అటు రాలని కాసులు.. ఇటు అంచనాల పెంపు

ABN , First Publish Date - 2021-04-22T10:27:30+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయినట్లేనా? జగన్‌ ప్రభుత్వం ఒకవైపు డిజైన్లు మార్చుతూ.. అంచనా వ్యయాన్ని పెంచుతూ పోతోంది. మరోవైపు తుది అంచనా వ్యయం రూ. 20,398.61 కోట్లకే తాము పరిమితమైనట్లు మోదీ ప్రభుత్వం గతేడాది అక్టోబరు 12నే రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది.

అటు రాలని కాసులు.. ఇటు అంచనాల పెంపు

  • పోలవరానికి అందని కేంద్ర నిధులు
  • తుది అంచనా రూ.20,398 కోట్లకే పరిమితం
  • ఇక ఇవ్వాల్సింది 4,819 కోట్లే
  • నిరుడు అక్టోబర్లోనే తేల్చేసిన మోదీ సర్కారు
  • రాష్ట్ర వినతులను పట్టించుకోని వైనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయినట్లేనా? జగన్‌ ప్రభుత్వం ఒకవైపు డిజైన్లు మార్చుతూ.. అంచనా వ్యయాన్ని పెంచుతూ పోతోంది. మరోవైపు తుది అంచనా వ్యయం రూ. 20,398.61 కోట్లకే తాము పరిమితమైనట్లు మోదీ  ప్రభుత్వం గతేడాది అక్టోబరు 12నే రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇందులోనూ.. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రూ.4,730.71 కోట్లను వ్యయం చేసినందున మిగిలిన రూ.15,667.90 కోట్లను మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని తేల్చేసింది. సదరు లేఖ రాసిన తేదీకి రూ.8,614.16 కోట్లు రీయింబర్స్‌ చేసినందున.. ఇక ఇవ్వాల్సింది రూ.7053.74 కోట్లేనని తెలిపింది. ఆ మొత్తంలోనూ రూ.2,234.288 కోట్లు తిరిగి చెల్లిస్తున్నందున రూ.4,819.512 కోట్లు మాత్రమే ఇక ఇవ్వాల్సి ఉంటుందని నిర్మొహమాటంగా తెలియజేసింది. ఈ నెల ఏడో తేదీన ముఖ్యమంత్రి జగన్‌ జరిపిన సమీక్షలో పోలవరం ప్రాజెక్టు వ్యయంపై అధికారులు విశదీకరించారు. ఇప్పటివరకూ రూ. 17,153.54 కోట్లు ఖర్చుచేశామని.. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.12,422.83 కోట్లు ఖర్చు చేశామని.. ఈ మొత్తంలో రూ.10,741.46 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేసిందని.. మరో రూ.1,881.37 కోట్లు రావాలని వివరించారు.


రాష్ట్రప్రభుత్వం సవరించి పంపిన తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని.. అయితే కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని నియమించగా.. అది రూ.47,725.74 కోట్లుగా ఖరారుచేసిందని గుర్తుచేశారు. ఇందులో భూసేకరణన, సహాయ పునరావాసానికి రూ.2,817.21 కోట్లు, హెడ్‌వర్క్స్‌కు 9,734,34 కోట్లు, కుడి ప్రధాన కాలువకు రూ.2865.75 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.2,720.80 కోట్లు, పవర్‌ హౌస్‌ కోసం రూ.4,124.84 కోట్లు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) వ్యయం రూ.108 కోట్లు అని తెలిపినట్లు చెప్పారు. ఇందులో పవర్‌ ప్రాజెక్టు విలువ రూ.4124.84 కోట్లు తీసేస్తే .. రూ.43,600.90 కోట్లు అవుతాయని  అధికారులు వివరించారు. కానీ .. ఈ నిధుల మంజూరుపై కేంద్రం మాట్లాడడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలనూ పట్టించుకోవడం లేదని జలవనరులశాఖ ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి. ఓపక్క కేంద్రం నిధులిస్తుందో లేదోనన్న సందేహాలతో సతమతమవుతుంటే తాజాగా హెడ్‌వర్క్స్‌ అంచనాలు పెంచిందని, దీనిని జలశక్తి శాఖ ఏ మేరకు ఆమోదిస్తుందో చూడాలని వ్యాఖ్యానిస్తున్నాయి.


పోలవరం 41.15 మీటర్లేనా?

ప్రాజెక్టుల భూసేకరణపై నేడు సీఎం సమీక్ష

ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి


అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తారా.. 45.72 మీటర్ల గరిష్ఠ సామర్థ్యం మేరకు భూసేకరణకు జగన్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతుందా అనే సందేహాలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు నిధుల మంజూరుపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో అత్యంత ప్రాధాన్యమైనది పోలవరం భూసేకరణ 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితం చేస్తారా? 45.72 మీటర్లకు కాంటూరు దాకా ఆమోద ముద్ర వేస్తారా అనేది తేలవచ్చని జలవనరుల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. 41.15 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యాంలను నిర్మిస్తున్నందున ముందస్తుగా ఈ కాంటూరు పరిధిలోని నిర్వాసితులను తక్షణమే తరలించాల్సి ఉంది. జూన్‌ నుంచి గోదావరికి వరదలు వస్తే .. ముంపు ప్రాంతాలు మునిగిపోతాయి.


వాస్తవానికి గత ఏడాది జూలై 8వ తేదీ నాటికి 50 వేల గృహాలను నిర్మిస్తామని.. నిర్వాసితులను తరలిస్తామని జల వనరుల శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు వేయలేదు. 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితం చేస్తే.. ఇక పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కాకుండా... రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల్లో ఒక పెద్ద పథకంగా మిగిలిపోతుందన్న విమర్శలూ ఉన్నాయి. నీటి నిల్వను 45.72 మీటర్ల కాంటూరులో నిల్వ చేసి 196 టీఎంసీలను నింపుకోగలిగితే.. ఏటా రెండు దఫాలుగా సాగుకు నీరందించడంతోపాటు.. రాష్ట్రమంతా గోదావరి జలాలను పారించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని నీటిరంగ నిపుణులు చెబుతున్నారు.


వేల కోట్లు దోచుకోవటానికేనా?: దేవినేని ఉమా

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): టీఏసీలో చంద్రబాబు పోలవరానికి రూ.55,548 కోట్లకు ఆమోదం తెస్తే, 28 మంది ఎంపీలుండీ, డీపీఆర్‌-2కు ఆర్థికశాఖ ఆమోదం తెచ్చుకోకపోవడం అంచనాలు పెంచి, వేల కోట్లు దోచుకోవటానికేనా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 960 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్‌ పనులు గాలికొదిలేసి, నిర్వాసితులకు అన్యాయం చేయడంపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ‘‘సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా రెండేళ్లుగా వాయిదాలు ఎగ్గొడుతున్న విజయసాయిరెడ్డీ... బాబాయ్‌ని ఎవరు చంపా రు? కుట్లు వేసిందెవరు? రక్తపు మరకలు తుడిచిందెవరు? సీబీఐ ముందు చెప్పే ధైర్యం ఉందా? గొడ్డలిపోటును గుండెపోటుగా చెప్పిన ఘనుడివి. హూ కిల్డ్‌ బా బాయ్‌ అని రాష్ట్రం అడుగుతుంటే జగన్‌ ఎందుకు చె ప్పడం లేదు?’’ అని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-04-22T10:27:30+05:30 IST