ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా

ABN , First Publish Date - 2021-05-14T08:22:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది

ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా

కరోనా ఉధృతి కారణంగానే..

ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా ఎఫెక్ట్‌!

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా 

తెలంగాణలో ఆరు సీట్లు, ఏపీలో మూడు సీట్లు త్వరలో ఖాళీ

పరిస్థితి మెరుగయ్యాక నిర్వహిస్తాం: ఈసీ


న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఏపీలో ఈనెల 31న ముగ్గురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో వచ్చే నెల 3న ఆరుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 16 నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావస్తున్న సమయంలో అవి ఖాళీకాక ముందే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను సమీక్షించామని, కరోనా పరిస్థితి గణనీయంగా మెరుగుపడి ఎన్నికలకు తగిన పరిస్థితులు ఏర్పడేవరకు ఎన్నికలను నిర్వహించడం సరికాదని నిర్ణయించామని ఈసీ పేర్కొంది. సంబంధిత రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకొని, జాతీయ లేదా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ద్వారా కరోనా పరిస్థితిని మదింపు చేసి భవిష్యత్తులో తగిన సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు, తెలంగాణలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తోపాటు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌,  బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీ విరమణ చేయనున్నారు. 

Updated Date - 2021-05-14T08:22:38+05:30 IST