పోలవరం నుంచి.. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు నీరిస్తాం

ABN , First Publish Date - 2021-06-03T09:32:26+05:30 IST

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు నీరిస్తామని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆయన బుధవారం ప్రాజెక్టులోని స్పిల్‌వేపై జరిగిన కాంక్రీటు పనులను...

పోలవరం నుంచి.. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు నీరిస్తాం

  • కరోనా కారణంగా పనులు ఆలస్యం
  • మంత్రి అనిల్‌కుమార్‌ వెల్లడి

పోలవరం, జూన్‌ 2: పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు నీరిస్తామని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆయన బుధవారం ప్రాజెక్టులోని స్పిల్‌వేపై జరిగిన కాంక్రీటు పనులను, అప్రోచ్‌ చానల్‌లో మట్టి తరలింపు, ఎగువ కాఫర్‌డ్యాం, గ్యాప్‌ కాంక్రీటు పనులు, డయాఫ్రం వాల్‌, స్పిల్‌ వేలో రేడియల్‌ గేట్ల అమరిక, స్పిల్‌ వే రివర్‌ స్లూయిజ్‌, స్పిల్‌ చానల్‌ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారాలు, ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్షలో మాట్లాడారని, ఈ నెల 15వ తేదీ నాటికి స్పిల్‌ వే, రివర్‌ స్లూయిజ్‌ ద్వారా గోదావరి జలాలను సహజ ప్రవాహంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వేల మంది కార్మికులతో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు వెనుకంజ వేయకుండా నిర్మాణ పనులు చేయిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఇద్దరు జేఈలను, ముగ్గురు ఈఈలను, 20 మంది ఇంజనీరింగ్‌ సిబ్బందిని కోల్పోయామని తెలిపారు. మేఘా కంపెనీ ఇద్దరు ఇంజనీర్లను కోల్పోయిందని, వేల మంది కార్మికులు కరోనా భయంతో ప్రాజెక్టును విడిచి వెళ్లిపోవడంతో కార్మికులను మళ్లీ సమీకరించుకుని పనులు చేయల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.


కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్‌ నాటికి 17 వేల కుటుంబాలను పునరావాసాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ.. కార్మికుల సమస్య వల్ల వీలు పడలేదన్నారు. కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం చూపించిన అజాగ్రత్త వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బ తింద న్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో 73.45 శాతం హెడ్‌వర్క్‌ పను లు, 75.5 శాతం మెయిన్‌ డ్యాం పనులు, 61.23 శాతం కనెక్టవిటీ ప్యాకేజ్‌, 51.73 శాతం లెప్ట్‌ కనెక్టవిటీ పనులు, 72.81 శాతం కుడికాలువ కనెక్టవిటీ పనులు, 70.09 శాతం ఎడమ ప్రధాన కాల్వ పనులు, 90.60 శాతం కుడి ప్రధాన కాల్వ పనులు జరిగినట్లు తెలిపారు. ఈ నెల 15 నాటికి ఎల్‌అండ్‌టీపేట పునరావాసాల్లో మౌలిక వసతులు పూర్తి గా కల్పించాలని, ఆగస్టు నాటికి తాడువాయిలో 3905 పునరావాస కాలనీలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.  


ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

పోలవరం జాప్యంపై దేవినేని  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పడకేయించినందుకు వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంలో 72 శాతం పను లు పూర్తి చేసి మిగిలిన పనిని ఈ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిందని, ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తం పనులు పూర్తి చేస్తామని జగన్‌ ప్రభుత్వం బీరాలు పలికిందని,  ఎక్కడ పని అక్కడే ఉందని విమర్శించారు.   కనీసం నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించలేకపోయారన్నారు.


Updated Date - 2021-06-03T09:32:26+05:30 IST