పత్తికి 3 విభాగాలుగా ధరలు

ABN , First Publish Date - 2020-11-23T08:10:53+05:30 IST

రాష్ట్రంలో సెంటర్లు ఏర్పాటుచేసి పత్తి కొనుగోలు చేస్తున్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ

పత్తికి 3 విభాగాలుగా ధరలు

వ్యాపారుల దోపిడీకి చెక్‌ పెట్టేందుకు సీసీఐ నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సెంటర్లు ఏర్పాటుచేసి పత్తి కొనుగోలు చేస్తున్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)... నాణ్యత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని మూడు కేటగిరీల వారీగా ధరలు ఖరారు చేసింది. ఇప్పటిదాకా 30 మి.మీ పింజ పొడవున్న పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. అయితే వ్యాపారుల దోపిడీని చెక్‌ పెట్టి, రైతులకు ఎమ్మెస్పీ ఇచ్చేందుకుగాను సీసీఐ తాజాగా నిబంధనలను సఢలించింది.


ఇటీవల జారీ అయిన కొత్త ఉత్తర్వుల ప్రకారం... 30 మి.మీ పింజ పొడవుంటే రూ. 5,825తో పూర్తి మద్దతు ధర, 29 మి.మీ సైజుకు 5,775, రూపాయలు, 28 మి.మీ సైజు ఉంటే రూ. 5,725 చొప్పున ధర చెల్లిస్తారు. కాగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో ‘ఎల్‌ఆర్‌ఏ’ రకం పత్తిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అక్కడ పత్తి పింజ పొడవు 26 మి.మీ నుంచి 26.5 మి.మీ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. పూర్తిస్థాయి ఎమ్మెస్పీ 30 మి.మీ పింజ పొడవుతో క్వింటాకు రూ. 5,825 చెల్లిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఏ వెరైటీని రూ. 5,615 చొప్పున ఆ రెండు రాష్ట్రాల్లో సీసీఐ కొనుగోలు చేస్తోంది.


తెలంగాణలో కూడా పత్తి ఉత్పత్తిలో నాణ్యత రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో... 28 మి.మీ పొడవున్న ఎంఈసీహెచ్‌ వెరైటీతోపాటు, 26 మి.మీ నుంచి 26.5 మి.మీ ఉండే పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీసీఐ జోనల్‌ మేనేజర్లు భావిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక అనుమతి సీసీఐ సీఎండీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్‌ తరహా తెలంగాణలోనూ నిబంధనలను కూడా సడలించాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


Updated Date - 2020-11-23T08:10:53+05:30 IST