రివర్స్‌ మోత!

ABN , First Publish Date - 2021-04-20T08:08:31+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలు ఒక్క రోజులోనే అమాంతం రూ.3,222 కోట్ల మేర పెరిగిపోయాయి. హెడ్‌వర్క్స్‌ అంచనాలను ఒక్కరోజులోనే రూ.2,569.61 కోట్లు పెంచేసిన జగన్‌ ప్రభుత్వం.. ఒప్పందంలో లేని పనుల పేరిట మరో రూ.653

రివర్స్‌ మోత!

పోలవరం అంచనాలు పైపైకి!!

ఒక్కరోజే రూ.2,569 కోట్లు 

రివర్స్‌తో రూ.780 కోట్లు ఆదా అని హల్‌చల్‌

గత ప్రభుత్వంపై ఆరోపణల వెల్లువ

నేడు భారీగా అంచనా వ్యయం పెంపు

ప్రధాన డ్యాం పనుల అంచనా వ్యయం రూ.1,656 కోట్లు పెంపు

కుడి కాలువ నుంచి కొత్తగా ఎత్తిపోతల

దీనికి మరో 912.84 కోట్ల ఖర్చుకు సమ్మతి

అదనపు పనుల కోసం ఇంకో రూ.653 కోట్లు

ఇసుకకు 500 కోట్ల అదనపు చెల్లింపులు

అప్పట్లో ‘రివర్స్‌’తో ఆదా అంటూ ప్రచారం

ఇప్పటికి రూ.3222 కోట్లు పెరిగిన వ్యయం

వీటికి పీపీఏ ఆమోదం లభిస్తుందా?


పోలవరం టెండర్లలో అవినీతి జరిగిందన్నారు. జేబులు నింపుకోవడానికే అంచనా వ్యయం పెంచేశారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వందల కోట్లు ఆదా చేశామని ప్రచారం చేసుకున్నారు. కానీ, గుట్టుచప్పుడు కాకుండా వేల కోట్ల అంచనాలు పెంచేశారు. కొత్త ‘పనులను’ కూడా తెరపైకి తెచ్చారు. ‘రివర్స్‌’తో ఏం జరుగుతోంది? ఆదానా? అదనపు వ్యయమా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలు ఒక్క రోజులోనే అమాంతం రూ.3,222 కోట్ల మేర పెరిగిపోయాయి. హెడ్‌వర్క్స్‌ అంచనాలను ఒక్కరోజులోనే రూ.2,569.61 కోట్లు పెంచేసిన జగన్‌ ప్రభుత్వం.. ఒప్పందంలో లేని పనుల పేరిట మరో రూ.653 కోట్లకు టెండర్లను పిలిచేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని నిర్మూలించేందుకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అట్టహాసంగా ప్రకటించారు. టెండరింగ్‌, పనుల అప్పగింతలో అవకతవకల పరిశీలనకు ఓ నిపుణుల కమిటీని కూడా వేశారు. దాని సిఫారసుతో కాంట్రాక్టు సంస్థకిచ్చిన పనులను రద్దుచేశారు. ప్రాజెక్టులో మిగిలిన పనులతో పాటు పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులకు పిలిచిన టెండర్లలో రూ.780 కోట్లు ఆదా అయ్యాయని ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు నానా హడావుడి చేశారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన రూ.1,771.44 కోట్లకు రివర్స్‌ టెండర్‌కు జగన్‌ ప్రభుత్వం వెళ్లింది. ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్‌ రూ.1,548 కోట్లకు టెండర్‌ వేసింది. రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.223.44 కోట్లు మాత్రమే మిగిలింది. కానీ హైడల్‌ ప్రాజెక్టు పనులను కలిపి రూ.780 కోట్లు మిగిలాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ పనులు చేజిక్కించుకున్న కొద్ది నెలల్లోనే .. ఇసుక పాలసీలో వచ్చిన మార్పులు.. మార్గదర్శకాల ప్రకారం మెట్రిక్‌ టన్నుకు రూ.375 చెల్లించాలని, జీఎ్‌సటీ, ఇతర పనులు, టెండర్‌ డాక్యుమెంటులోకి రాని ఇతర పనులకు కూడా కలిపి.. అదనంగా రూ.500 కోట్లను చెల్లించాలని ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వమూ సూత్రప్రాయంగా అంగీకరించింది.


అంటే.. అప్పటికే రివర్స్‌ టెండర్‌లో మిగిలింది రూ.223.44 కోట్లయితే.. అదనపు వ్యయం రూ.276.36 కోట్లు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచేసింది. తాజాగా ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనా వ్యయాన్ని మరో రూ.1,656.61 కోట్లకు పెంచుతూ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం రెండు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, డిజైన్లు, డ్రాయింగ్‌ల రూపకల్పన, ఎల్‌పీ షెడ్యూళ్లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గ్యాప్‌-1, గ్యాప్‌-3, గ్యాప్‌ -2, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌, 25.72 మీటర్ల ఎత్తులో స్పిల్‌వే చెస్ట్‌ నిర్మాణం, వాటికి అవసరమైన అనుబంధ పనులు, 960 మెగావాట్ల హైడ్రో పవర్‌ ప్లాంట్‌ పునాది, అప్రోచ్‌ చానల్‌, ఇన్‌టేక్‌ స్ట్రక్చర్‌, టైల్‌రేస్‌ పూల్‌, టైల్‌ రేస్‌ చానల్‌ వంటి నిర్మాణాల కోసం రూ.5,535.41 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.7,192.02 కోట్లకు పెంచడం మొదటి ఉత్తర్వు.


ఇంకో ఎత్తిపోతలట!

గోదావరిలో వరద ఉధృతి కారణంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. దీని మరమ్మతు కోసం డెడ్‌ స్టోరేజీలోని నీటిని తోడాల్సి ఉంది. ఈ నీటిని తోడాకే మరమ్మతు చేపట్టాలని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) స్పష్టం చేసింది. అయితే.. ఈ నీటిని తోడేందుకు అయ్యే వ్యయం భరించడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టత ఇవ్వలేదు. దీంతో.. ఏకంగా డెడ్‌ స్టోరోజీ నుంచి గోదావరి జలాలను తోడి జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లుగా జల వనరుల శాఖ సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. దీనికి రూ.912.84 కోట్లు వ్యయం అవుతుందంటూ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు ఇచ్చిన నివేదికకు ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఆమోద ముద్ర వేశారు. పాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చారు. 


ఇందులో పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 32 మీటర్ల ఎత్లులోనున్న నీటిని హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కుడి కనెక్టివిటీ పంప్‌ హౌస్‌ పరిధిలోని సివల్‌, హైడ్రో మెకానికల్‌ ఎలకో్ట్రమెకానికల్‌ వర్క్స్‌ చేపట్టేందుకు, సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఏర్పాటు, ఎర్త్‌ వర్క్‌ తదితర పనులు కూడా ఉన్నాయి. అంటే హెడ్‌వర్క్స్‌ పనుల కోసం పెంచిన రూ.1,656.61 కోట్లు.. కొత్త ఎత్తిపోతలకు రూ.912.84 కోట్లు.. వెరసి అంచనా వ్యయం ఒక్క రోజులోనే రూ.2,569.45 కోట్లు పెరిగిపోయింది. ఒప్పందంలో లేని పనుల పేరిట మరో రూ.653 కోట్లకు టెండర్లను పిలిచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అంటే.. అంచనా వ్యయం దాదాపు రూ.3,222 కోట్ల మేర పెరిగిపోయింది. రివర్స్‌ టెండర్‌లో మిగిలిందంటున్న రూ.233.44 కోట్లకు ఇది 14 రెట్లు ఎక్కువన్నమాట. నిజానికి అంచనాలు పెంచాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జలశక్తి శాఖ అనుమతి పొందాలి. కానీ రాష్ట్రప్రభుత్వం దానికి కనీస సమాచారమైనా ఇవ్వలేదని తెలుస్తోంది.


ఆదిలోనే కేంద్రం అభ్యంతరం

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండరుకు వెళ్తున్నప్పుడు కేంద్ర జలశక్తి శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు.. నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తి చేయలేమని స్పష్టం చేసింది. అప్పటి కాంట్రాక్టు సంస్థ వేగంగా .. నాణ్యతతో పనులు చేపడుతున్నందున.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుండా ఉంటే.. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. అంచనా వ్యయం  పెరిగితే రాష్ట్రమే భరించాలని కూడా జగన్‌ సర్కారుకు తేల్చిచెప్పింది. అయినా ముందుకే వెళ్లిన వైసీపీ ప్రభుత్వం.. కేంద్రానికి సంబంధం లేని జలవిద్యుత్కేంద్రంతో కలిపి రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.780 కోట్ల మేర ఆదా చేశామని చెప్పింది. వాస్తవానికి పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.233.44 కోట్లు మిగిలాయని వెల్లడించలేదు. ఇప్పుడు అంచనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం ఏకీభవించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే 2017 మార్చి 15 నాటి కేంద్ర కేబినెట్‌ తీర్మానం మేరకు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 


ఇప్పటికే 2017-18 సవరించిన అంచనా వ్యయం రూ.55,656.61 కోట్లకు కేంద్రం ఆమోదించలేదు. ఈ అంచనా వ్యయం పెంచినందుకే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌.. చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. అడ్డగోలు ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు సవరించిన రూ.55,656.61 కోట్లను ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరారు. లేఖలూ రాశారు. చివరకు కేంద్ర శాఖలే కుదించిన అంచనా వ్యయం రూ.47,774.87 కోట్లకైనా సమ్మతి తెలపాలని కేంద్రాన్ని వేడుకుంటున్నా ఫలితం లేదు. 45.72 మీటర్ల ఎత్లులో 196 టీఎంసీల నిల్వ చేసేందుకు వీలుగా భూసేకణ కోసం రూ.33,000 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. అయితే... ఇప్పుడు కొత్తగా 41.15 మీటర్ల ఎత్తులోనే 126 టీఎంసీల నిల్వకు పరిమితం చేస్తూ.. కేవలం రూ.333 కోట్ల మేర భూ సేకరణ, పునరావాసంతో ముగించి.. ప్రాజెక్టును తానే పూర్తిచేశానని ప్రచారం చేసుకోవడానికి జగన్‌ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. దీనికీ కేంద్ర జల సంఘం ఆమోదించడం లేదు. మరి తాజా పెంపును ఆమోదిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి.


అంతన్నారు.. ఇంతన్నారు!

చంద్రబాబు ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిందని.. ముఖ్యంగా పోలవరంలో దోపిడీ చేసింద ని పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల ప్రచారంలో.. చివరకు సీఎం అయిన తర్వాత కూడా జగన్‌ ఆరోపించారు. 2019 సెప్టెంబరు 20న అనిల్‌కుమార్‌ నెల్లూరులో మాట్లాడుతూ.. తొలిరివర్స్‌ టెండరింగ్‌లోనే రూ.300 కోట్ల పనుల్లో రూ.50 కోట్లు ఆదా అయ్యానని.. ఈ ఆదా అయి న సొమ్ము నాటి సీఎం చంద్రబాబు జేబుల్లో నింపుకొన్నారని ఆరోపించారు. ఇప్పుడేమో ఒకేసారి భారీగా అంచనా లు పెంచేశారు. జగన్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంట నే సాగునీటి ప్రాజెక్టులకు రివర్స్‌ టెండర్లను పిలిచారు. హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనులకు రూ.1,771.44 కోట్లతో టెండర్లు పిలిస్తే మేఘా సంస్థ ఒక్కటే రూ.1,548 కోట్లకు టెండరు వేసింది. అంటే.. 223.44 కోట్లు తక్కువగా కోట్‌ చేసింది. కనీసం 2 సంస్థలు పాల్గొంటేనే రివర్స్‌ టెండరిం గ్‌ అవుతుంది. ఒక్కటే పాల్గొనడంతో దీనిని జలవనరుల శాఖ రీటెండర్‌గా పరిగణించింది. 


ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని 2019 నవంబరు 8న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంటే.. ఈ ఏడాది నవంబరు 8వ తేదీనాటికి ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాలి. అయితే, కాంట్రాక్టు తీసుకున్న కొన్ని నెలలకే రూ.500 కోట్ల అదనపు చెల్లింపులకు ప్రతిపాదనలు పంపింది. గతంలో ఉచిత ఇసుక విధానం ఉండేదని.. ఇప్పుడది లేనందున టన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని.. ఇతరత్రా పనులన్నిటికీ కలిపి మొత్తం రూ.500 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం ఆమోద ముద్ర కూడా వేసింది. రూ.223 కోట్లు ఆదా అయినట్లు చెప్పి.. దానికి 226 కోట్లు అదనంగా కలిపి సమర్పించుకుంటోందన్న మాట. నిజానికి రివర్స్‌ టెండరింగ్‌ నాటికే జగన్‌ ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేయడం గమనార్హం. 


ఎందుకీ ఎత్తిపోత?

పోలవరం ప్రాజెక్టులో రూ.912 కోట్ల కొత్త ఎత్తిపోతల ప్రతిపాదనను ఆకస్మికంగా తెరపైకి తీసుకురావడంలోని మతలబు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అస్మదీయుల కోసమే దీనిని సిద్ధం చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో జల వనరుల శాఖ ఇలాంటి ప్రతిపాదనలు చేయలేదు. కానీ అకస్మికంగా పశ్చిమగోదావరి-కృష్ణా జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాలకు నీరందించేందుకంటూ ఈ ప్రతిపాదన తెచ్చింది. దీని ద్వారా జనవరి నుంచి ఏప్రిల్‌ దాకా ఎన్ని నీళ్లు ఎత్తిపోస్తారో నికరమైన వివరాలు లేవు. ఇవేమీ లేకుండా ఏకంగా రూ.912 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-04-20T08:08:31+05:30 IST