ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉంటేనే అనుమతి

ABN , First Publish Date - 2021-06-03T07:21:44+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎదురైన చేదు అనుభవాలు, కొవిడ్‌ మూడో వేవ్‌ కూడా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముందుగానే అప్రమత్తమవుతోంది

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉంటేనే అనుమతి

కొవిడ్‌ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్స్‌ పునరుద్ధరణపై సర్కారు నిర్ణయం

మూడో వేవ్‌ హెచ్చరికలతో అప్రమత్తం

రెండో దశలో ఆక్సిజన్‌ ఏర్పాట్లు లేకుండానే పలు ఆస్పత్రులకు కొవిడ్‌ చికిత్స అనుమతి

తీవ్రంగా ఇబ్బంది పడ్డ కరోనా రోగులు


హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎదురైన చేదు అనుభవాలు, కొవిడ్‌ మూడో వేవ్‌ కూడా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముందుగానే అప్రమత్తమవుతోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు లేక.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారిన పడ్డవారు చికిత్సకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్న ఆస్పత్రులకే లైసెన్స్‌ను పునరుద్ధరిస్త్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటవుతాయని, ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రత ఊహించనంత స్థాయిలో ఉండడం, మూడో వేవ్‌లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సెకండ్‌వేవ్‌లో మొత్తం 1600 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు అనుమతులిచ్చారు. ఇందులో 250 వరకు ఆస్పత్రులు మొదటి వేవ్‌లోనే కొవిడ్‌ సేవలకు అనుమతులు తీసుకున్నాయి. అయితే వీటిలొ కొన్ని ఆస్పత్రులు వివిధ కారణాల దృష్ట్యా కొవిడ్‌ చికిత్సను అందించడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1195 ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్సను అందిస్తున్నాయి. ఇందులో కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి 20 పడకల ఆస్పత్రుల దాకా ఉన్నాయి. కొవిడ్‌ చికిత్స అందిస్తున్న చాలా ఆస్పత్రులకు సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు లేవు. బయటి నుంచి సిలిండర్ల రూపంలో కొనుగోలు చేశాయి. ఒకదశలో ప్రాణవాయువు దొరక్క రోగులనే తెచ్చుకోమన్నాయి. అలా తెచ్చుకున్న వారికే చికిత్స అందించాయి.


బయట నుంచి ఆక్సిజన్‌ తెచ్చుకోలేని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని ఆస్పత్రులైతే వారివద్ద ఆక్సిజన్‌ అయిపోగానే రోగులను ఇతర ఆస్పత్రులకు పంపించేశాయి. కొవిడ్‌ చికిత్స మధ్యలో, అదీ ఆక్సిజన్‌పై ఉండగా వేరే చోటకు పంపడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇతర ఆస్పత్రుల్లో బెడ్స్‌ కోసం రోగులు అంబులెన్స్‌లోనే గంటల కొద్దీ గడిపారు. కొందరికి ఆక్సిజన్‌ బెడ్స్‌ దొరక్క ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొంతమంది రోగుల కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ విషయంలో పెట్టిన ఇబ్బందులను వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అనుభవాలు, ఈసారి ఽథర్డ్‌వేవ్‌ను ఎదుర్కొవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటులోనూ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై సర్కారు దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 21,757 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. వీటిలో 11 వేల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు మాత్రం సెల్ప్‌ జనరేటెడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. సెకండ్‌ వేవ్‌లో హైదరాబాద్‌లోని 20 ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రోజుకు 200కు పైగా మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు వినియోగం జరిగిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2021-06-03T07:21:44+05:30 IST