అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘దుర్గమ్మ’ ప్రచారం.. మండిపడుతున్న హిందువులు..!

ABN , First Publish Date - 2020-10-20T22:21:08+05:30 IST

దసరా నవరాత్రుల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఇళ్లల్లో ఈ శ్లోకం మార్మోగుతూనే ఉంది.. హిందువులంతా దుర్గమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ నియమనిష్టలతో పండుగను జరుపుకుంటుంటారు.. అయితే విచిత్రంగా అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో ఉన్న ఓ ఫొటో అమెరికాలో హాట్‌టాపిక్‌ అయింది...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘దుర్గమ్మ’ ప్రచారం.. మండిపడుతున్న హిందువులు..!

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే |

గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే ||

భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||


దసరా నవరాత్రుల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఇళ్లల్లో ఈ శ్లోకం మార్మోగుతూనే ఉంది.. హిందువులంతా దుర్గమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ నియమనిష్టలతో పండుగను జరుపుకుంటుంటారు..  అయితే విచిత్రంగా అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో ఉన్న ఓ ఫొటో అమెరికాలో హాట్‌టాపిక్‌ అయింది... అదేంటీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు.. దుర్గామాతకు సంబంధం ఏంటనే కదా మీ డౌటు.. అమెరికాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూస్తే మీకే తెలిసిపోతుంది..


చూశారు కదా.. దుర్గమ్మ స్థానంలో డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన కమలా హారిస్,  దుర్గమ్మ వాహనం అయిన సింహం స్థానంలో ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఇక చెడుకు ప్రతిరూపం, దుర్గమ్మ అంతమొందించే మహిషాసురుడి స్థానంలో ట్రంప్.. మొత్తంగా ఇదీ అమెరికా నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో.. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో విజయం మనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు కూడా ఇదే ఫొటోను ఉపయోగించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతామూర్తికి సంబంధించిన ఫొటోను ఇలా మార్ఫింగ్ చేసి ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం హేయమైన చర్య అని పోస్టులు పెడుతున్నారు. 


సెనేటర్ కమలా హారిస్ బంధువురాలైన మీనా హారిస్ తన సోషల్ మీడియాలో మొదట ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఏ కారణం వల్లనో ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అయితే అమెరికన్ నెటిజన్లు మాత్రం ఆ ఫొటోను వదల్లేదు.. నెట్టింట రచ్చ రచ్చ చేశారు.. పలు హిందూ సంఘాలు కూడా ఈ పోస్ట్ విషయమై మండిపడుతున్నాయి. మీనాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా కొలిచే దుర్గా మాత ముఖాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం హేయమైన చర్చ.. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది..’.. అంటూ హిందూ అమెరికన్ ఫౌండేషన్ నేత సుహాగ్ ఏ శుక్లా వ్యాఖ్యానించారు. కాగా ఈ ఫొటోకు సంబంధించి  హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యుడు రిషి భుటాడా కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘ఈ ఫొటోను మీనా హారిస్ తయారు చేసింది కాదు.. వాట్సప్‌లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నదానినే ఆమె తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె తన పోస్ట్‌ను డిలీట్ చేసినా.. వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడం మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇలా అమెరికా ఎన్నికల్లో మన దేవుళ్లను ప్రచారంలోకి తీసుకురావడం మంచిది కాదు..’ అని రిషి తేల్చిచెప్పారు.


అమెరికన్ హిందూస్ ఎగైనెస్ట్ డిఫమేషన్ కన్వీనర్ అజయ్ షా కూడా ఈ విషయమై స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ఫొటో ఉందని ఆయన వాపోయారు. మొత్తానికి అమెరికాలోని భారతీయ హిందువులంతా ఈ ఫొటోతో ఎన్నికల ప్రచారాన్ని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. 



Updated Date - 2020-10-20T22:21:08+05:30 IST