వైసీపీ నాయకుని ‘మందు’ చూపు!

ABN , First Publish Date - 2020-04-08T09:14:46+05:30 IST

స్థానిక ఎన్నికల సమయంలో మద్యం పంచకూడదని ఒక పక్క సీఎం ఆదేశాలు జారీ చేస్తే.. మరోపక్క ఆ పార్టీ నాయకుడే ఎన్నికల కోసం అక్రమంగా నిల్వ చేయడమే కాకుండా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విక్రయిస్తూ పట్టుబడ్డ వైనం ఇది.

వైసీపీ నాయకుని ‘మందు’ చూపు!

గిద్దలూరు, ఏప్రిల్‌ 7: స్థానిక ఎన్నికల సమయంలో మద్యం పంచకూడదని ఒక పక్క సీఎం ఆదేశాలు జారీ చేస్తే.. మరోపక్క ఆ పార్టీ నాయకుడే ఎన్నికల కోసం అక్రమంగా నిల్వ చేయడమే కాకుండా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విక్రయిస్తూ పట్టుబడ్డ వైనం ఇది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామానికి చెందిన పిడుగు శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీ పదవికి వైసీపీ తరపున నామినేషన్‌ దాఖలు చేశాడు. ఎన్నికల్లో పంచేందుకు బెంగళూరు నుంచి పలు పర్యాయాలు మద్యం తీసుకువచ్చి ఇంట్లో నిల్వ చేశాడు. అయితే ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మద్యం పంచకుండా దాచుకున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం షాపులు మూతపడ్డాయి.


దీంతో మందుకు డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అదనుగా శ్రీనివాసరెడ్డి ఎన్నికల కోసం తాను అక్రమంగా తెచ్చుకున్న కర్ణాటక మద్యాన్ని భారీ రేట్లకు అమ్మడం ప్రారంభించాడు. ఈ విషయం ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వై.శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఎన్‌.తిరుపతయ్య, స్థానిక సీఐ సోమయ్య, సిబ్బందితో మంగళవారం తెల్లవారుజామున గడికోట వెళ్లి శ్రీనివాసరెడ్డి ఇంటిని తనిఖీ చేశారు. ఇంట్లో, కారులో 25కేసుల మద్యం లభించడంతో స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-04-08T09:14:46+05:30 IST