పేద పిల్లల విద్యాజ్యోతి!

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

‘‘పిల్లలే మన దేశ భవిష్యత్తు. కాబట్టి వారికి నాణ్యమైన చదువును అందించడంలో రాజీ పడకూడదు’’ అంటారు జ్యోతి త్యాగరాజన్‌.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపరచడానికి ఆమె ప్రారంభించిన ‘మేఘశాల’ దేశవ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులకు

పేద పిల్లల విద్యాజ్యోతి!

‘‘పిల్లలే మన దేశ భవిష్యత్తు. కాబట్టి వారికి నాణ్యమైన చదువును అందించడంలో రాజీ పడకూడదు’’ అంటారు జ్యోతి త్యాగరాజన్‌.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపరచడానికి ఆమె ప్రారంభించిన ‘మేఘశాల’ దేశవ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. లక్షల మంది విద్యార్థుల వికాసానికి దోహదం చేస్తోంది. 


‘‘అందరికీ విద్య అనే ఆశయం గొప్పదే. అదే సమయంలో అందరికీ ఒకే స్థాయిలో నాణ్యమైన విద్య అందాలి. కానీ డబ్బు ఖర్చుపెట్టగలిగే స్థోమత ఉన్న వారి పిల్లలు ఉన్నతమైన పాఠశాలల్లో, అత్యాధునికమైన పద్ధతుల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే దిగువ తరగతి పిల్లలు వారితో పోటీ పడాలంటే బోధనా పద్ధతుల్లో మార్పులు తప్పనిసరి’’ అని నిర్ద్వంద్వంగా చెబుతారు జ్యోతి త్యాగరాజన్‌. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జ్యోతి న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో పట్టభద్రురాలు. మొదట ప్రోగ్రామర్‌గా కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. కానీ అధ్యాపకవృత్తి అంటే అంతులేని ఇష్టం. అందుకే టీచింగ్‌ వైపు మళ్ళారు. కెన్యా, జాంబియా లాంటి దేశాల్లో కొంతకాలం పాఠాలు చెప్పాక, బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. అనేక ప్రసిద్ధ పాఠశాలల్లో లెక్కలూ, ఫిజిక్స్‌ బోధించారు. ‘‘ముప్ఫయ్యేళ్లకు పైగా అధ్యాపకురాలుగా విద్యారంగాన్ని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు దొరికింది.


మన దేశంలోని చాలా ప్రాంతాల పాఠశాలల్లో కనీస సౌకర్యాల మాట దేవుడెరుగు... బోధించడానికి కూడా తగిన పరిస్థితులు లేవు. ఇది నన్ను ఎంతో కలవరపాటుకు గురి చేసింది’’ అని చెప్పారామె. ‘‘ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికతలను ప్రైవేటు పాఠశాలలు అందిపుచ్చుకొని, బోధనలో మార్పులు చేస్తున్నాయి. ఈ కారణంగా, వాటిలో చదువుతున్న పిల్లలకూ, ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకూ మధ్య అంతరం పెరిగిపోతోంది. ఆ అంతరాన్ని ఎలా తగ్గించాలన్న ఆలోచనే ‘మేఘశాల ట్రస్ట్‌’  ఏర్పాటుకు పునాది’’ అని వివరించారు జ్యోతి.


బెంగళూరు కేంద్రంగా 2013లో ఈ ట్రస్ట్‌ ఏర్పాటయింది. ఇది క్లౌడ్‌ కంప్యూటర్‌ ఆధారంగా పనిచేసే ఒక వేదిక. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్యాపకులకు అత్యాధునికమైన, వినూత్నమైన బోధనా పద్ధతుల్ని పరిచయం చేస్తున్నారు. పిల్లలను ఆకట్టుకొనేలా, వారిలో సృజనాత్మకతను పెంపొందించేలా పాఠాలు ఎలా చెప్పాలో తెలియజేస్తున్నారు. పాఠ్యప్రణాళికలోని పాఠాలనే కొత్తగా... సాంకేతికత సాయంతో దృశ్య, శ్రవణ రూపాల్లో... బోధించడంపై టీచర్లకు అవగాహన కలిగిస్తున్నారు. ఈ పద్ధతుల వల్ల పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి మరింత ఆసక్తి చూపిస్తారనీ, పిల్లలను ఆలోచనాపరులుగా, భావి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఇది దోహదపడుతుందనీ అంటారు. జ్యోతి.


‘‘అధ్యాపకురాలుగా ఉన్న సమయంలో నేను ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటి... టీచర్ల పట్ల సమాజానికి ఉండే కొన్ని అభిప్రాయాలు. పాఠాలకు సంబంధించి టీచర్లకు అన్నీ తెలుసని ప్రజలు అనుకుంటారు. అందుకే, పిల్లల బోధన విషయంలో చాలామంది ఉపాధ్యాయులనే తప్పుపడుతూ ఉంటారు. ఫలితాలు సరిగ్గా రాకపోతే దానికి కారణం వాళ్ళేనని నిందిస్తారు. ఇది పొరపాటు. బోధనకు సరైన పరికరాలు టీచర్లకు అందించకుండా, ఫలితాలు రావాలంటే ఎక్కణ్ణించి వస్తాయి? వారికి సాంకేతికతను అందుబాటులోకి తేవాలి. దాని ద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకొనే టెక్నిక్స్‌ తెలుసుకొనే అవకాశం కల్పించాలి’’ అంటారు జ్యోతి. 


దీనికోసం ‘మేఘశాల’ ద్వారా జ్యోతి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కన్యాకుమారి నుంచి సిచియాన్‌ వరకూ... వెయ్యికి పైగా పాఠశాలల నుంచి ఇప్పటికే 18,000 మంది ఉపాధ్యాయుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. దీనికోసం పల్లెలకు వెళ్ళి, స్థానిక అధికారులు, గ్రామస్థుల సిఫార్సు మేరకు టీచర్లను ‘మేఘశాల’ సభ్యులు ఎంపిక చేస్తారు. ఆధునిక బోధనా రీతులు, సాంకేతికతపై వారందరికీ అవగాహన కల్పిస్తారు. ప్రతి ఉపాధ్యాయుడూ కనీసం ముప్ఫై మంది విద్యార్థులకు సరికొత్త పద్ధతిలో బోధన అందించేలా చూస్తారు.. ఇప్పటికి దాదాపు అయిదున్నర లక్షల మంది విద్యార్థులు మేఘశాల ద్వారా ప్రయోజనం పొందారు. ‘‘దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ చక్కటి విద్య అందే వరకూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నదే మా ధ్యేయం’’ అంటున్నారు జ్యోతి. 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST