రాష్ట్రానికి మళ్లీ ప్రవీణ్‌ ప్రకాశ్‌!

ABN , First Publish Date - 2022-08-26T09:13:32+05:30 IST

రాష్ట్రానికి మళ్లీ ప్రవీణ్‌ ప్రకాశ్‌!

రాష్ట్రానికి మళ్లీ ప్రవీణ్‌ ప్రకాశ్‌!

ఏపీ భవన్‌కు బదిలీ అయి ఆరున్నర నెలలే

ఇంతలోనే రాష్ట్రానికి పునరాగమనం!!

 సీఎం ఢిల్లీ టూరులో గట్టిగా ఒత్తిడి

సరేనన్న సీఎం.. జీఏడీలో పెద్దపీట?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారు. ‘నేను అమరావతిలోనే పని చేస్తాను. నన్ను అక్కడే నియమించండి’ అని ప్రవీణ్‌ ప్రకాశ్‌ గట్టిగా ఒత్తిడి చేయడం... అందుకు జగన్‌ అంగీకరించడం జరిగిపోయినట్లు సమాచారం. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆరున్నర నెలలుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితుడిగా.. సీఎంవో ముఖ్యకార్యదర్శిగా ఓ వెలుగు వెలిగిన ఆయన్ను.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆ పోస్టు నుంచి తప్పించి ఏపీ భవన్‌కు బదిలీ చేశారు. ఇప్పుడాయన మళ్లీ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ఢిల్లీ పర్యటన కు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం పర్యటన ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాలు ప్రవీణ్‌ ప్రకాశే చూసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో భేటీ అయ్యారు. తాను మళ్లీ ఏపీకి వస్తానని.. తనకు మరో అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. జగన్‌ సరేనని హామీ ఇచ్చారని.. ఆయన్ను తిరిగి ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో ప్రవీణ్‌ ప్రకాశ్‌కు పెద్దపీట వేయబోతున్నారని ఐఏఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఢి ల్లీ వెళ్లకముందు సీఎంవో ముఖ్యకార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. పోస్టింగ్‌లు, విధానపరమైన అంశాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే జీఏడీ వ్యవహారాలు చూశారు. పలు అంశాల్లో ఆయన వ్యవహారశైలి, నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేశారని.. ఆయన్ను ఏరికోరి తెచ్చుకున్న జగన్‌ సైతం.. ఇక పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నారంటే ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చని సీనియర్‌ అధికారులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆయన్ను ఒకేసారి తప్పిస్తే బాగోదని భావించి క్రమక్రమంగా పక్కనపెట్టారు. తొలుత అధికారాలకు కోతపెట్టారు. ఆయన చూసే విభాగాలను మరో ఐఏఎస్‌ ముత్యాలరాజుకు అప్పగించారు. ఫిబ్రవరి 14న ప్రవీణ్‌ను ఢిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన ఇక్కడే కొనసాగేందుకు పలు ప్రయత్నాలు చేశారని అప్పట్లో అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. చివరకు ఏపీ భవన్‌ విధుల్లో చేరాల్సి వచ్చింది. ఆరున్నర నెలల తర్వాత ప్రవీణ్‌ తిరిగి రాబోతున్నారని, ఎవరు పంపించారో వారే మళ్లీ తీసుకొస్తున్నారని ఐఏఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

Updated Date - 2022-08-26T09:13:32+05:30 IST