‘బాబు, అచ్చెన్నకు భయపడి ఎన్నికలు పెట్టలేదనుకోవద్దు’

ABN , First Publish Date - 2020-10-24T17:53:11+05:30 IST

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యి వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా

‘బాబు, అచ్చెన్నకు భయపడి ఎన్నికలు పెట్టలేదనుకోవద్దు’

అమరావతి : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యి వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం జగన్ సర్కార్ జరపట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఎలక్షన్ కమీషన్ ఎన్నికలను వాయిదా వేయడం.. ఆ తర్వాత దీనిపై ఏకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడం.. ఆ తర్వాత అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ మారిందని ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందునే ఎన్నికలు నిర్వహించట్లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ పార్టీ అధినేత, నేతలు సైతం ఇదే విషయం మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా మంత్రి పేర్ని నాని స్పందించి ఒకింత కౌంటర్ ఇచ్చారు.


భయపడి కాదు..!

స్థానిక సంస్థల ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలనే జగన్ సర్కార్‌కు ముఖ్యం. కోవిడ్ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలేదనుకోవద్దు. వైద్యశాఖ అధికారులతో మాట్లాడి స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. కోవిడ్ కు భయపడి కోర్టు వాదనలు సైతం ఆన్‌లైన్‌లో వింటున్నారుఅని మంత్రి నాని స్పష్టం చేశారు. కాగా ఇవాళ తెలుగు రాష్ట్రాల మధ్య ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల రాకపోకలు, భారీ జరిమానాల విషయమై మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల గురించి పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-10-24T17:53:11+05:30 IST