వయ వందన యోజన సవరణ

ABN , First Publish Date - 2020-05-28T09:02:03+05:30 IST

సవరించిన ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కీము నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగించింది.

వయ వందన యోజన సవరణ

  • స్కీము నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సవరించిన ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కీము నిర్వహణ బాధ్యతను  ఎల్‌ఐసీకి అప్పగించింది. ఏకైక అథీకృత ఆపరేటరుగా ఎల్‌ఐసీ వ్యవహరిస్తుంది. 60 సంవత్సరాలు అంతకు మించిన వృద్ధుల కోసం ఈ పథకాన్ని ఉద్దేశించారు. సవరించిన పెన్షన్‌ రేటుతో సవరించిన (మోడిఫైడ్‌-2020) వయ వందన యోజనను ప్రవేశపెట్టినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. మంగళవారం నుంచి ఈ ప్లాన్‌ను అమ్మకానికి ఉంచారు. 2023, మార్చి 31 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన పాలసీ కొనుగోలుపై ఏడాదికి 7.4 శాతం హామీ కలిగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలాన్ని నెలవారీగా  కూడా పొందొచ్చు. 7.4 శాతం హామీ ప్రతిఫలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసిన పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో కొనుగోలు చేసే పాలసీలకు హామీ ప్రతిఫలాన్ని సమీక్షించి ప్రభుత్వం తర్వాత నిర్ణయిస్తుంది.


పీఎంవీవీవై నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ పెన్షన్‌ స్కీము. దీనికి కేంద్రం రాయితీల రూపంలో సాయం చేస్తుంది. ఈ ప్లాన్‌ కింద కొనుగోలు చేసిన అన్ని పాలసీల విలువ రూ.15 లక్షలు మించడానికి వీలు లేదు. పాలసీని కొనుగోలు చేసే సమయంలో నెల/త్రైమాసికం/అర్ధ సంవత్సరం/సంవత్సర కాల వ్యవధిని ఎంచుకుని పెన్షన్‌ పొందొచ్చు. పాలసీ కాల పరిమితి ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ కొనుగోలు ధర, పెన్షన్‌ చివరి వాయిదాను చెల్లిస్తారు. ఒక వేళ చనిపోతే.. పాలసీ విలువను చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు. 

Updated Date - 2020-05-28T09:02:03+05:30 IST