్వర్గధామంగా నిలిచే మెల్‌బోర్న్‌లో ఆసీస్‌ మొదట బ్యాటింగ్‌కు దిగగానే భారత్‌ పని అయిపోయిందన్నారు.. సిడ్నీ మైదానంలో ఓటమి ఖాయమే అని దెప్పిపొడిచారు.. బుమ్రా, షమి, ఉమేశ్‌, జడేజా, అశ్విన్‌, విహారి లేకపోవడంతో గాబాలోనూ భారత్‌కు గాబరారేనని భావించారు. పైగా పిచ్‌పై పగుళ్లు ఉండడంతో చివరి రోజు 328 పరుగుల ఛేదన అసంభవమని తేల్చారు. కానీ మిస్టర్‌ కూల్‌ రహానె నేతృత్వంలోని భారత జట్టు ఈ సమస్యలన్నింటినీ ఛేదిస్తూ వెళ్లింది. పోరాడితే పోయేదేమీ లేదనే నానుడిని నిజం చేస్తూ ఆసీస్‌ గడ్డపై యువ ఆటగాళ్లు కదం తొక్కారు. రెగ్యులర్‌ ఆటగాళ్లు లేకపోయినా బ్యాక్‌ టు బ్యాక్‌ సిరీ్‌సలను ఖాతాలో వేసుకుంది. ఓ రకంగా ఇది 2005లో ఆసీస్‌పై ఇంగ్లండ్‌ సాధించిన యాషెస్‌ సిరీస్‌తో సమానమైన విజయం.


కొత్త కుర్రాళ్ల మాయ: తొలి టెస్ట్‌లో ఘోర ఓటమి తర్వాత భారత్‌ పుంజుకున్న తీరు మాటలకందనిది. ఇందుకు ఒకరి తర్వాత ఒకరు జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లే కారణం. అనుభవం లేకున్నా నిరూపించుకోవాలనే తపన.. జట్టును గెలిపించాలనే కసి వారి అణువణువునా కనిపించింది. ప్రతి మ్యాచ్‌లోనూ వీరి అసాధారణ పట్టుదల వహ్వా అనిపించింది. బాక్సింగ్‌ డే టెస్టులో గాయంతో పేసర్‌ షమి కూడా దూరమయ్యాడు. ఈ దశలో అరంగేట్ర హీరోలు పేసర్‌ సిరాజ్‌, యువ ఓపెనర్‌ గిల్‌ అదరగొట్టారు. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. వేదిక సిడ్నీకి మారేసరికి జట్టు నుంచి ఉమేశ్‌ రూపంలో మరో వికెట్‌ పడింది. అతడి స్థానంలో నవ్‌దీప్‌ సైనీ బరిలోకి దిగి కీలక వికెట్లు తీశాడు. నిర్ణాయక గాబా టెస్టుకు ఏకంగా విహారి, అశ్విన్‌, బుమ్రా, జడేజా దూరమయ్యారు. ఈ దశలో నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకొచ్చారు.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో సుందర్‌-శార్దూల్‌ క్రీజులో ఎదురునిలిచిన తీరు మర్చిపోగలమా..! ఆసీస్‌ను 33 రన్స్‌ ఆధిక్యానికే పరిమితం చేస్తూ అక్కడే జట్టుకు సగం విజయాన్నందించారు. ఇక ఛేదనలో 21 ఏళ్ల గిల్‌.. 23 ఏళ్ల పంత్‌ చేసిన మాయ ప్రపంచం చూసిందే. అసాధ్యమనుకున్న విజయాన్ని ఆవిష్కృతం చేశారు. కీపింగ్‌ రాదు.. పేలవషాట్లకు అవుటవుతాడనే విమర్శలకు చెక్‌ పెడుతూ పంత్‌ ఆడిన తీరు అతడిలోని మరో కోణాన్ని చూపింది. అందుకే ఇక నుంచి జట్టులో పేరున్న ఆటగాళ్లెవరూ అందుబాటులో లేకున్నా, డోంట్‌ కేర్‌. ఎందుకంటారా.. భీకర బౌలింగ్‌ లైనప్‌ కలిగిన ఆసీ్‌సను వారి గడ్డపైనే ఓడించిన నయా భారత జట్టు రిజర్వ్‌ బెంచ్‌ కూడా పటిష్టంగానే ఉందని తేలింది.


ఈ సిరీ్‌సలో భారత్‌ కీలక భాగస్వామ్యాలు

రహానె - జడేజా

(245 బంతుల్లో 121- మెల్‌బోర్న్‌)

పంత్‌ - పుజార

(265 బంతుల్లో 148- సిడ్నీ)

అశ్విన్‌ - విహారి 

(259 బంతుల్లో 62 - సిడ్నీ)

సుందర్‌ - శార్దూల్‌

(217 బంతుల్లో 123 - బ్రిస్బేన్‌)

Updated Date - 2021-01-20T06:48:46+05:30 IST