ప్రగతి భవన్‌..మాఫియా అడ్డా

ABN , First Publish Date - 2021-01-18T08:21:50+05:30 IST

రాష్ట్రంలో భూమాఫియా, ఇసుక, డ్రగ్‌, లిక్కర్‌.. ఇలా అన్ని మాఫియాలకు ప్రగతి భవన్‌ అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు

ప్రగతి భవన్‌..మాఫియా అడ్డా

భూముల స్వాహాలో మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌

కరోనా బారిన పడ్డ మైనారిటీలకు..

‘గాంధీ’లో కాజూ, కిస్మిస్‌ ఇచ్చారు

పేద హిందువుల్ని పట్టించుకోలేదు: బండి

సీఎం కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో తరుణ్‌ ఛుగ్‌

ప్రధాని మోదీ వచ్చే వరకు కేసీఆర్‌కు భారత్‌ బయోటెక్‌ గురించి అవగాహన లేదు: బండి సంజయ్‌

కేసీఆర్‌ కుటుంబం లూటీ చేస్తోంది: ఛుగ్‌

కేసీఆర్‌కు నీతి, నిలకడ లేదు: కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూమాఫియా, ఇసుక, డ్రగ్‌, లిక్కర్‌.. ఇలా అన్ని మాఫియాలకు ప్రగతి భవన్‌ అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ‘‘హైదరాబాద్‌లో దేవాలయ భూములను మజ్లిస్‌ నేతలు కబ్జా చేస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు భూములను టీఆర్‌ఎస్‌ నాయకులు స్వాహా చేస్తున్నారు’’ అని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎం, వాటి విఘాతానికి కారణమవుతున్న పార్టీలను పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్‌ అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగం చేశారు. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం కరోనా కేసులను తక్కువ చూపించింది. మృతదేహాల విషయంలో కూడా గందరగోళమే.


కరోనా బారినపడ్డ మైనారిటీలకు కాజూ, కిస్మిస్‌, బాదాంలు ఇచ్చిన ప్రభుత్వం.. పేద హిందువులు గాంధీ ఆస్పత్రిలో చేరితే వారికి కనీస వైద్యం అందించలేదు. దీంతో ఎంతోమంది చనిపోయారు. ప్రధాని మోదీ వచ్చే వరకు కేసీఆర్‌కు భారత్‌ బయోటెక్‌ గురించి అవగాహన లేదు. టీకా ప్రారంభం సందర్భంగా అది తమ ఘనకార్యంగా టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంది. ఒక్క చోట కూడా ప్రధాని ఫొటో పెట్టలేదు’’ అని సంజయ్‌ విమర్శించారు. కరోనా నియంత్రణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని, ఆయుష్మాన్‌ భారత్‌ గొప్పదా? అంటూ చులకన చేసి మాట్లాడిన కేసీఆర్‌ తర్వాత వాటిపై యూటర్న్‌ తీసుకున్నారని గుర్తుచేశారు. మజ్లిస్‌తో కలిసి హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.


నిరుద్యోగ భృతి ఇచ్చాకే.. ఓట్లు అడగాలి

ఆరేళ్లలో రాష్ట్రానికి 13,500 కంపెనీలు వచ్చాయని, 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు తక్షణం వారి అకౌంట్లలో రూ.72వేలు వేయాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలన్నారు. విద్యారంగాన్ని, ఆర్టీసీని సీఎం ఛిన్నాభిన్నం చేశారని, ఉద్యోగులు, పెన్షనర్లు, రైతులను మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం కాదు.. అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. యజ్ఞ, యాగాలు చేసే మీరు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? స్పష్టం చేయాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల అవినీతికి టీఆర్‌ఎస్‌ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతుంటే, ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని నిలదీశారు.


కేసీఆర్‌ది అసమర్థ ప్రభుత్వం

సీఎం కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని, దీనిపై ప్రజలు ఆక్రోషంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ అన్నారు. కేసీఆర్‌ది అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అవినీతి, దోపిడీ, మోసాల గురించే అంతటా చర్చ జరుగుతోందని చెప్పారు. ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని 2014లో ప్రకటించిన సీఎం కేసీఆర్‌, 7స్టార్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు నీతి లేదని, ఆయన మాటపై నిలబడే వ్యక్తి కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో ఓడిన కార్పొరేటర్లతో ప్రారంభోత్సవాలు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. మజ్లి్‌సతో దోస్తీ లేకుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యేదని చెప్పారు.


వివిధ అంశాలపై తీర్మానాలు

పార్టీ రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానంతో పాటు ప్రజా సమస్యలపై 10 తీర్మానాలు ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. గొల్లకురుమలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఈడబ్ల్యూసీ, రైతులు, డబుల్‌బెడ్‌రూం, బీసీల సమస్యలు, దళితులపై దాడులు, మహిళల సమస్యలపై తీర్మానాలు ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిపై త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశాలు, మంగళవారం మండల కార్యవర్గ సమావేశాలు ఉంటాయన్నారు. గడిచిన ఏడేళ్లలో ఉద్యమ ఆకాంక్షలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తెలిపారు. కాగా, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయం అనంతరం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, విజయశాంతి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T08:21:50+05:30 IST