ఆర్టీసీలో పెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2021-06-22T08:35:18+05:30 IST

ఏళ్ల పాటు ఆర్టీసీ కోసం శ్రమించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. నెల వారీగా చేతికందే పెన్షన్‌ కోసం టెన్షన్‌ పడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆర్టీసీలో పెన్షన్‌.. టెన్షన్‌

  • 2 నెలలుగా పింఛన్లు లేవ్‌
  • 22 వేల మంది నిరీక్షణ
  • డెత్‌ ఎక్స్‌గ్రేషియా కూడా లేదు
  • రూ.420 కోట్లపైనే పెండింగ్‌


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల పాటు ఆర్టీసీ కోసం శ్రమించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. నెల వారీగా చేతికందే పెన్షన్‌ కోసం టెన్షన్‌ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా వారికి అందించాల్సింది రూ.2500-రూ.3000 మాత్రమే. ఆ మొత్తాన్ని కూడా రెండు నెలలుగా చెల్లించకపోవడంతో సుమారు 22 వేల మంది రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహకు గురవుతున్నారు. అంతేకాదు... మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే ‘డెత్‌ ఎక్స్‌గ్రేౄషియా’నూ సెటిల్‌ చేయడం లేదు. సెటిల్‌మెంట్లు, రిటైర్డు ఉద్యోగుల రెండు నెలల పెన్షన్‌ సొమ్ము కలిపి మొత్తం రూ.420 కోట్ల వరకు ఆర్టీసీ బకాయి పడింది. ఈ సొమ్మును బదలాయించాలంటూ రిటైర్డు ఉద్యోగులు బస్‌ భవన్‌ చుట్టూ తిరుగుతున్నా..యాజమాన్యం స్పందించడంలేదు.


వాస్తవానికి స్టాఫ్‌ రి టైర్‌మెంట్‌ బెనిఫిట్‌స్కీమ్‌(ఎస్‌ఆర్‌బీఎస్‌) కింద సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి వేతనం నుంచి నెలకు రూ.250 చొప్పున ఆర్టీసీ యాజమాన్యం కట్‌ చేస్తుంది. ఇలా ప్రతి నెలా సగటున రూ.4 కోట్లు ఎస్‌ఆర్‌బీఎస్‌ అకౌంట్‌లో జమ అవుతాయి.ఈ సొమ్ముతో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సర్వీసును బట్టి రూ.2500-రూ.3000వరకు చెల్లిస్తారు. ఇదే తరహాలో  స్టాఫ్‌ బెనివొలెంట్‌ థ్రిఫ్ట్‌(ఎస్‌బీటీ) స్కీమ్‌ కింద మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.1.50లక్షలు డెత్‌ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంటారు. ఇందుకోసం ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి రూ.100 మినహాయించుకుంటారు. ఈ మొత్తాన్ని ఎస్‌బీటీ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉన్నా, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.   


సీసీఎస్‌ బకాయిలు రూ.1080 కోట్లు...

ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ(సీసీఎ్‌స)కి సంబంధించిన డబ్బును కూడా రెండేళ్లుగా యాజమాన్యం బదిలీ చేయడం లేదు. ఆ బకాయిలు వడ్డీతో కలిపి రూ.1080 కోట్లకు చేరాయి. ఈ సొమ్మును బదిలీ చేస్తే.. పిల్లల స్కూల్‌ ఫీజులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణానికి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీసీఎస్‌ మేనేజింగ్‌ కమిటీ వద్ద వేలాది రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సొమ్మును బదిలీ చేయాలంటూ సీసీఎస్‌ కమిటీ.. ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం  లేకుండాపోయింది. దీంతో సీసీఎస్‌ సభ్యత్వా న్ని రద్దు చేసుకోవడానికి 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి సెటిల్‌మెంట్లకు సంబంధించి రూ.170కోట్లు అవసరమవుతాయి. ఈ కొద్ది సొమ్మును కూడా యాజమాన్యం సర్దలేకపోతోంది. 


దశలవారీగానైనా చెల్లించాలి: ఎన్‌ఎంయూ

సొమ్మును ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోతే.. దశలవారీగానైనా చెల్లించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, కార్యాధ్యక్షుడు మర్రి నరేందర్‌, డిప్యూటీ సెక్రటరీ అశోక్‌ కోరారు. 

Updated Date - 2021-06-22T08:35:18+05:30 IST