పదోన్నతులపై రగడ !

ABN , First Publish Date - 2021-08-01T09:14:56+05:30 IST

రాష్ట్రంలో చేపట్టిన ఉద్యోగులు, అధికారుల పదోన్నతులపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. కొన్ని సంఘాలు ఒక విధానానికి మద్దతు పలుకుతుంటూ... మరికొన్ని సంఘాలు మరో విధానమే కరెక్ట్‌ అంటూ వాదిస్తున్నా యి. ఇప్పటివరకు కల్పించిన పదోన్నతులను ‘సమీక్షల’ పేర

పదోన్నతులపై రగడ !

జీఏడీ సమీక్షలతో చర్చ..

కాన్సిక్వెన్షియల్‌ సీనియారిటీనే పరిగణించాలంటున్న ఎస్సీ, ఎస్టీ సంఘాలు

ఇనీషియల్‌ సీనియారిటీయే ప్రాతిపదిక అంటున్న ఇతర సంఘాలు

నిలిచిపోయిన సచివాలయ పదోన్నతులు

పూర్తయిన పదోన్నతులపైనా ప్రభావం ?


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టిన ఉద్యోగులు, అధికారుల పదోన్నతులపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. కొన్ని సంఘాలు ఒక విధానానికి మద్దతు పలుకుతుంటూ... మరికొన్ని సంఘాలు మరో విధానమే కరెక్ట్‌ అంటూ వాదిస్తున్నా యి. ఇప్పటివరకు కల్పించిన పదోన్నతులను ‘సమీక్షల’ పేర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) తిరగదోడుతుందంటూ ఎస్సీ, ఎస్టీ అధికార, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తుండగా... ప్రాథమిక (ఇనీషియల్‌) సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు చేపట్టాలంటూ ఇతర సంఘా లు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే కల్పించిన పదోన్నతులతో పాటు సచివాలయంలో చేపట్టాల్సిన అధికారుల పదోన్నతులు సందిగ్ధంలో పడ్డాయి. సచివాలయంలోని వివిధ శాఖలకు సంబంధించి 133 మంది అధికారులకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది.అయితే, ఇవి చాలా కాలంగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) దీనికి ఇంకా క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో ఫైలు ముందుకు కదలడం లేదు.  


జఠిలంగా మారిన పదోన్నతులు

 ఒక సెక్షన్‌ ఆఫీసర్‌(ఎస్‌ఓ) పోస్టు ఖాళీగా ఉందనుకుంటే... అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల(ఏఎస్‌ఓ) నుంచి సీనియారిటీ ప్రాతిపదికన ఒకరిని ప్రమోట్‌ చేయాలి. అది ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు పోస్టు అయితే, ఏఎస్‌ఓల సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వ్యక్తికి పదోన్నతి కల్పించాలి. సాధారణంగా 10 మంది సీనియర్ల జాబితాలో 6వ స్థానంలో ఎస్సీ, ఎస్టీ వ్యక్తి ఉంటే... ఆయనకే పదోన్నతి ఇవ్వాలన్నది రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ సారాంశం. ఇలా 6వ స్థానంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారి ఎస్‌ఓగా పదోన్నతి పొందాడనుకుందాం. అప్పటికే నలుగురు సీనియర్‌ ఎస్‌ఓలు అక్కడ ఉంటే... ఈ 6వ స్థానంలోని ఎస్సీ, ఎస్టీ వ్యక్తి 5వ సీనియర్‌గా మారుతాడు. దీనినే పరిణామాత్మక (కాన్సిక్వెన్షియల్‌) సీనియారిటీ అంటారు. అయితే, రెండేళ్ల అనంతరం 1, 2, 3, 4, 5 స్థానాల్లోని ఏఎస్‌ఓలు కూడా ఎస్‌ఓలుగా పదోన్నతులు పొందారని అనుకుందాం. వీరు 6, 7, 8, 9, 10 స్థానాల్లో ఎస్‌ఓలుగా ఉండాలి.


ఆ తర్వాతి అసిస్టెంట్‌ సెక్రటరీ(ఏఎస్‌) పోస్టుల ఖాళీలను వీరితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. కానీ, కాన్‌సీక్వెన్షియల్‌ సీనియారిటీ సాధించిన ఐదో స్థానంలోని 6వ ఎస్సీ, ఎస్టీ వ్యక్తిని పక్కన పెట్టి, సుప్రీంకోర్టు చెప్పిన ‘క్యాచ్‌-అప్‌ రూల్‌ అప్రూవల్‌ థియరీ’ ప్రకారం... 6, 7, 8, 9, 10 స్థానాల్లోని ఎస్‌ఓలకు ఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించాలంటూ ఇతర అధికార, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తి ముందుగా పదోన్నతి పొంది 5వ స్థానంలో ఎస్‌ఓగా కొనసాగుతున్నారని, ఏఎస్‌లు గా పదోన్నతులు కల్పించే సందర్భంలో జనరల్‌ సీనియారిటీ ప్రకారం ఆయనకు 6, 7, 8, 9, 10  స్థానాల్లోని వారికంటే ముందుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ సంఘాలు చెబుతున్నాయి. కానీ... ఏఎస్‌ఓ కేడర్‌లో ఆయన జూనియర్‌ అని, ఇనీషియల్‌ సీనియారిటీ 1, 2, 3, 4, 5 స్థానాల్లోని ఏఎస్‌ఓల కంటే తక్కువగా ఉందని, పైగా ఏఎస్‌ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ పోస్టు లేదని జనరల్‌ కేటగిరీ సంఘాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేపట్టిన పదోన్నతులన్నింటినీ జీఏడీ సమీక్షిస్తోంది.


వారు డిమోట్‌ అవుతారా?  

ఇనీషియల్‌ సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే... ఇదివరకు పదోన్నతులు పొందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు డిమోట్‌ అయ్యే అవకాశాలున్నాయని కొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి జనవరి నెలలో ప్రభుత్వం మొత్తం 32 శాఖల్లోని అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించింది. 18 వేల మందికిపైగా పదోన్నతులు పొందారు. ఇప్పుడు ఈ పదోన్నతులన్నింటినీ సమీక్షించి, ఇనీషియల్‌ సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటారని, ఇది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు నష్టమని చెబుతున్నారు. కానీ... ఎస్సీ, ఎస్టీ పోస్టులు లేనప్పుడు ఎలా ప్రమోషన్లు ఇస్తారంటూ జనరల్‌ కేటగిరీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలోని 11 మంది అడిషనల్‌ సెక్రటరీ పోస్టుల్లో ఆరుగురు ఎస్సీ, ఎస్టీ అధికారులున్నారని, నిబంధనల ప్రకారం వీరిలో నలుగురిని డిమోట్‌ చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. 

Updated Date - 2021-08-01T09:14:56+05:30 IST