లాక్‌డౌన్‌లో రెచ్చిపోతున్న దొంగలు

ABN , First Publish Date - 2021-05-19T09:20:28+05:30 IST

లాక్‌డౌన్‌లోనూ దొంగలు తమపని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు లాక్‌డౌన్‌ విధుల్లో బిజీగా ఉంటుండగా, దొంగలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితులను వాడుకుంటూ చోరీలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.

లాక్‌డౌన్‌లో రెచ్చిపోతున్న దొంగలు

  • రోజుకు పదుల సంఖ్యలో చోరీలు
  • తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌
  • చైన్‌ స్నాచింగ్‌లూ పెరిగిపోయిన వైనం


హైదరాబాద్‌ సిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లోనూ దొంగలు తమపని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు లాక్‌డౌన్‌ విధుల్లో బిజీగా ఉంటుండగా, దొంగలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితులను వాడుకుంటూ చోరీలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. పలు జిల్లాల నుంచి పనుల కోసం ఇక్కడకు వచ్చిన వారిలో చాలా మంది లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, తిరిగి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు రాత్రిపూట పలు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. అర్ధరాత్రి తాళాలు విరగ్గొట్టి చోరీలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజుకు పదుల సంఖ్యలో చోరీలు జరుగుతున్నాయి. ఇళ్లలోనే కాదు.. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారినీ బెదిరించి దోపిడీ చేస్తున్నారు. ఇటీవల చోరీలు అధికమైపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 


రెండు రోజుల క్రితం సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగి దుందిగల్‌ పరిధిలో ఓ దొంగల ముఠాను పట్టుకున్నారు. స్విగ్గీ డెలివరీ బోయ్స్‌గా పని చేసుకుంటున్న కొందరు యువకులు ముఠాగా ఏర్పడి రాత్రిపూట కనపడిన వారిని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. మరోవైపు, రాచకొండ సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగి రెండు రోజుల క్రితం రాజస్థాన్‌కి చెందిన దొంగల ముఠాను పట్టుకున్నారు. మరికొన్ని దొంగల ముఠాల కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


లాక్‌డౌన్‌ వేళ చైన్‌ స్నాచింగ్‌ కేసులూ అధికమయ్యాయి. పలు కాలనీల్లో తిరుగుతున్న దొంగలు ఒంటరిగా కనపడిన మహిళల మెడ ల్లోంచి చైన్‌లను లాక్కెళ్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లోని జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వరుసగా చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఇదంతా ఒకే ముఠాకు చెందిన వారు చేస్తున్నట్లు గుర్తించిన రాచకొండ పోలీసులు మంగళవారం మాటువేసి ఇద్దరు చైన్‌ స్నాచర్‌లను పట్టుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-19T09:20:28+05:30 IST