మిర్చి నిర్జీవం! చీడపీడల దాడి.. ఎండిపోతున్న పంట

ABN , First Publish Date - 2021-12-04T07:36:58+05:30 IST

చేలల్లో నిన్నటిదాకా పచ్చగా కళకళలాడిన మిర్చి పంట జీవం కోల్పోతోంది. పంటపై చీడపీడలు మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించినట్లుగా విరుచుకుపడుతున్నాయి.

మిర్చి నిర్జీవం!  చీడపీడల దాడి.. ఎండిపోతున్న పంట

  • ఎకరానికి లక్ష దాకా పెట్టుబడి.. అంతా వృధా!
  • దిగుబడి, ఎగుమతులకు తీవ్ర విఘాతం


హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): చేలల్లో నిన్నటిదాకా పచ్చగా కళకళలాడిన మిర్చి పంట జీవం కోల్పోతోంది. పంటపై చీడపీడలు మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించినట్లుగా విరుచుకుపడుతున్నాయి. కొత్తగా వచ్చి.. పుప్పొడిని పీల్చేస్తున్న  మాయదారి తా మర పురుగు సహా ఎండు తెగులు, రసంపీల్చే పురు గు, కాయకుళ్లు తెగులు, ఆకుమచ్చ తెగులు, అన్నీ ఒకేసారి ఆశించడంతో మిర్చి పంట సర్వనాశనం అవుతోం ది. నిరుడు ఆశించిన మేర ధరలు రావడంతో ఎకరానికి రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టి మర్చి సాగు చేసిన రైతులు, చీడపీడల స్వైర విహారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.సాధారణ దిగుబడిలో 45శాతం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు పురుగు విస్తృతి మరింత పెరుగుతుందని.. పురుగు మందుల పిచికారీ చేసినా మిర్చి చేతికొచ్చే పరిస్థితి ఉండకపోవచ్చుననే అంచనాతో కొందరు రైతులు పంటను దున్నేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3.59 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. గతేడాది కంటే 1.19 లక్షల ఎకరా ల మేర సాగు పెరిగింది. అధిక వర్షాలు, తేమ ఎక్కువ రోజులు ఉండటం, వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈసారి చీడపీడలు, తెగుళ్ల దాడి ఎక్కువైంది. పక్షం రోజులుగా దక్షిణాసియాకు చెందిన తామర పురుగు రాష్ట్రంలోకి ప్రవేశించి మిర్చి తోటలను పీల్చి పిప్పిచేస్తోంది. దీనిని నివారించటం రైతులు, శాస్త్రవేత్తలు, అగ్రి- హార్టికల్చర్‌ అధికారుల తరం కావటంలేదు. ఈ పురుగుకు మిగతా చీడపీడలు తోడవ్వడంతో మిర్చి పంట కోలుకుంటుందనే నమ్మకం రైతులకు పోయింది. ఉద్యాన శాస్త్రవేత్తలు కూడా చేతులెత్తేశారు.


40 లక్షల క్వింటాళ్లయినా వస్తుందా? 

తెగుళ్లు, పురుగులు, చీడపీడల దాడితో దెబ్బతింటు న్న మిర్చి తోటలను పరిశీలించిన అధికారులు.. దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని నివేదికలు ఇస్తున్నారు. సాధారణంగా పంట బాగుంటే ఎకరానికి సగటున 21 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుంది. కానీ ఎకరానికి 10 క్వింటాళ్లు కూడా రావటం కష్టమేనని చెబుతున్నారు. దీంతో కనీసం 40 లక్షల క్వింటాళ్ల మిర్చి కూడా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితులు కనిపించటంలేదు. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా పెట్టుబడి ఖర్చులకే పోయే పరిస్థితి ఉంది. రైతుల మిర్చి రైతుల్లో కొందరికి మొదటి క్రాప్‌ కూడా రాలేదు. ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి రాని రైతులు కూడా ఉన్నారు. భూమిని కౌలుకు తీసుకొని మిర్చి సాగుచేసిన రైతులైతే నిలువునా మునిగిపోయారు.


ఘాటు తగ్గనున్న ఎగుమతులు

మిర్చి దిగుబడి సగానికి సగం పడిపోతే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయ, మా ర్కెట్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచంలో మిర్చి ఉత్పత్తి, ఎగుమతులు చేస్తున్న దే శాల్లో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 16.87 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతుంది.  ఇది ప్రపంచ వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణంలో 40శాతం ఉండటం గమనార్హం. నిరుడు దేశవ్యాప్తంగా 17.02 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. 3.50 లక్షల టన్నులతో ఽథాయ్‌లాండ్‌ రెండో స్థానంలో, 3.30 లక్షల టన్నులతో చైనా మూడో స్థానంలో, 3.10 లక్షల టన్నులతో ఇథియోపియా నాలుగో స్థానంలో నిలిచాయి. మిర్చి ఉత్పత్తిలో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నుంచి... చైనా, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు ఏటా మిర్చి ఎగుమతి అవుతోంది. 2016-17లో రూ.5 వేల కోట్ల విలువైన 4 లక్షల టన్నులు, నిరుడు  రూ. 8,430 కోట్ల విలువైన 6 లక్షల లక్షల క్వింటాళ్ల మిర్చి మనదేశం నుంచి ఎగుమతి అయింది.. ఏటికేడు ఎగుమతులు పెరుగుతున్న క్రమంలో ఈసారి దిగుబడి తగ్గిపోవటంతో ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-12-04T07:36:58+05:30 IST