చార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం

ABN , First Publish Date - 2021-12-02T08:55:02+05:30 IST

కరెంటు చార్జీల పెంపునకు సమయాత్తమవుతున్న డిస్కమ్‌లు అందుకు సంబంధించి టారిఫ్‌ తుదిమెరుగులు దిద్దుతున్నాయి.

చార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం

  • కరెంటు చార్జీల టారిఫ్‌లు టీఎస్‌ఈఆర్‌సీకి సమర్పించనున్న డిస్కమ్‌లు
  • అన్ని కేటగిరీలకూ పెంపు?.. వినియోగదార్లపై ఏటా 4 వేల కోట్ల భారం
  • వినియోగదారులపై వాస్తవిక వ్యయం చార్జీలు మోపనున్న డిస్కమ్‌లు
  • రెండేళ్లకే దాఖలు చేయాలని ఈఆర్‌సీ ఆదేశం
  • నియంత్రించడానికి వీల్లేని కారణాలకే ట్రూఅప్‌కు అనుమతి


హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కరెంటు చార్జీల పెంపునకు సమయాత్తమవుతున్న డిస్కమ్‌లు అందుకు సంబంధించి టారిఫ్‌ తుదిమెరుగులు దిద్దుతున్నాయి. వీటిని టీఆఎ్‌సఈఆర్‌సీకి సమర్పించాక.. బహిరంగ విచారణ అనంతరం కరెంటు చార్జీలపై ఈఆర్‌సీ తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. 2021-222, 2022-23 ఆర్థిక  సంవత్సరాలకు సంబంధించి వార్షికాదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌ల)ను డిస్కమ్‌లు మంగళవారమే ఈఆర్‌సీకి సమర్పించిన విషయం తెలిసిందే. టారిఫ్‌ ప్రతిపాదనలు కూడా ఏఆర్‌ఆర్‌లతోపాటే సమర్పించాల్సి ఉన్నా.. డిస్కమ్‌లు వాటిని ఇవ్వలేదు. తాజాగా సీఎం కేసీఆర్‌ సలహాలు, సూచనలతో టారిఫ్‌ ప్రతిపాదనల్ని సిద్ధం చేశాయి. వీటిని సమర్పించాక అభ్యంతరాల స్వీకరణ, బహిరంగ విచారణ అనంతరం ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంటుంది. 2022 ఏప్రిల్‌ నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ రెండేళ్ల కాలానికిగాను డిస్కమ్‌లు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లలో రూ.21,550 కోట్ల లోటు ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ఏటా రూ.10 వేల కోట్లకుపైగా లోటు ఉంది. అయితే ఈ మొత్తాన్ని భర్తీ చేసుకోవడానికి వినియోగదారులపై భారం వేస్తే వ్యతిరేకత బలంగా వచ్చే అవకాశాలుంటాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిస్కమ్‌లకు మరో రూ.5 వేల కోట్ల ఆర్థిక వెసులుబాటును ప్రభుత్వం కల్పించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంకా రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లను వినియోగదారుల నుంచి రాబట్టుకునే యోచనలో డిస్కమ్‌లు ఉన్నాయి. దీని ప్రకారం అన్ని కేటగిరీల వారి పైనా భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక యూనిట్లు వినియోగించుకునే వారికి రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకు 199 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకున్న వారికి రూ.900 బిల్లు వస్తుండగా.. ఇకపై అది రూ.1500 కు పెరిగే సూచనలున్నాయి. ఇదిలా ఉండగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా వచ్చే జనవరి నుంచి మార్జి వరకు మూడు నెలల కాలానికి కొత్త చార్జీలు వసూలు చేసుకోవాలనే ఆలోచనలో డిస్కమ్‌లు ఉన్నాయి. 

 

ట్రూఅప్‌ చార్జీలూ ఖాయం.. 

విద్యుత్తు వినియోగదారులపై కరెంటు చార్జీల పెంపుతోపాటు ట్రూఅప్‌ చార్జీల భారం కూడా పడనుంది. డిస్కమ్‌లు గత ఏడేళ్లుగా లోటు/నష్టాల్లో ఉండటంతో అందులో.. చట్టం/ఈఆర్‌సీ అనుమతించిన మేర వినియోగదారుల నుంచి వాస్తవిక వ్యయం(ట్రూ అప్‌) చార్జీలు వసూలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అయితే దీనిని అనుసరించి పిటిషన్లు వేసుకోవడానికి డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈఆర్‌సీ వద్ద 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల ఏఆర్‌ఆర్‌లు ఉండగా... వీటిని ట్రూఅప్‌ పిటిషన్లుగా వేసుకుంటే పరిశీలిస్తామని విద్యుత్తు నియంత్రణ మండలి తాజాగా వెల్లడించింది. అయితే ఏడేళ్ల నష్టాలను ఒకేసారి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీ అనుమతి ఇవ్వదు. డిస్కమ్‌లు.. నియంత్రించడానికి వీలులేని కారణాల(అన్‌ కంట్రోలబుల్‌ ఫ్యాక్టర్‌)ను ప్రామాణికం చేసుకొని పిటిషన్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఏడేళ్లలో ఆరేళ్ల (2019-20 దాకా) నష్టాలు/లోటు రూ.33 వేల కోట్లు ఉండగా, 2020-21లో మరో రూ.9 వేల కోట్లు ఉంటాయని అంచనా. అయితే ఈ రూ.42 వేల కోట్ల కోసం డిస్కమ్‌లు పిటిషన్లు వేసినా ఇంత పెద్దమొత్తానికి ఈఆర్‌సీ అనుమతి ఇవ్వదని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రూ.4 వేల కోట్లలోపు ట్రూఅప్‌ చార్జీల వసూలుకు మాత్రమే ఈ అనుమతి లభించవచ్చని చెబుతున్నారు. వాయిదాల పద్ధతిలో డిస్కమ్‌లు ఈ మొత్తాన్ని వసూలు చేసుకునే అవకాశాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ట్రూఅప్‌ చార్జీల కోసం డిస్కమ్‌లు పిటిషన్లు వేసి, ఈఆర్‌సీ ఉత్తర్వులతో వాటిని రాబట్టుకున్న సందర్భాలున్నాయి.

  

బహిరంగ విచారణ తరువాతే అనుమతి..

డిస్కమ్‌లు ట్రూఅప్‌ పిటిషన్‌ వేస్తే.. దానిపై నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం లిఖితపూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించాక, బహిరంగ విచారణ తర్వాతే ఈఆర్‌సీలు అనుమతినిస్తాయి. అయితే పిటిషన్లు ఎన్నేళ్ల కోసం వేసుకున్నా... నియంత్రించుకోవడానికి వీల్లేని కారణాలే ప్రామాణికం చేసుకొని వేసుకున్న అంశాలకే ఈఆర్‌సీ అనుమతినిస్తుంది. తెలంగాణ డిస్కమ్‌లకుఈఆర్‌సీ 2019-20, 2020-21 సంవత్సరానికి ట్రూఅప్‌ పిటిషన్లు వేసుకోవాలని సూచించడంతో ఆ రెండేళ్ల కోసమే పిటిషన్‌ వేస్తారా...? లేక మొత్తం గడిచిన సంవత్సరాలుగా కూడగట్టుకున్న నష్టాలను రాబట్టుకోవడానికి పిటిషన్‌ వేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. 


ఈఆర్‌సీ అనుమతినిచ్చే నియంత్రించడానికి వీల్లేని కారణాలు..

థర్మల్‌, జలవిద్యుత్తు రెండూ కలిపి నిర్ణీత మొత్తంలో ఉత్పత్తి అయితే ఫలానా ఖర్చు మాత్రమే అవుతుందని అంచనా వేసి, ఈఆర్‌సీ అనుమతి తీసుకున్నాక.. తీరా జలవిద్యుత్తు ఉత్పత్తి కాకుండా కేవలం థర్మల్‌ విద్యుత్‌ మాత్రమే సరఫరా చేయడం వల్ల అయిన అదనపు వ్యయం. 

భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గి.. ఒప్పందం చేసుకున్న థర్మల్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ దొరక్క అధిక ధరకు బహిరంగ విపణి నుంచి కరెంట్‌ కొనుగోలు చేయడం వల్ల అయిన అదనపు వ్యయం. 

థర్మల్‌ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలు తగ్గించడానికి వెచ్చించిన అదనపు వ్యయంతో కరెంట్‌ కొనుగోలు ధర పెరగడం వంటి కారణాలు. 

బొగ్గు ధర పెరగడంతో ఇంధన చార్జీలకు అదనంగా డిస్కమ్‌లు చెల్లించిన అదనపు వ్యయం. 

డిస్కమ్‌లు వేసుకున్న అంచనాలు వాటి చేతిలో లేకుండా పెరిగితే అయ్యే అదనపు వ్యయం. 


సర్కారీ కార్యాలయాలకు విద్యుత్‌ను కట్‌ చేయొద్దు

అధికారులకు డిస్కమ్‌లు ఆదేశం

విద్యుత్‌ బకాయిల చెల్లించలేదనే కారణంతో ప్రభుత్వ కార్యాలయాలు/సంస్థలకు విద్యుత్‌ కనెక్షన్‌ తీయొద్దని డిస్కమ్‌లు క్షేత్రస్థాయి ఉద్యోగులను బుధవారం ఆదేశించాయి. పలు జిల్లాల్లో రెండు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు బిల్లులు కట్టడం లేదని విద్యుత్‌ సిబ్బంది ఆయా కార్యాలయాల విద్యుత్‌ను తొలగించడం వివాదాస్పదంగా మారడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ దృష్టికి చేరింది. దీంతో విద్యుత్‌ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ సంస్థలు బిల్లుల్ని చెల్లించకపోతే ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇవ్వకుండా కనెక్షన్‌ తొలగించవద్దని ఎస్పీడీసీఎల్‌ సీజీఎం(రెవెన్యూ) మెమో జారీ చేశారు. 

Updated Date - 2021-12-02T08:55:02+05:30 IST