Abn logo
Jul 2 2020 @ 00:35AM

రాజకీయ జ్ఞాపకాలు, జ్ఞాపక రాజకీయాలు

జాతీయస్థాయిలో పి.వి.కి ఎంత ఘనత ఉన్నా, దాన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్వయించడమెలాగో మనకు అర్థం కాకపోయినా, కెసిఆర్‌కు ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. బహుశా, ఈ విషయంలో కెసిఆర్‌ గురిపెట్టింది కాంగ్రెస్‌కు కాక, భారతీయ జనతా పార్టీకి ఏమో? పటేల్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి తరువాత నరసింహారావు జ్ఞాపకాన్ని తమ పరంపరలో కలుపుకుందామని చూస్తున్న భారతీయ జనతా పార్టీ పైచేయి అయ్యేందుకేనేమో ఈ అంగరంగ వైభవ స్మృతి ఉత్సవాలు?


మౌనముని అని పేరు తెచ్చుకున్న పి.వి. కాలాన్ని, వ్యవస్థను మలుపుతిప్పే సాహసాలను స్వభావరీత్యా ఇష్టపడేవారు కాదు. చరిత్రగమనాన్ని, దానిలోని వైచిత్రులను ఆసక్తితో గమనించే తాత్వికుడు కావచ్చునేమో కానీ, చరిత్రను మార్చే కర్తవ్యాలను ఆయన పెట్టుకోలేదు.


ప్రజలకు ఎంత మతిమరుపు ఉంటే నాయకులకు అంత మంచిది అని అంటుంటారు, కానీ అది కేవలం చమత్కారం మాత్రమే. ఏలికలు కోరుకున్న విషయం మరచిపోవాలి, వారు చెప్పిన అంశం గుర్తుపెట్టుకోవాలి. గడ్డకట్టిన నిశ్శబ్దం, అంతరించిన ఆనవాళ్లు, పాతిపెట్టిన సత్యం– మరుపును విధిస్తాయి. హోరోత్తించే భజనలు, అడుగడుగునా సంకేతాలు, క్షణం కూడా ఆదమరచలేనంత ప్రచారం జ్ఞాపకాన్ని ఉద్దీపింపజేస్తాయి. స్మృతి, విస్మృతి కీలకమైన రాజకీయ దినుసులు. అన్యాయమో, అఘాయిత్యమో జ్ఞాపకం అయినప్పుడు, అది వర్తమానంలో ప్రతీకారానికి ప్రేరణ ఇస్తుంది. ఒక జ్ఞాపకం అధికారపు భద్రతకు హానికరం అయినప్పుడు, విస్మృతి యథాతథస్థితికి పూచీపడుతుంది.


ఈ మధ్య రెండు అంశాలు మన జ్ఞాపకాలను స్పృశించాయి. ఒకటి– నలభై ఐదేళ్ల నాటి అత్యవసర పరిస్థితి. చీకటి రోజులు, ప్రజాస్వామ్యం రద్దు, భావాలకు సంకెళ్లు, వార్తలకు సెన్సార్‌, కార్యకర్తలందరికీ కటకటాలు. మూడు దశాబ్దాలు కాకుండానే స్వతంత్ర భారతదేశం అంతటి నియంతృత్వంలోకి వెళ్లడం విషాదమే. ఆ నాటి ఆ దుర్మార్గంలో ఏడాదిన్నరకు పైగా నిర్బంధంలో గడిపినవారిలో కొందరు ఇప్పుడు ఉన్నతస్థానాలలో ఉన్నారు. కొందరు ఇప్పుడు కూడా నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. ఇందిరాగాంధీ తన అధికారానికి తిరుగులేకుండా చేసుకోవడానికి, న్యాయవ్యవస్థను ధిక్కరించి, ప్రజాస్వామ్యాన్ని అపహసించి ఎమర్జెన్సీని విధించారు. పైగా, ఆ నిర్బంధ కాలాన్ని అనుశాసన పర్వమని, ప్రగతిశీల ఘట్టమని చాటింపు వేశారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ తేడా ఎంత? ఆనాడు మూకుమ్మడి నిర్బంధం, ఇప్పుడు గురిపెట్టిన నిర్బంధం. అప్పుడు పత్రికలకు సెన్సార్‌, ఇప్పుడు సెన్సారే అవసరంలేని మంత్రాంగం. అప్పటికింకా టాడా లేదు, పోటా లేదు. ఇప్పుడు, రౌలట్‌ చట్టాన్నే తలదన్నిన ఊపా ప్రజాస్వామ్య శిరస్సు మీద మహాఖడ్గమై ఊగుతున్నది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, ఇందిర ఎమర్జెన్సీ కేవలం అధికార లాలసతో చేసిందే, తప్ప, దేశప్రజల బౌద్ధిక, మానసిక చట్రాలను మార్చివేసి, మరబొమ్మలుగా మార్చాలన్న పెద్ద ప్రాజెక్టు ఏదీ ఆమెకు లేదు. ప్రజల ఆలోచనలను కట్టడి చేసి, మరమ్మత్తు చేసి, వశీకరణం చేసుకోవాలన్న వ్యూహం ఆమెకు ఉందని చెప్పలేము. కానీ, ప్రస్తుత పరిస్థితి అట్లా లేదే? సమస్త వ్యవస్థలను దారికి తెచ్చుకుని, అభిప్రాయ, భావ కల్పనా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని, ప్రత్యర్థులపై సడలింపు లేని కాఠిన్యం చూపుతున్న పాలనలను చూస్తున్నాము. ఎవరో వ్యాఖ్యానించినట్టు, ఇప్పటి చిమ్మ చీకటిలో ఆ నాటి జ్ఞాపకం మసకచీకటిగా మాత్రమే అనిపిస్తున్నది తప్ప మరింత అంధకారంగా కాదు. 


వర్తమాన పరిస్థితులలోని ఆత్యయిక స్థితిని చూడకుండా, తీవ్రజాతీయత, ఆత్మనిర్భరతల మేలిముసుగు కప్పుకున్నప్పుడు, నలభైఐదేళ్ల నాటి జ్ఞాపకమే భయానకంగా కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితిని, దాని బాధలను అనుభవించిన వారి ప్రతినిధిగా ఇప్పుడు అధికారంలో ఉన్న జాతీయపార్టీ నాటి జ్ఞాపకాన్ని ఒక నైతిక ట్రోఫీగా ప్రదర్శించాలని ప్రయత్నించింది. చేవచచ్చి ఉన్న కాంగ్రెస్‌ను మరో దెబ్బ వేయడానికి పనికివచ్చింది కూడా. ఎమర్జెన్సీని ఎందరో ఎదిరించారు, ఎందరో లొంగిపోయారు. ఇందిరకు తోకగా మారిన వారి సంగతి వదిలిపెడితే, తక్కిన ఏ రాజకీయపక్షంలోనూ పూర్తిగా వీరత్వాన్నే చూపినవారు లేరు, అందరూ లొంగిపోయినవారే లేరు. అనేక పార్టీలలో ఎమర్జెన్సీ గురించిన భేదాభిప్రాయాలు అంతర్గతంగా రాజుకున్నాయి కూడా. సంఘ్‌పరివార్‌, దాని రాజకీయ ప్రతినిధులు కూడా పూర్తిగా ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు కాదు. నానాజీ దేశ్‌ముఖ్‌ వంటి వారు గట్టి వైఖరి తీసుకోగా, మరి కొందరు మెతక వైఖరి తీసుకున్నారు. పెద్ద పెద్ద నాయకులే ఇందిరాగాంధీ నుంచి వెసులుబాట్లను పొందారు. పాకిస్థాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు, ఆ దేశాన్ని రెండుగా విభజించినందుకు ఇందిర అంటే సానుకూలత ఉన్న వారు సంఘ్‌పరివార్‌ నాయక శ్రేణులలో కూడా ఉండేవారు. కానీ, ఆ నాటి విశేషాలను మరుగుపరచి, కాంగ్రెస్‌ చేసిన అఘాయిత్యానికి తాము బాధితులమని, దాన్ని ఎదిరించిన ప్రజాస్వామిక వీరులమని ఇప్పుడు కొందరు ప్రకటించదలచుకున్నారు. అదే సమయంలో, అత్యవసర పరిస్థితికీ, ఇప్పటికీ ప్రజాస్వామ్యం స్థితిగతుల గురించీ తారతమ్య చర్చ వస్తుందని వారు మరచిపోయారు.


జ్ఞాపకరంగంలో క్రీడలాడిన మరొక అంశం– పి.వి. నరసింహారావు శతజయంతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, భారతదేశ హోంమంత్రిగా, విద్యామంత్రిగా, విదేశాంగమంత్రిగా, ప్రధానమంత్రిగా, భారతజాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా – ఇన్ని కీలకపదవులలో ఉండిన వ్యక్తి శతజయంతి ఉత్సవాలు జరగడంలో, జరపడంలో ఆశ్చర్యమూ లేదు, అసహజత్వమూ లేదు. అంతా బాగుంటే, అంటే ఆయన జీవితాంతం కలసి నడిచిన పార్టీ ఇందులో అగ్రగామిత్వం తీసుకుని ఉంటే, ఇప్పుడు జరుగుతున్న దాని కంటె కూడా అట్టహాసంగా చేయవచ్చును. అలా కాక, చొరవా, ఉత్సాహమూ ఇతర శిబిరాల నుంచి రావడం ప్రత్యేకమైన కుతూహలాన్ని కలిగిస్తున్నది. ఎమర్జెన్సీ జ్ఞాపకం లాగానే, ఈ జ్ఞాపకం కూడా కాంగ్రెస్‌ను బాధించేది. పి.వి. నరసింహారావు అంత్యక్రియలు జరిగిన తీరు, ఢిల్లీలో ఆయన పార్థివదేహాన్ని పార్టీ ఆఫీసులో ప్రదర్శించడానికి నిరాకరించడం– ప్రజల నిరసనను పొందిన సంఘటనలు (నిజానికి, ఆ సమయంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో కెసిఆర్‌ భాగస్వామిగా ఉన్నారు). కాంగ్రెస్‌ పార్టీని మరోసారి బోనులో నిలబెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి పి.వి. శతజయంతి సందర్భం ఒక అవకాశం ఇచ్చింది. కానీ, ఇప్పుడు అర్జెంటుగా కాంగ్రెస్‌ను దెబ్బతీయవలసిన అగత్యమేమీ లేదు. వారిప్పట్లో కోలుకునే సూచనలేమీ కనిపించడం లేదు కూడా. తెలంగాణకు చెందిన ఒక ప్రముఖవ్యక్తి, తన పార్టీకి చెందని వ్యక్తికి ఘననివాళి ఇవ్వడం ద్వారా భావోద్వేగాలను అదనంగా సంతృప్తి పరచడం ఆయన లక్ష్యం కావచ్చు. వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను ఇన్ని ఏండ్ల తరువాత బిజెపిలో కలుపుకున్నట్టు, నరసింహారావును మరణానంతరం కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్రసమితిలో చేర్చుకున్నారా– అన్న కొంటె సందేహం కూడా మనకు కలగవచ్చు. 


సుదీర్ఘమైన, బహుముఖమైన వ్యక్తిత్వం నరసింహారావుది. ఆయన రచయిత, అనువాదకుడు, పండితుడు. అదే సమయంలో ఆయన జనరంజక నాయకుడు కాదు. మొదటి తెలంగాణ ఉద్యమం తరువాత ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. తెలంగాణ వాడు కావడం వల్లనో, భూసంస్కరణలను ప్రవేశపెట్టినందుకో– ఆయన దీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగలేదు. కానీ, ఆయన ప్రత్యేక వాది కారు. తెలంగాణ వెనుకబాటుతనం విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా కానీ, కేంద్రమంత్రిగా కానీ, ప్రధానిగా కానీ ప్రత్యేక శ్రద్ధ చూపినవారు కాదు. తెలంగాణ ఉద్యమం మలిదశ గురించి ఆయన చివరి రోజులలో ఆసక్తిగా తెలుసుకునేవారని అంటారు, అంతకుమించి తెలంగాణ ఉద్యమానికి ఆయనకు సంబంధం లేదు. ఢిల్లీకి రాజయినా, తల్లికి కొడుకు కాలేకపోయారని ఆరోజుల్లో ఉద్యమకారులు వ్యాఖ్యానించేవారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు అయిన కెసిఆర్‌, ఏ కోణంలో పి.వి. నరసింహారావును 360 డిగ్రీల వ్యక్తిత్వం అన్నారో తెలియదు.


దురదృష్టవశాత్తూ, పి.వి. అనేక కీలకఘట్టాలలో కీలకమయిన బాధ్యతలలో ఉండి, వైఫల్యాలను చవిచూశారు. ఇందిర హత్య, అనంతరం సిక్కుల ఊచకోత సమయాల్లో కేంద్రహోంమంత్రిగా ఉన్నారు. బాబ్రీమసీదు కూల్చివేత ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో జరిగిన అతి పెద్ద ఘటన. దీని విషయమై సొంత పార్టీ వారే ఆయనను తప్పు పట్టారు. ప్రధానిగా ఉన్న కాలంలోనే పంజాబ్‌లో, కశ్మీర్‌లో కఠినమైన చర్యలు– ఆయా వర్గాల వారి నుంచి నిరసనలకు కారణమయ్యాయి. ఇక ఆయన కిరీటంలో కలికితురాయిగా అందరూ చెప్పే ఆర్థిక సంస్కరణలు కూడా, వాటిని స్వాగతించేవారు మాత్రమే మెచ్చేవి. ఒక కీలకమయిన దశలో కీలకమయిన నిర్ణయం తీసుకోవడంలో వ్యక్తిగత చొరవ ఉన్నప్పటికీ, ఆ దశకు పూర్వదశ, ఒక అనూచాన క్రమం, గ్లోబల్‌ పరిణామాల దోహదం కూడా ఉన్నాయి. అసమగ్రమో, అసమర్థమో– ఏమయినప్పటికీ 1972లో భూసంస్కరణలకు ఆయన చేసిన ప్రయత్నం మాత్రం ప్రశంసనీయం. అదే సమయంలో ఆ సంవత్సరం ఎన్నికలలో బిసి కులాల వారి అభ్యర్థులను పెద్దసంఖ్యలో ఎంపిక చేసి, సామాజిక సమతుల్యతకు సానుకూల పక్షపాతమే మార్గమని ఆయన సూచించారు. మౌనముని అని పేరు తెచ్చుకున్న పి.వి., కాలాన్ని, వ్యవస్థను మలుపుతిప్పే సాహసాలను స్వభావరీత్యా ఇష్టపడేవారు కాదు. చరిత్రగమనాన్ని, దానిలోని వైచిత్రులను ఆసక్తితో గమనించే తాత్వికుడు కావచ్చునేమో కానీ, చరిత్రను మార్చే కర్తవ్యాలను ఆయన పెట్టుకోలేదు. ‘‘ఈ దేశంలో యు–టర్న్‌లు సాధ్యం కావు. ఎక్కడ నిలచున్నామో, ఎటు కదులుతున్నామో అవగాహన ఉంటే మాత్రమే మలుపు తిరగడం కుదురుతుంది‘‘ – అన్నారాయన శేఖరగుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆయన రావడం, కాలం కలసి రావడం– రెండూ ఒకేసారి జరిగాయని రాజ్‌మోహన్‌గాంధీ అంటారు. 


జాతీయస్థాయిలో పి.వి. కి ఎంత ఘనత ఉన్నా, దాన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్వయించడమెలాగో మనకు అర్థం కాకపోయినా, కెసిఆర్‌కు ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. బహుశా, ఈ విషయంలో కెసిఆర్‌ గురిపెట్టింది కాంగ్రెస్‌కు కాక, బిజెపికి ఏమో? పటేల్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి తరువాత నరసింహారావు జ్ఞాపకాన్ని తమ పరంపరలో కలుపుకుందామని చూస్తున్న బిజెపిపై పైచేయి అయ్యేందుకేనేమో ఈ అంగరంగ వైభవ స్మృతి ఉత్సవాలు?


కె. శ్రీనివాస్