వడ్లు వర్షార్పణం

ABN , First Publish Date - 2021-05-14T08:26:54+05:30 IST

అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పంటను నిండా ముంచుతున్నాయి. ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్‌(రామప్ప), గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో గురువారం కురిసిన వానకు కళ్లాలు

వడ్లు వర్షార్పణం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పంటను నిండా ముంచుతున్నాయి. ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్‌(రామప్ప), గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో గురువారం కురిసిన వానకు కళ్లాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న క్రమంలో మళ్లీ వాన పడటంతో వడ్లు తడిసి ముద్దయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లోనూ వర్షం కురిసింది. అశ్వారావుపేటలో వడగళ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలో కురిసిన వర్షంతో ధాన్యం కుప్పలు తడిశాయి. రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. షాద్‌నగర్‌ మార్కెట్‌ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. చేవెళ్ల, షాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇబ్రహీంపట్నం పరిధిలో బుధవారం అర్ధరాత్రి తర్వాత వర్షం కురిసింది.


16, 17 తేదీల్లో తుఫాను..?

తెలంగాణలో ఈ నెల 16, 17 తేదీల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్ప పీడనం ఏర్పడిందని, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియర్‌ ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు చెప్పింది. అల్పపీడనం మరింత బలపడి 16వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఏర్పడిన ఉత్తర- దక్షిణ ద్రోణి/గాలి విచ్ఛిన్నతి గురువారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదగా దక్షిణ తమినాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 

Updated Date - 2021-05-14T08:26:54+05:30 IST