Abn logo
Apr 18 2021 @ 00:36AM

అధికారం–అరాచకం–ఆధిపత్యం 

ఉపఎన్నికలు జరిగినప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్‌ ఉంటుందన్నది ఎవరూ కాదనలేని విశ్లేషణ. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపొందే అవకాశాలు అధికారంలో ఉన్న వైసీపీకే నూటికి నూరు శాతం ఉన్నాయని ప్రజలకు, పార్టీలకు, విశ్లేషకులకు తెలిసినదే. ఆ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కానీ, వైసీపీ నేతలు కానీ పూర్తి ధీమాతోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. కానీ గెలుస్తామని తెలిసి కూడా.. పోలింగ్‌ సందర్భగా వైసీపీ వ్యవహరించిన తీరు ఆ పార్టీ ఆటిట్యూడ్‌ అదే అని నిరూపించింది. 


నిజానికి ఈ ఉపఎన్నికలో 5 లక్షలకుపైగా మెజారిటీ సాధించాలని తన మంత్రులకు ఎంఎల్‌ఏలకు జగన్‌ ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉపఎన్నిక జరిగిన తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను మంత్రులకు, ఇతర కీలక నేతలకు పంచి, నియోజకవర్గానికి 70 వేల కనీస మెజారిటీ సాధించాలని ఆదేశించినట్టు బలమైన ప్రచారం జరిగింది. తన ప్రభుత్వంపైన, పాలనపైన, తన సంక్షేమ ఫలాలపైన ఎంత నమ్మకం లేకపోతే జగన్‌ ఆ రకమైన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అయితే పోలింగ్‌ నాటి పరిస్థితి చూస్తే అన్నీ ప్రశ్నలే ఎదురవుతాయి. అనుకున్న మెజారిటీ రాదనో, లేక అసలు గెలుపే కష్టసాధ్యమని జగన్‌ భావించారా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు. ఇలాంటి అనుమానాలకు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, అధికార దుర్వినియోగం వంటివి బలాన్ని చేకూరుస్తున్నాయి. నిజానికి చాలా సర్వేలు చేయించుకుని, ఇంటెలిజెన్స్‌ నివేదికలు పదేపదే తెప్పించుకున్న జగన్‌మోహన్‌రెడ్డి అతిపెద్ద విజయంపై చాలా ధీమాగా ఉన్నారని ఆయన పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ నేతల్లో, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లలో అనుమానం, భయం మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన మెజారిటీ రాదని, మరికొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం కంటే తక్కువ ఓట్లు వస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల మంత్రులు వెళ్లిన ప్రచార సభలు, రోడ్‌షోలు సైతం వెలవెలబోవడం వారిలో భయాన్ని మరింత పెంచింది. దీంతో ప్రచారం ఊపందుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. అన్న ప్రచారానికి వస్తే తప్ప గండం నుంచి బయటపడలేమని మెజారిటీ నేతలు భావించి.. అదే విషయాన్ని అధినేతకు మొరపెట్టుకున్నారు. దాని ఫలితమే మరిన్ని నిధులు పంపిస్తామని, పోలింగ్‌ మూడు రోజుల ముందు అంటే 14వ తేదీన తాను ప్రచారానికి వస్తున్నట్టు జగన్‌ నేతలకు భరోసా ఇచ్చారు. ఆ మేరకు జగన్‌ సభ ఎక్కడ, ఎలా జరపాలి అనేవి కూడా నిర్ణయమైపోయాయి.


సరిగ్గా ఆ నిర్ణయం దగ్గర్నుంచి తిరుపతి రాజకీయం పూర్తిగా మారిపోయింది. గెలుపుపై ధీమా సడలినందువల్లే జగన్ చివరి నిమిషంలో ప్రచారానికి నిర్ణయించుకున్నారని అటు తెలుగుదేశం పార్టీతోపాటు విపక్షాలు అన్నీ సెటైర్లు వేశాయి. మీడియాలోనూ ఇలాంటి విశ్లేషణలే వచ్చాయి. మరోవైపు మెజారిటీపైన అంతగా ధీమా లేకపోవడంతో తాను ప్రచారానికి వెళ్లినా కూడా నిర్దేశించుకున్న మెజారిటీ రాకపోతే అభాసుపాలు అవుతామనే ఉద్దేశంతోనే జగన్‌ కరోనా సాకును చూపించి ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని పార్టీ నేతలు చెప్తారు. మరోవైపు జగన్‌ శిబిరానికి అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి నాతో పంచుకున్న విషయం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అన్నీ చేసి, కోట్లాది రూపాయలు పంచి, తాను కూడా ప్రచారం చేస్తే గతంలో తాను కడప లోక్‌సభలో సాధించిన అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీ రికార్డును తిరుపతి అభ్యర్థి చెరిపేస్తారనే ఆలోచనతోనే జగన్‌ తన ప్రచారాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనేది దాని సారాంశం. తరచి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. జగన్‌కు తిరుపతిలో తన అభ్యర్థి గెలవడం మాత్రమే కావాలి కానీ, తనను మించి గెలవడం నచ్చకపోవచ్చు. మరోవైపు నేతలు, అభ్యర్థి ఆదేశించినట్టు పెద్దఎత్తున నిధులు కూడా సర్దుబాటు చేయలేదని చెప్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే గెలిపిస్తాయి, ఇంకా డబ్బు ఓట్ల కోసం అదనంగా పంచాల్సిన అవసరం లేదంటూ ఆ విజ్ఞప్తిని కూడా జగన్‌ తోసిపుచ్చారట. దీంతో నేతలు తలలు పట్టుకున్న మాట వాస్తవం. ఒకటి మాత్రం నిజం. ఓటుకు అయిదు వందల కంటే ఎక్కువగా వైసీపీ పంచలేదని నేతలు నమ్మకంగా చెప్తున్నారు. ఎన్నికల కోసం పనిచేసిన వైసీపీ నేత ఒకరు చెప్పినట్టు డబ్బు పంచడం అంటూ జరిగితే వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారనేది పక్కా. కానీ అలా జరగలేదు. పోలింగ్‌ ఇంకో రెండు మూడు రోజులు ఉందనగా పార్టీలో విశ్లేషణలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి లభించిన ఆదరణ, చంద్రబాబు, లోకేశ్‌ల ప్రచారానికి కనిపించిన ప్రజాస్పందనతోపాటు వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన కుమార్తె సునీత మీడియా ముందుకొచ్చి ఎండగట్టడం, ఆ అంశాన్ని ప్రతిపక్షాలు అజెండాగా చేసుకోవడం, వివేకానందరెడ్డి హత్యపై ప్రమాణం చేద్దాం రమ్మంటూ లోకేశ్‌ విసిరిన సవాలు వంటివి వైసీపీ నాయకుల్ని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. మరోవైపు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నప్పటికీ జనసేన మద్దతుదారులు, ఓటర్లు బీజేపీ పట్ల విముఖత చూపడం కూడా వైసీపీ నేతల్లో ఆందోళన కలిగించిందనే విశ్లేషణ ఉంది. జనసేన ఓటు బీజేపీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశం లేదని మంత్రులు ఒక నిర్దారణకు వచ్చాక, అదే విషయాన్ని అధినేతకు వివరించినట్టు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్‌ నివేదికలు కూడా అందుకు తగ్గట్టు వచ్చాయని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా అక్రమ మార్గాలనే వైసీపీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.


పోలింగ్‌ జరుగుతున్నప్పుడు తిరుపతిలోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున దొంగఓట్లు వేయించేందుకు వైసీపీ నేతలు వేసిన ఎత్తుగడలు చూస్తే ఇంత బాహాటంగా అరాచకాలు చేయవచ్చు అనిపించక మానదు. పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లు సమకూర్చి చిత్తూరుతోపాటు కడప, ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తల్ని, అద్దె ఓటర్లను తరలించిన తీరు ప్రజాస్వామ్యానికే చెంపపెట్టు. అలా తరలించిన మందీ, మార్బలంతో దొంగఓట్లు వేయించేందుకు వైసీపీ నేతలు చేసిన ఏర్పాట్లు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. సరిగ్గా ఇక్కడే వైసీపీ గ్రామ వలంటీర్ల వ్యవస్థను బ్రహ్మాండంగా వినియోగించుకుంది. వలంటీర్ల ద్వారా ఆయా గ్రామాలలో లేని, లేదా చనిపోయిన ఓటర్ల వివరాలను సేకరించింది. వారి పేర్లతో నకిలీ ఓటరు ఐడీలను తయారుచేసి ఇతర ప్రాంతాల నుంచి తరలించిన వ్యక్తులకు, మహిళలకు ఇచ్చి ఓట్లు వేయించారు. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. సత్యకుమార్‌ పోలింగ్‌కు చాలా రోజుల ముందే రెండు లక్షల నకిలీ ఓటర్‌ ఐడీలను వైసీపీ సిద్ధం చేస్తోందని బలమైన ఆరోపణ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా సత్యకుమార్ ప్రకటించారు. కానీ ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో నకిలీ ఓటరు కార్డులతో దొంగఓట్లు పడిపోయాయి. కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నా, వ్యవస్థలు సహకరించకపోవడంతో అధికార పార్టీ నేతల వ్యూహం సాఫీగా అమలైపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జనం పోలింగ్‌ స్టేషన్‌ల సమీపంలో కనిపించినా, దొంగ ఓటర్లు క్యూలైన్లలో నిలబడినా అటు పోలీసులు కానీ, ఇటు ఎన్నికల కమిషన్‌ అధికారులు కానీ పట్టించుకోలేదని విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ఫిర్యాదు కూడా చేశాయి. అయినా ఫలితం కనిపించలేదు. 


తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంపైనే వైసీపీ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 12 వేల ఓట్లు రావడం వల్ల టీడీపీ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు జనసేన ఓట్లు టీడీపీకి పడే అవకాశం ఉన్నందువల్ల దొంగ ఓట్లకు శతవిధాలా ప్రయత్నించినట్లు స్థానికులు చెప్తున్నారు. అన్నీ ఒక ఎత్తయితే వ్యవస్థలు పనిచేసిన తీరు మాత్రం ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా లేదు. పోలీసులు కనీసం కూడా స్పందించలేదనే విమర్శలు పోలింగ్‌ రోజున హోరెత్తాయి. ఇక ఎన్నికల సంఘం వైపు నుంచి కూడా అదే పరిస్థితి. ససాక్ష్యాలతో దొంగ ఓట్ల బాగోతాన్ని మీడియా ప్రసారం చేసినా, విపక్షాలు ఆధారాలు చూపించినా కనీసం స్పందన లేకపోగా, దొంగ ఓట్లు ఒక అపోహ మాత్రమే అని ఓ అధికారి కొట్టిపారేశారు. మొత్తమ్మీద తిరుపతి ఉపఎన్నిక ఒక వాస్తవాన్ని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా, అది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగినా, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగినా.. జరిగేది ప్రజాస్వామ్య అపహాస్యమేననే నిష్టూర సత్యం నిరూపితమైంది.


తిరుపతి ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందువల్ల ఈ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు సాగవని, బీజేపీ అడ్డుకుంటుందని అంతా భావించారు. కానీ అది కూడా ఒట్టి షోనే అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నకిలీ ఓటర్‌ ఐడీలు సిద్ధమవుతున్నాయి అని ఆధారాలతో సహా సొంత పార్టీ నాయకుడే మూడు వారాల ముందు బయటపెట్టినా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అసలు ఆ సంగతే తెలియనట్టు పట్టించుకోకుండా వదిలేసింది. పోలింగ్‌ రోజు అక్రమాలపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతుంటే రాష్ట్ర బీజేపీ వైపు నుంచి సీరియస్‌ స్పందన కనిపించలేదు. ఒకరిద్దరు తిరుపతి ప్రాంతానికి చెందిన నేతలు మాత్రమే ఈ విషయంలో వైసీపీని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు తప్పితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన స్థాయిలో బీజేపీ స్పందించలేదన్నది ఆ పార్టీపై వచ్చిన మరో బలమైన విమర్శ. జనసేనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండానే బరిలోకి దిగినప్పుడు, కనీసం ఆ స్థాయిలో పోరాట పటిమను చూపించలేకపోయింది బీజేపీ. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో వైసీపీ, బీజేపీ ఏజెంట్లు కుమ్మక్కయి, టీడీపీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు కూడా వినిపించాయి. మొత్తంగా తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరు చూస్తే జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికలకు అవసరమైన వలంటీర్ల వంటి సైన్యాన్ని ముందు నుంచే సిద్ధం చేసుకుని ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహరచన వంటి అంశాలు విపక్షాలకు మరోసారి కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. అయితే ప్రజాస్వామ్యం ఇలాంటి అక్రమాలను ఎంతోకాలం సహించదు అనే వాస్తవం చరిత్రలో చాలాసార్లు రుజువైంది.

వెంకటకృష్ణ పర్వతనేని

(సీనియర్‌ జర్నలిస్టు)

Advertisement
Advertisement
Advertisement