మత్తు చట్టం.. మరీ కఠినం

ABN , First Publish Date - 2021-10-27T08:07:38+05:30 IST

నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌’.. షారుక్‌ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ను ‘నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)’ అరెస్టు చేసింది ఈ చట్టం కిందే! కింగ్‌ ఖాన్‌ కుమారుడి అరెస్టు నేపథ్యంలో మరోసారి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ..

మత్తు చట్టం.. మరీ కఠినం

  • 1961 నాటి అంతర్జాతీయ ఒప్పందం మేరకు భారతదేశంలో ఎన్డీపీఎస్‌ చట్టం అమల్లోకి
  • అప్పట్లో డ్రగ్స్‌పై పాశ్చాత్య దేశాల యుద్ధం 
  • వాటి బాటలోనే మన దగ్గర  కఠిన చట్టాలు
  • ప్రజాస్వామిక కోణంలో సంస్కరించాలని పలువురి విజ్ఞప్తి
  • తక్కువ డ్రగ్స్‌ కలిగి ఉన్నవారికి జైలు  వద్దు
  • ఇటీవలే కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రతిపాదన


‘నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌’.. షారుక్‌ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ను ‘నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)’ అరెస్టు చేసింది ఈ చట్టం కిందే! కింగ్‌ ఖాన్‌ కుమారుడి అరెస్టు నేపథ్యంలో మరోసారి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. ఈ చట్టంపై, దీనిప్రకారం విధించే శిక్షలపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా.. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు పదేపదే ప్రస్తావనకు వస్తోంది. సాధారణంగా ఏదైనా కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. నేరం నిరూపితమయ్యేదాకా వారు దోషులు కారు. కానీ, ఈ చట్టం కింద అరెస్టయినవారు తమను తాము నిర్దోషులమని నిరూపించుకునే దాకా దోషులుగానే చూస్తారు. అందుకే ఈ కేసుల్లో బెయిల్‌ దొరకడం చాలా కష్టమవుతుంది. ఆర్యన్‌ఖాన్‌ విషయంలో జరుగుతున్నది అదే. ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తులు పరిస్థితులు, అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారైతే తప్ప బెయిల్‌ దొరకడం కష్టం. అంత కఠినమైన చట్టమిదని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1985లో రూపుదిద్దుకున్న ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ ఈ నాలుగు దశబ్దాల్లో కొన్ని మార్పుచేర్పులకు నోచుకుంది.


కానీ, ఇప్పటికీ ఇది కఠినమైనదేనని.. చాలా మంది అమాయకుల పాలిట విఘాతంగా, పబ్లిసిటీ కోరుకునే అవినీతి  పోలీసు అధికారుల చేతిలో అస్త్రంగా, లాయర్లకు ఆదాయవనరుగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఆర్యన్‌ ఖాన్‌ కేసు విషయమే తీసుకుంటే.. ఎన్సీబీకి అతడి వద్ద డ్రగ్స్‌ దొరకలేదు. అయినా అతడికి బెయిల్‌ దొరకడం కష్టంగా మారింది.  


ఎందుకిలా?

1950ల నుంచి 1970ల నడుమ పాశ్చాత్య దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, అమ్మకాలు విచ్చలవిడిగా ఉండేవి. దీంతో.. ఇప్పుడు ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు యుద్ధం ప్రకటించినట్టుగానే అప్పట్లో పలు దేశాలు మాదకద్రవ్యాలపై పోరు ప్రకటించాయి. 1961లో ఆయా దేశాలు పారి్‌సలో ‘సింగిల్‌ కన్వెన్షన్‌ ఆన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌’ పేరిట సమావేశమయ్యాయి. తదుపరి 25 సంవత్సరాల్లో డ్రగ్స్‌ మహమ్మారిని ఉక్కుపాదంతో అణచివేసే చట్టాలు చేయాలనే ఒప్పందానికి వచ్చాయి. ఆరోజు ఆ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. కానీ.. అప్పట్నుంచీ దాదాపు పాతికేళ్లపాటు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. గడువు ముంచుకొస్తుండడంతో చివరికి 1985లో ఆదరాబాదరాగా ఎన్డీపీఎస్‌ చట్టం చేసింది. అనంతర కాలంలో ఆయా దేశాలు మాదకద్రవ్యాల నిరోధక చట్టాలను ప్రజాస్వామిక కోణంలో సంస్కరించుకున్నాయి. మనదేశం కూడా కొన్ని మార్పుచేర్పులను చేసినప్పటికీ ఆ దేశాల స్థాయిలో సంస్కరించలేదు. 1985లో చేసిన ఎన్డీపీఎస్‌ యాక్ట్‌కు తొలిసారి 1988లో సవరణ చేశారు. మాదకద్రవ్యాల వ్యక్తిగత  వినియోగానికి శిక్షను తగ్గించారు. డ్రగ్స్‌ను తక్కువ మోతాదులో వినియోగించేవారు, మురికివాడల్లో ఉండేవారిని ఈ చట్టం పేరుతో ఇబ్బంది  పెడుతుండడంతో.. 1994లో పీవీ హయాంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సూచనల మేరకు 2001లో(వాజ్‌పేయీ హయాంలో) మరికొన్ని మార్పులు చేశారు. 2014 మార్చిలో మన్మోహన్‌ సర్కారు.. ఈ చట్టంలో పేర్కొన్న మరణశిక్షను తప్పనిసరి నుంచి ఐచ్ఛికానికి మార్చింది. అంటే న్యాయమూర్తుల విచక్షణకు వదిలేసింది.  


శిక్షలు తక్కువే!

నేషనల్‌ లా యూనివర్సిటీ ఢిల్లీ అధ్యయనం ప్రకారం.. 2000 నుంచి 2014 నడుమ మనదేశంలో ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద ట్రయల్‌ కోర్టులు ఐదుగురికి మరణశిక్ష విధించాయి. వారిలో నలుగురికి పై కోర్టులు ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాయి. ఒకరైతే నిర్దోషిగా బయటపడడం గమనార్హం. అంటే.. హడావుడే తప్ప ఈ కేసుల్లో శిక్ష పడుతున్న సందర్భాలు కూడా తక్కువే. అందుకే కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఇటీవలే ఒక ఆసక్తికర ప్రతిపాదన చేసింది. వ్యక్తిగత వాడకానికి కొద్ది మొత్తంలో డ్రగ్స్‌ ఉంచుకున్న వారిని జైలుకు పంపొద్దని సూచించింది. స్వల్ప మొత్తంలో డ్రగ్స్‌ కలిగి ఉండడాన్ని నేరంగా పరిగణించరాదని పేర్కొంది. డ్రగ్స్‌ స్వల్పంగా వాడేవారిని, వాటిపై ఆధారపడేవారిని బాధితులుగా పరిగణించాలని.. ఇలాంటి వారిని జైలుకు కాకుండా డీ అడిక్షన్‌, పునరావాస కేంద్రాలకు పంపాలని సూచించింది. ఈ మేరకు ఎన్డీపీఎస్‌ చట్టంలో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.               


3040 కిలోలు

ఈ ఏడాది జనవరి-జూలై నడుమ అధికారులు మనదేశంలో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌. అంతేనా.. 3,35,052 కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. 


ఇవీ శిక్షలు..

  • ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం.. భారత్‌లో డ్రగ్స్‌ వాడకం లేదా డ్రగ్స్‌ కలిగి ఉండడం నేరం. 
  • ఈ చట్టంలోని సెక్షన్‌ 27 ప్రకారం.. ఎలాంటి డ్రగ్స్‌ వాడినా ఏడాది వరకు జైలు లేదా రూ.20 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఇక, ఎంత మోతాదులో డ్రగ్స్‌ను కలిగి ఉన్నారనేదాన్ని బట్టి కూడా శిక్షలు మారుతాయి. ఉదాహరణకు.. 2 గ్రాముల్లోపు కొకెయిన్‌ (లేదా) అరగ్రాము లోపు ఎండీఎంఏ (లేదా) 100 గ్రాముల్లోపు చరస్‌ కలిగి ఉంటే ఏడాది దాకా జైలు శిక్ష, 10 వేల దాకా జరిమానా, లేదా రెండు శిక్షలూ పడే అవకాశం ఉంది. 
  • 2 గ్రాముల నుంచి 99 గ్రాముల దాకా కొకెయిన్‌ (లేదా) అరగ్రాము నుంచి 10 గ్రాముల దాకా ఎండీఎంఏ (లేదా) 100 గ్రాముల నుంచి కిలో దాకా చర్‌సను కలిగి ఉంటే పదేళ్ల దాకా జైలు శిక్ష, రూ.లక్ష దాకా జరిమానా వేస్తారు. 
  • అంతకు మించి మాదకద్రవ్యాలను కలిగి ఉంటే.. వాటిని విక్రయిస్తున్నట్టుగా భావించి 10 నుంచి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల దాకా జరిమానా వేస్తారు. ఒకసారి శిక్ష పడ్డాక కూడా అదే నేరానికి పాల్పడితే ఒకటిన్నర రెట్ల శిక్ష, జరిమానా వేస్తారు.
  • సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-10-27T08:07:38+05:30 IST