ప్రభుత్వ ఖర్చు.. పొదుపుగా మారితే ప్రయోజనం ఉండదు

ABN , First Publish Date - 2020-05-31T06:19:06+05:30 IST

అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే కొవిడ్‌-19 సంక్షోభం నుంచి అధిగమించడానికి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో చర్యలు తీసుకుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు...

ప్రభుత్వ ఖర్చు.. పొదుపుగా మారితే ప్రయోజనం ఉండదు

  • సీఈఏ సుబ్రమణియన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే కొవిడ్‌-19 సంక్షోభం నుంచి అధిగమించడానికి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో చర్యలు తీసుకుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)  కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అన్నారు. కొవిడ్‌-19 అనంతర వ్యాపార పరిస్థితులపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ చాప్టర్‌ ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. గిరాకీని పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చాలా మంది అంటున్నారని, వినియోగదారుల చేతికి నగదు వచ్చే విధంగా నిర్ణయాలు ప్రకటించి ఉంటే గిరాకీ పెరగడానికి వీలుండేదని వారు చెబుతున్నారన్నారు. అయితే, ప్రస్తుతమున్న అనిశ్చిత పరిస్థితుల్లో వెంటనే నగదును ఖర్చు పెట్టడానికి వినియోగదారులు ముందుకు రాకపోవచ్చని, దీనివల్ల ప్రభుత్వం చేసే వ్యయం పొదుపుగా మారే అవకాశం ఉందని ఆయన వివరించారు. అప్పుడు ప్రభుత్వం ఖర్చు చేసినా గిరాకీ పెరగదని ఆయన పేర్కొన్నారు. కాగా కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందని సుబ్రమణియన్‌ తెలిపారు. ప్రస్తుతం 89 శాతం మంది శ్రామికులు అసంఘటిత రంగంలోనే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.


వీరందరికి సంఘటిత రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించాలంటే శ్రామిక చట్టాల్లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.  కాగా ప్రతి సంక్షోభం ఒక అవకాశమేనని ఐటీసీ చైర్మన్‌, ఎండీ సంజీవ్‌ పురి అన్నారు.  దేశంలో వ్యవసాయ క్లస్టర్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని.. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి తుది వస్తువులను తయారు చేసే కంపెనీలకు మౌలిక సదుపాయాల వంటి వాటిని ఈ క్లస్టర్లలో కల్పించాలని సూచించారు. అంతర్జాతీయంగా భారత వ్యవసాయ ఉత్పత్తులు పోటీ పడేందుకు వ్యయాలను తగ్గించే చర్యలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2020-05-31T06:19:06+05:30 IST