పందేలకు సై

ABN , First Publish Date - 2021-01-11T07:47:56+05:30 IST

హైకోర్టు వద్దంది. పోలీసులూ కేసులు పెడుతున్నారు. కరోనా బెడద తొలగనూ లేదు... అయినా ఎప్పటిలాగే కోడి పందేలకు రంగం సిద్ధమైపోతోంది.

పందేలకు సై

  • సిద్ధమవుతున్న బరులు
  • గుండాటలకు వేలం పాటలు
  • కోడి పందేలు వద్దన్న హైకోర్టు
  • నిషేధానికి పోలీసుల చర్యలు
  • పందేలను ప్రోత్సహిస్తున్న నేతలు


అమలాపురం, జగ్గంపేట, జనవరి 10(ఆంధ్రజ్యోతి): హైకోర్టు వద్దంది. పోలీసులూ కేసులు పెడుతున్నారు. కరోనా బెడద తొలగనూ లేదు... అయినా ఎప్పటిలాగే కోడి పందేలకు రంగం సిద్ధమైపోతోంది. కోడి పుంజులు.. కత్తులూ సిద్ధం చేశారు. పందేలు వేసేందుకు బరుల ఏర్పాట్లూ పూర్తవుతున్నాయి. పందేలతోపాటు గుండాట, పేకాట, జూదరులను ఆనందంలో ముంచే అశ్లీల నృత్యాల నిర్వహణ తదితర ఏర్పాట్లన్నీ చకాచకా సాగిపోతున్నాయి. ఇదీ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి.  అధికార వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఆయా ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు సాగిపోతున్నాయి. సంక్రాంతి పర్వదినం ముసుగులో జూద క్రీడావినోదాలను నిర్వహించేందుకు వైసీపీ నేతలు చేస్తున్న సన్నాహాలకు జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం అందిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్వాహకులు బహిరంగంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఏటా వందకుపైగా పందెంబరులు ఏర్పాటు చేస్తున్నా.. వీటిలో కీలకమైనవి 15లోపే. ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో ఏర్పాటవుతున్న బరి వద్ద గుండాటలు నిర్వహించుకునేందుకు రూ.50 లక్షలకుపైనే బహిరంగ వేలం పాటలో దక్కించుకున్నట్టు సమాచారం. కొత్తపేటలోని ఓ ప్రైవేట్‌ స్కూలు ఆవరణలోని కోడిపందేల బరి వద్ద గుండాట నిర్వహణను ముగ్గురు వైసీపీ నేతలు రూ.20లక్షలకు దక్కించుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో పేకాట ఇన్విటేషన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.


హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవద్దు

కోడి పందేలకు సహకరించండి

పోలీసులను కోరిన ఎమ్మెల్యే చంటిబాబు


‘సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. కోడిపందేలు జరగక్కూడదని హైకోర్టు ఆదేశించింది. మీరు అవేమీ పట్టించుకోవద్దు. సంప్రదాయబద్ధంగా మూడు రోజులూ కోడిపందేల నిర్వహణకు సహకరించండి’ అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పోలీసులను కోరారు. ఆదివారం జగ్గంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసులూ! మీకే చెప్తున్నాం... కోడి పందేలు ఆడేవారిని, నిర్వహించే వారిని ఇబ్బందిపెట్టొద్దు. మీకు కోర్టు ద్వారా గానీ, పై అధికారుల ద్వారా గానీ ఆదేశాలు రావడం సహజం. కానీ మన నియోజకవర్గంలో జరిగే పందేలకు సహకరించండి’ అని సీఐ, ఎస్‌ఐలను పిలిచి చెప్పడం చర్చనీయాంశమైంది.



Updated Date - 2021-01-11T07:47:56+05:30 IST