అనాథాశ్రమం ముసుగులో వృద్ధులను మోసం చేసిన మహిళ

ABN , First Publish Date - 2020-12-16T15:26:01+05:30 IST

ఇద్దరూ వృద్ధ దంపతులు.. అన్యోన్యమైన జంట..

అనాథాశ్రమం ముసుగులో వృద్ధులను మోసం చేసిన మహిళ

  • ఆసరా కాదు.. టోకరా..!
  • రూ. 24లక్షలు దోచేసిన కేటుగాళ్లు
  • అరెస్ట్‌, రిమాండ్‌కు తరలించిన రాచకొండ పోలీసులు


హైదరాబాద్ : ఇద్దరూ వృద్ధ దంపతులు.. అన్యోన్యమైన జంట.. వయసు 70 ఏళ్ల పై మాటే. భర్త రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కాగా.. భార్య గృహిణి. వారికి పిల్లలు లేరు. అయిన వాళ్లు ఎవరూ అండగా లేరు. ఒంటరిగానే బతుకుతున్నారు. తమ పనులు తాము చేసుకునే పరిస్థితి లేదు. ఎవరైనా మంచి వాళ్లు తమను దగ్గరకు తీసి ఆదుకుంటే.. తాము సంపాదించిన రూ.35 లక్షలు వారికి ఇచ్చేయాలని అనుకున్నారు. కానీ వారికి ఎవరూ దొరకలేదు. ఈ క్రమంలో చెం గిచెర్లలో ఉన్న అనాఽఽథాశ్రమం నిర్వాహకులను సంప్రదించారు. వివరాలు తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు వారి డబ్బుపై కన్నేసింది. ఎలాగైనా వారిని మచ్చిక చేసుకొని ఆ డబ్బు కొట్టేయాలని పథకం వేసింది. ఎలాగోలా ఆశ్రమం నుంచి బయటపడ్డ వృద్ధులు పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్ల్లబోసుకున్నారు. 


రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్రమ నిర్వాహకురాలితో పాటు.. ఆమె భర్తను, మరికొందరిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్లలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ప్రీ విలేజ్‌లో రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జ గారి సత్యనారాయణ(72) భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఏదైనా వృద్ధ్దాశ్రమంలో చేరి తమను బాగా చూసుకునేవారికి తమ దగ్గర ఉన్న డబ్బులను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో చెంగిచర్ల ప్రీ విలేజ్‌లోనే ఉంటున్న అమ్మ ఆసరా ఫౌండేషన్‌ నిర్వాహకురాలు కస్తూరి విజయలక్ష్మి(62)ని సంప్రదించి వారి మనసులో మాట చెప్పారు. జీవితాంతం మిమ్మల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటామని, ఏ లోటూ రానివ్వమని విజయలక్ష్మి మాట ఇచ్చింది. దాంతో వారు 2019 అక్టోబర్‌లో ఆశ్రమంలో చేరారు. చేరిన కొద్దిరోజులకే విజలయక్ష్మి ఫ్లాటు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకు అవసరమైన డబ్బును సత్యనారాయణ దంపతుల వద్ద తీసుకోవాలని పథకం వేసింది.


వారికి మాయ మాటలు చెప్పి, మీ డబ్బు తిరిగి చెల్లిస్తానని నమ్మబలికి రూ. 24 లక్షలను తీసుకుంది. అనంతరం వారిని సరిగా చూడటం మానేసింది. ఆ దంపతులు అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రికి సైతం  ఆమె తీసుకెళ్లడం లేదు. ఆమె పట్టించుకోకపోవడంతో తమ డబ్బులు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. తాను డబ్బులు తిరిగి ఇవ్వలేనని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని విజయలక్ష్మి, ఆమె భర్త బెదిరించారు. రేప్‌ కేసు పెట్టి జైలుకు పంపిస్తానని సత్యనారాయణను బెదిరించారు. దాంతో గత్యంతరం లేని వృద్ధ దంపతులు ఆశ్రమం నుంచి బయటపడి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కస్తూరి విజయలక్ష్మిని, ఆమె భర్త భాస్కర్‌ను, కుమార్తె సౌమ్య, మరోవ్యక్తి రామ్మోహన్‌పై కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


Updated Date - 2020-12-16T15:26:01+05:30 IST