అట్టుడుకుతున్న అమెరికా.. 25 నగరాల్లో విధ్వంసం!

ABN , First Publish Date - 2020-06-01T14:19:51+05:30 IST

ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా చెలరేగిన అల్లర్లతో అమెరికా అట్టుడుకుతోంది. పోలీసు అధికారి తన మెడ మీద కాలు వేసి తొక్కుతుంటే.. నిస్సహాయస్థితిలో ‘నాకు ఊపిరి ఆడట్లేదు (ఐ కాంట్‌ బ్రీత్‌)’ అంటూ రోదించిన జార్జ్‌ఫ్లాయిడ్‌ చివరి మాటలే నినాదంగా అమెరికన్‌ యువత

అట్టుడుకుతున్న అమెరికా.. 25 నగరాల్లో విధ్వంసం!

  • జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా 25 నగరాల్లో విధ్వంసం

వాషింగ్టన్‌, మే 31: ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా చెలరేగిన అల్లర్లతో అమెరికా అట్టుడుకుతోంది. పోలీసు అధికారి తన మెడ మీద కాలు వేసి తొక్కుతుంటే.. నిస్సహాయస్థితిలో ‘నాకు ఊపిరి ఆడట్లేదు (ఐ కాంట్‌ బ్రీత్‌)’ అంటూ రోదించిన జార్జ్‌ఫ్లాయిడ్‌ చివరి మాటలే నినాదంగా అమెరికన్‌ యువత ఉద్యమిస్తోంది. భవనాల గోడలపై.. వాహనాల అద్దాలపై.. కార్లపై.. ప్లకార్డులపై.. అన్నిచోట్లా అదే నినాదం! అందరి నోటా అదే మాట!! నల్లజాతివారిపై పోలీసుల దాష్టీకాలు అలవాటుగా మారాయని నిరసిస్తూ.. పలు ప్రాంతాల్లో పోలీసుల వాహనాలను, భవనాలను ఆందోళనకారులు తగలబెడుతున్నారు. దుకాణాల్లో లూటీలకు తెగబడుతున్నారు. పదులు, వందల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి విధ్వంసానికి పాల్పడుతూ పోలీసులపై తమ కోపాన్ని చాటుతున్నారు. ఫిలడెల్ఫియాలో 13 మంది పోలీసులు అధికారులు ఈ హింసాత్మక నిరసనల్లో తీవ్రంగా గాయపడ్డారు. ‘‘జరుగుతున్న తప్పులు.. నిజంగా తప్పులు కావు. వారు మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. నల్లజాతివారిని చంపడం ఇకనైనా మానుకోవాలని ప్రజలు కోరుతున్నారు’’ అని ఒక నిరసనకారుడు ఆగ్రహంగా అన్నారు. కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా నిరసనకారులు విధ్వంసాన్ని కొనసాగిస్తుండడంతో.. మిన్నెసొటా, కాలిఫోర్నియా, జార్జియా, ఓహియో తదితర 11 రాష్ట్రాల్లో నేషనల్‌ గార్డ్‌ రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద కూడా జాతీయ సైన్యం అప్రమత్తమైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయి్‌సవిల్లె, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌లాండ్‌, కొలంబియా తదితర 25 నగరాల్లో ఎమర్జెన్సీ కర్ఫ్యూలు విధించారు. వైట్‌హౌస్‌ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శనను రిపోర్ట్‌ చేసేందుకు వెళ్లిన ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ను ఆందోళనకారు లు తరిమికొట్టారు. అక్కడే కాదు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాత్రికేయులపై, మీడియా ఫొటోగ్రాఫర్లపై తీవ్రదాడులు జరగుతున్నాయి. కాగా.. ఈ అల్లర్లలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు, పోలీసులు గాయపడ్డారు. 17 నగరాల్లో 1400 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేశారు. 



ఆరేళ్ల క్రితం.. అదే వేదన

అది.. 2014, జూలై 17. అమెరికాలోని న్యూయార్క్‌లో ఎరిక్‌ గార్నర్‌ అనే నల్లజాతీయుణ్ని పోలీసులు పట్టుకున్నారు. పన్ను ముద్రలు లేని సిగరెట్‌ ప్యాకెట్ల నుంచి విడి సిగరెట్లు అమ్ముతున్నాడనే అనుమానంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాను విడి సిగరెట్లను అమ్మట్లేదని అతడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఎరిక్‌ను అరెస్ట్‌ చేసే క్రమంలో.. డేనియల్‌ పాంటాలియో అనే పోలీసు అధికారి అతణ్ని కింద పడేసి, అతడి మెడ చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. డేనియల్‌ పట్టు విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన ఎరిక్‌.. ‘నాకు ఊపిరి ఆడట్లేదు’ అని పదకొండుసార్లు వేడుకున్నాడు. ఆ తర్వాత అతడు స్పృహతప్పడంతో డేనియల్‌ అతడి మెడ మీద పట్టు సడలించాడు.  అతణ్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అమెరికావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 2015లో ఎరిక్‌ కుటుంబానికి న్యూయార్క్‌ పోలీస్‌ విభాగం.. 5.9 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది. 2019 ఆగస్టు 19న డేనియల్‌ పాంటాలియోను విధుల నుంచి తొలగించారు. ఎరిక్‌ మరణించిన ఆరేళ్ల తర్వాత.. జార్జ్‌ ఫ్లాయిడ్‌ కూడా పోలీసు దౌష్ట్యానికి గురై, ఎరిక్‌ లాగానే ‘నాకు ఊపిరి ఆడట్లేదు’ అని వేడుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా యువత ఆగ్రహానికి అదే కారణమైంది.


నా హోటల్‌ తగలబడ్డా పర్వాలేదు

జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా ఆందోళనకారులు మినియాపోలి్‌సలోని ‘గాంధీమహల్‌’ అనే రెస్టారెంట్‌ను తగలబెట్టారు. దీనివల్ల తనకు తీవ్ర నష్టం జరిగినా సరే.. ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలని, ఆ పోలీసు అధికారిని జైల్లో పెట్టాలని రెస్టారెంట్‌ యజమాని రుహెల్‌ ఇస్లాం పేర్కొన్నారు. ఆందోళనకారులు తన రెస్టారెంట్‌కు నిప్పు పెడుతున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులకు కృతజ్ఞతగా ఉంటామన్నారు.  


విడాకులిప్పించండి

జార్జ్‌ఫ్లాయిడ్‌ మెడపై మోకాలు వేసి తొక్కి చంపిన పోలీసు అధికారి డెరెక్‌ చావిన్‌ భార్య కెల్లీ.. విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఫ్లాయిడ్‌ కుటుంబానికి ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని.. భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారని కెల్లీ న్యాయవాది తెలిపారు. 


Updated Date - 2020-06-01T14:19:51+05:30 IST