Abn logo
Jan 19 2021 @ 04:13AM

పాత్రికేయ శిఖరం

తెలుగు పత్రికా రంగంలో దాదాపు ఏడు దశాబ్దాలుగా నిరంతర కృషిచేసిన సుప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత, వ్యాఖ్యాత తుర్లపాటి కుటుంబరావు. ఆయన కాలధర్మం చెందడం విధివిలాసమైనా, తెలుగు జర్నలిజం రంగానికి తీరని వెలితిని కలిగించింది. నిజానికి తుర్లపాటి పేరు వినగానే ఎవరికైనా ‘వార్తలలోని వ్యక్తి’ శీర్షికే గుర్తుకు వస్తుంది. 


1960లో తొలిసారి ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రతిరోజు క్రమం తప్పకుండా వార్తలలోని ఒక ప్రముఖుడిని పరిచయం చేస్తూ తుర్లపాటి కుటుంబరావు నాలుగేండ్ల పాటు రాశారు. మధ్యలో అస్వస్థతకు గురై దీర్ఘకాలం సెలవుపై వెళ్లి, మళ్లీ వచ్చిన తర్వాత అదే శీర్షికను వారానికొక పర్యాయం రాశారు. వారు కోలుకుని వచ్చిన తర్వాత, మేడపై ఉన్న సంపాదకవర్గ విభాగానికి మెట్లు ఎక్కి వెళ్లలేని స్థితిలో ఉన్నందున ఆయన కోసం యాజమాన్యం ప్రత్యేకంగా కిందనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందంటే వారి ప్రాధాన్యత వేరుగా చెప్పనవసరం లేదు. 


‘ఆంధ్రజ్యోతి’లో సీనియర్‌ సబ్‌--ఎడిటర్‌ మొదలుకొని ‘జ్యోతిచిత్ర’ ఎడిటర్‌ స్థాయి దాకా వివిధ హోదాలలో తుర్లపాటి పనిచేశారు. ‘ఆంధ్రజ్యోతి’ని షడ్రుచుల భోజనంగా భావిస్తే ఆ రుచులలో పాఠక మహాశయులకు అలవాటైన ఒక రుచి తుర్లపాటి రచనది. ఇంత వైశిష్ట్యాన్ని సాధించిన తుర్లపాటి 1992లో ఆంధ్రజ్యోతికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆ శీర్షికను 1999 వరకు కొనసాగించారు. ఆ తర్వాత ఇదే శీర్షికను ఆయన ఇతర పత్రికల్లోను ఇటీవలివరకు కొనసాగించారు. ఒకప్పుడు ‘ది హిందూ’ దినపత్రికలో ప్రచురించి నిలిపివేసిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ది న్యూస్‌’ శీర్షిక ప్రేరణతో ‘వార్తలలోని వ్యక్తి’ని, ప్రముఖుల పరిచయంతో ప్రారంభించి, రాజకీయనేతలకు సైతం పరిణతి కలిగించారు. గత అరవై ఏళ్లుగా ఒకే శీర్షికను ఒకే జర్నలిస్టు నిర్వహించడం ఒక రికార్డు. పైగా ఎవరి గురించి రాసినా, వారి గురించి ఏదో ఒక తెలియని విషయం చెప్పడం ఆ శీర్షిక ప్రత్యేకత. ఆ శీర్షిక సోపానంగా ఒక జర్నలిస్టుగా ఎదిగిపోయిన తుర్లపాటి సుమారు నాలుగువేలకు పైగా సంగ్రహ జీవిత చరిత్రలు రాసిన రచయితగా, జర్నలిస్టుగా భారతప్రభుత్వం గుర్తించి ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రదానం చేసింది. 


1933 ఆగస్టు 10వ తేదీన శేషమాంబ – సుందర రామానుజరావు దంపతులకు జన్మించిన కుటుంబరావు 14 సంవత్సరాల వయస్సులోనే ప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాల ప్రభావానికి లోనై తెలుగు జర్నలిజం రంగంలో అడుగు పెట్టారు. 1947లో ‘మాతృభూమి’ పత్రికలో తొలి వ్యాసం రాశారు. 1952లో ‘ప్రతిభ’ వారపత్రికలో చలసాని రామారావుతో కలిసి సంపాదకుడిగా పని చేశారు. ఆ తర్వాత కృష్ణాజిల్లాలో ప్రముఖ నాయకుడైన డాక్టర్‌ టి.వి.యస్‌. చలపతిరావు గారి పత్రిక ‘ప్రజాసేవ’కు సంపాదకుడిగా పని చేశారు. అంతలోనే ఆంధ్రకేసరి ఆహ్వానంతో ‘ప్రజాపత్రిక’లో చేరారు. ఆ తర్వాత ఎన్‌.జి.రంగా ‘వాహిని’లోనూ పని చేశారు. అంతవరకు నార్లవారికి ఏకలవ్య శిష్యుడిగా ఉన్న తుర్లపాటి 1960లో నార్ల సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. అక్కడే ఆదివారం అనుబంధం ఇన్‌చార్జిగా, సినిమా ఎడిటర్‌గా, సంపాదకీయ రచయితగా ‘జ్యోతిచిత్ర’ ఎడిటర్‌గా ఉంటూనే తన మార్క్‌ రచనలు చేశారు. ఒకవంక జర్నలిస్టుగా పురోగమిస్తూ, విజయవాడలోనూ, ఆ చుట్టుపక్కల జిల్లాలన్నింట్లో దాదాపు పదివేల సభల్లో పాల్గొని ఉపన్యాసాలు చేసి ‘ఉపన్యాసకేసరి’ బిరుదు పొందారు. తానెన్ని కీర్తిశిఖరాలు అధిరోహించినా జర్నలిస్టులతో, రచయితలతో ఎంతో స్నేహంగా ఉండేవారు. తన అనుభవాలను మిత్రులకు పూసగుచ్చినట్లు చెప్పేవారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు, రాత్రిపూట ఎన్నో పోషక విలువలు ఉండే మర్రిఊడల రసాన్ని తాగుతున్నారని, అందుచేత ఆయన మరణించే ప్రసక్తే లేదని, ఈ దీక్షను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి ప్రధాని నెహ్రూకు రహస్య నివేదిక పంపినట్టు పొక్కిన వార్తను ఆయన ఎంతో ఆసక్తిదాయకంగా చెప్పేవారు. ఇట్లాగే ఒకటా రెండా, ఎన్నో అంశాలను ఆయన అప్పుడప్పుడు చెప్పేవారు. ఎవరైనా అడిగితే వ్యాసరూపంలోను రాసేవారు. నాకు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు సంపాదించిపెట్టిన నా గ్రంథం ‘తారాతోరణం’కు తుర్లపాటి ఎంతో శ్రద్ధతో, ప్రేమతో ముందుమాట రాసిచ్చి, నన్ను రుణగ్రస్థుడిని చేశారు. వారి దివ్యస్మృతికి నివాళి సమర్పిస్తున్నాను. 

టి. ఉడయవర్లు

Advertisement
Advertisement
Advertisement