నిషేధం..తూచ్‌

ABN , First Publish Date - 2021-01-09T08:21:40+05:30 IST

హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని 484.31 ఎకరాలు ప్రభుత్వ భూమి.. ధరణిలో స్పష్టం చేసిన సర్కారు

నిషేధం..తూచ్‌

సర్కారు భూమి అంటూనే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు

2007లో 22ఏ జాబితాలోకి హఫీజ్‌పేట భూములు

ప్రభుత్వ భూములంటూ కోర్టుల్లో సర్కారు వాదన

ఇది ప్రభుత్వ భూమే అంటూ ధరణిలోనూ స్పష్టీకరణ

ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల దందా

వాటిని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో వేల కోట్ల రుణాలు

ఐనా చోద్యం చూస్తున్న సర్కారు.. చర్యలు కరువు

అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే: కలెక్టర్‌ అమయ్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

  • హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని 484.31 ఎకరాలు ప్రభుత్వ భూమి.. ధరణిలో స్పష్టం చేసిన సర్కారు!
  • ఆ భూములన్నీ మాకే చెందుతాయి.. ఏళ్ల తరబడి సుప్రీం సహా వివిధ కోర్టుల్లో వాదనలు!
  • ఆ భూములు 22ఏ కింద నిషేధిత జాబితాలోకి వస్తాయి.. 

రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్లో స్పష్టీకరణ!

అయినా, హఫీజ్‌పేట సర్వే నంబరు 80లో భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టుల్లో కేసులు పడుతూనే ఉన్నాయి. అయినా, ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగానే ఉంటోంది. అవి ప్రభుత్వ భూములని చెబుతున్న సర్కారు.. రిజిస్ట్రేషన్లను మాత్రం అడ్డుకోవడం లేదు. రిజిస్ట్రేషన్‌ జరిగిందని తెలిసినా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. వేల కోట్ల విలువజేసే భూములను కాపాడేందుకు శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వ భూములు ‘మావంటే మావంటూ’ కబ్జాలు చేసి కేసులు వేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తాజా పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.


నగరంలో కలకలం రేకెత్తించిన ప్రవీణ్‌రావు, సోదరుల కిడ్నాప్‌ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని భూ వివాదానికి సంబంధించే  కిడ్నాప్‌ జరిగింది. ఈ నేపథ్యంలోనే.. అసలు ఈ భూమి ఎవరిది? ఎలాంటి వివాదాలు ఉన్నాయి? ప్రస్తుతానికి ఈ భూమి ఎవరి అధీనంలో ఉంది? రిజిస్ట్రేషన్లు చెల్లుతాయా? అనే విషయాలను ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలే వెల్లడవుతున్నాయి. 


యధేచ్ఛగా రిజిస్ట్రేషన్లు

హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని 484.7 ఎకరాల భూములపై కొన్ని దశాబ్దాలుగా వివిధ న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయమై సుప్రీం కోర్టులోనూ తాజాగా వివాదం నడుస్తోంది. పాయ్‌గా వారసులు ఈ భూమి తమదేనని వాదిస్తుండగా.. జాగీర్‌ వ్యవస్థ రద్దయిన తరువాత ఈ భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయని సర్కార్‌ చెబుతోంది. ఈ వివాదాల నేపథ్యంలోనే ఈ భూములపై లావాదేవీలు జరగకుండా 2007లో ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సర్వే నంబరు మొత్తాన్ని 22-ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టింది. ఈ సర్వే నంబర్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచారు. 2013 సెప్టెంబరు 26వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. 19,391 గుంటలు అంటే, 484.7 ఎకరాలు ప్రభుత్వ భూమి కిందకు వస్తుందని రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్లో స్పష్టంగా పేర్కొన్నారు. 


ఇదే సర్వే నంబర్లో మరో 140 ఎకరాలు వక్ఫ్‌ భూములని స్పష్టం చేశారు. అయినా, ఈ సర్వే నంబర్లో పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న గజం భూమిని కూడా రిజిస్ట్రేషన్‌ చేయరు. కానీ, రిజిస్ట్రేషన్‌ శాఖ యధేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉంది. తాజాగా, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకు సంబంధించి పోలీసులు రూపొందించిన రిమాండ్‌ రిపోర్టులో కూడా హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 80లో ఉన్న 25 ఎకరాల భూమిని 2016లో కటికనేని ప్రవీణ్‌ కుమార్‌ కొనుగోలు చేశారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ‘‘ఆ తర్వాత ఆ స్థలం తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ప్రవీణ్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారు.


అనంతరం అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి కొంత డబ్బు చెల్లించిన ప్రవీణ్‌ ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకున్నారు. కానీ, ఇటీవలి కాలంలో భూముల ధరలు పెరగడంతో ఆ స్థలంలో ఆ ముగ్గురూ మళ్లీ వాలారు’’ అని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆ భూములను ఎవరి నుంచి కొనుగోలు చేశారు? ఎలా కొనుగోలు చేశారనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ భూమి తమదేనంటూ సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్న సర్కార్‌ తన కళ్లెదుటే క్రయ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను ఆపడం లేదు. నిషేధిత జాబితాలో ఈ భూములు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. అంతేనా.. ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తులు, సంస్థలు పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తున్నారు. ఇక్కడ విల్లాలు, గేటెట్‌ కమ్యూనిటీలు జోరుగా నిర్మిస్తున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కూడా వీటికి అనుమతులు ఇచ్చేస్తుండడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఇలా సర్కార్‌ భూమిలో దందా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవవుతున్నారు.


డివిజన్‌ జరగకుండానే..

హఫీజ్‌పేటలోని సర్వే నంబరు 80లో 484.7 ఎకరాల భూమి ఉండగా ఇంత వరకు అధికారికంగా సబ్‌ డివిజన్‌ జరగలేదు. కానీ, రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో కొందరు ఇష్టారాజ్యంగా బై నంబర్లు ఇస్తున్నారు. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. డివిజన్‌ జరగకుండా చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లవని అధికారులు చెబుతున్నా.. అక్రమాలను నిలువరించలేకపోతున్నారు.


అర్బన్‌ సీలింగ్‌.. 1200 గజాలే!

హఫీజ్‌పేట భూములకు సంబంధించి సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని ఇటీవల కొందరు చెబుతున్నారు. అయితే, ఇవే ఆదేశాల్లో సుప్రీంకోర్టు మరొక మెలిక కూడా పెట్టింది. ఒకవేళ ఆ భూములు వారివేనని నిర్ధారణ అయిన పక్షంలో అగ్రికల్చరల్‌ సీలింగ్‌ కింద ఐదు ఎకరాలు; అర్బన్‌ సీలింగ్‌ కింద1200గజాలే సదరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్దేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం చూసి నా.. ఎకరాలకు ఎకరాలు తమదేనని చెప్పుకొనేందుకు వీల్లేదు. కానీ, ఇక్కడ ఎకరాలకు ఎకరాలు రిజిస్ట్రేషన్‌ జరిగిపోతోంది. కాగా, నిషేధిత జాబితాలో ఉన్న హఫీజ్‌పేట భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు ఈ భూములను గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకుల్లో తనఖా పెడుతున్నారు. హఫీజ్‌పేటలోని సర్వే నంబరు 80తోపాటు పక్కనే ఉన్న 77, 78, 79లోని వివాదాస్పద భూములను కూడా కొందరు తనఖా పెట్టి వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. వీటిపై రుణం తీసుకున్న కొందరు తిరిగి చెల్లించలేదు. దాంతో, ఈ భూములను వేలం వేసేందుకు రుణం ఇచ్చిన సంస్థలు, బ్యాంకులు సిద్ధమయ్యాయి. వేలాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భూదందాపై లోతైన విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెల్లడవుతాయి.


కోర్టు ఆదేశాలను అడ్డు పెట్టుకుని..

హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని ఏడు ఎకరాలకు సంబంధించి ఇటీవల ఒకరు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీనిని కూడా కోర్టులో సవాల్‌ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇలా ఒకటీ అర కేసుల్లో కొందరికి కోర్టు ఇచ్చిన ఆదేశాలను మిగతా వారికీ అన్వయించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ భూములకు హక్కుదారులమని కోర్టులో కొట్లాడుతున్న వ్యక్తులకు 1968 జూన్‌ 28న హైకోర్టు ప్రిలిమినరీ డిక్రీ ఇచ్చింది. కానీ, ఫైనల్‌ డిక్రీ రాలేదు. ఈ ప్రిలిమినరీ డిక్రీ చూపించి దందా చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వంలోని కొందరు పెద్దల పాత్ర కూడా ఉంది. అందుకే ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే ప్రచా రం సాగుతోంది.


ముమ్మాటికీ సర్కార్‌ భూమే- కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

హఫీజ్‌పేటలోని సర్వే నంబరు 80లో భూములన్నీ సర్కార్‌కే చెందుతాయి. దీనిపై హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాం. సుప్రీం కోర్టుకు తగిన ఆధారాలు కూడా చూపాం. ఇప్పటికే ఈ భూములు రిజిస్ట్రేషన్‌ కాకుండా నిషేధిత జాబితాలో పెట్టాం. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-01-09T08:21:40+05:30 IST