జీవధార కంటి ధార

ABN , First Publish Date - 2021-09-15T05:51:55+05:30 IST

జీవధార.. కంటికి ధారగా విలపిస్తోంది! మూడు మండలాల్లో ముక్కారు పంటకు నీరందించే పెదవాగు ప్రమాదపుటంచున నిలిచింది.

జీవధార కంటి ధార
ప్రాజెక్టు గేట్లు వేసి ఉన్నా లీకులు అవుతున్న దృశ్యం(ఫైల్‌)

ప్రమాదపుటంచున పెదవాగు ప్రాజెక్టు

శిథిలావస్ధలో మూడు గేట్లు.. లీకులతో నీరంతా వృథా

జలశాయం నిండకుండానే నీటిని బయటకు విడుదల చేస్తున్న అధికారులు

జరగరానిది జరిగితే మూడు మండలాలకు ముప్పు

పదిహేనేళ్లుగా మరమ్మతులు చేయకపోవడమే కారణం

రూ. కోటితో ప్రతిపాదనలు పంపినా నయా పైసా ఇవ్వని ప్రభుత్వం

అశ్వారావుపేట, సెప్టెంబరు 14: జీవధార.. కంటికి ధారగా విలపిస్తోంది! మూడు మండలాల్లో ముక్కారు పంటకు నీరందించే పెదవాగు ప్రమాదపుటంచున నిలిచింది. ఏ క్షణాన కట్టలు తెగుతాయో, గేట్లు ఊడి బైట పడతాయో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే అశ్వారావుపేట మండలంతో పాటు ప్రస్తుతం ఏపీలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పదుల సంఖ్యలో గ్రామాలు, ప్రాణ, పశు నష్టాలతో పాటు వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగే ప్రమాదం ఉంది. పదిహేనేళ్లుగా ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం పెదవాగు మధ్యతరహా ప్రాజెక్టు పరిస్థితి ఈ దశకు చేరింది. మరమ్మతుల సంగతేమో కాని కనీసం గేట్లు, కట్టల పటిష్ఠతకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వర్షం వచ్చిందంటే చాలు వీటిని కాపాడేందుకు పగలనక రాత్రినక అధికారులు ప్రాజెక్టు వద్దే పడిగాపులు కాస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టే బయటకు వదిలేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రాజెక్టు గేట్లు మూసివేసి ఉన్నప్పటికీ అవి అప్పటికే శిథిలమైపోవడంతో నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృఽథాగా పోతోంది. ఇదీ చాలదన్నట్టు ప్రాజెక్టు కట్టలు, తూములు, కాలువ గట్లు, అక్విడేట్లు కూలి పోయాయి. కాలువలు రూపు రేఖలు కోల్పోయాయి. కాలువగట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు ఇసుక బస్తాలను వేసుకొని నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టలు ఎక్కడపడితే నెర్రెలిచ్చి బలహీనమయ్యాయి. అశ్వారావుపేట, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో 16 వేల ఎకరాల్లో సాగునీటిని, మండలంలోని అనేక గ్రామాలకు తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు ఇలా ప్రమాదపుటంచున ఉండటంతో ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాల్వలు ఏపీలోకి వెల్లడంతో జటిలం

పెదవాగు ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. 16 వేల ఎకరాల ఆయకట్టులో సుమారుగా 14వేల ఆయుకట్లు ఏపీలోని వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో పరిధిలో ఉంది. దీంతో అసలు ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాఽథుడే లేడు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఈ ప్రాజెక్టు ఉండటంతో మరమ్మతులను పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు శిఽథిలావస్థకు చేరిందని, రూ. కోటి మంజూరు చేస్తే కనీసం గేట్లు పునర్‌ నిర్మిస్తామని, లేకుండా ప్రమాదం తప్పదని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కారు నుంచి నయా పైసా విడుదలవలేదు.

రూ.కోటితో ప్రతిపాదనలు పంపాం: కృష్ణ, డీఈఈ 

పెదవాగు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. తక్షణం గేట్లు మరమ్మతులకు రూ.కోటితో గత ఏడాది సర్కారుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మాత్రం మంజూరుకాలేదు. గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రాజెక్టును కాపాడేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. సామర్థ్యం కంటే తక్కువగా ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుతున్నాం.


Updated Date - 2021-09-15T05:51:55+05:30 IST