Abn logo
Oct 18 2021 @ 03:11AM

ప్రజా భారత ఐతిహాసికుడు

కవిత్వానికి తక్షణ ప్రయోజనం- కవిత్వాన్ని విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొంది వ్వాహ్‌ అనడం, భోజనం తిని గుర్రున త్రేన్చినట్టు. అయితే తిన్న అన్నం జీర్ణమై శరీరాన్ని, మెదడును నడిపే ఇంధనమై రక్తప్రవాహాల్లోకి ప్రవేశించి, నఖశిఖ పర్యంతం వేలాది రక్తనాళాల్లో ప్రవహిస్తూ క్రమంగా మనిషిని శారీరకంగా మానసికంగా బలిష్టున్ని ఎలా చేస్తుందో ఎలా సజీ వునిగా నిలబెడ్తుందో అలాగే కవిత్వ శ్రవణం చేత ప్రభావితు డౌతాడు. అలంకార బింబ ప్రతీకలు శ్రవణేంద్రియాల ద్వారా మనిషిలోని రక్తంలోకి ప్రవేశించి అ నదుల్లో కరిగిపోయి సమస్త శరీరవ్యాప్తమౌతాయి. రక్తనిష్ఠమౌతాయి. అలా ఒక తరం మాన వుల్లో రక్తనిష్ఠమైన అలంకార బింబ ప్రతీకలు తదనంతర తరానికి జన్యుకణాల ద్వారా సంక్రమింపజేయబడ్తాయి. అలా తరతరాలు రక్తనిష్ఠంగా సంక్రమింపజేయబడి, అవి మనిషి ఆలోచనల్నీ, అలవాట్లనీ, చర్యల్నీ, స్వభావాల్నీ రూపాయితం చేస్తాయి. ఒక దేశపు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఆ దేశపు ప్రజలకు ఇదే చేస్తాయి. ఆ పార్యంతిక ఫలాల్నే ఆ దేశపు సంస్కృతి అనీ, నాగరికత అనీ అంటారు. ఈ రెంటికీ కవులే జనకులు. ఇదే కవిత్వం కలిగించే శాశ్వత ప్రయోజనం. 

శేషేంద్ర 

కవిసేన మానిఫెస్టో, 

నేటి కవిత్వం - వివిధ దృక్పథాలు (ఆగస్ట్‌, 1994)


1977లో ప్రథమ ముద్రణగా వెలువడ్డ ఆధునిక కావ్యశాస్త్రం ‘కవిసేన మానిఫెస్టో’ను వెలువరిస్తూ శేషేంద్ర దాన్ని ‘‘అపూర్వ చైతన్య వ్యాప్తికోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక కవితోద్యమ పత్ర’’మని అభివర్ణించారు. ‘‘ప్రాచీన ప్రాక్‌ పశ్చిమ కావ్య తత్త్వచింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్ట్‌ కావ్యతత్త్వ చింతన- అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్యజనక అభిన్నతనూ, ఐకమత్యాన్నీ సమ్మేళన పర్చి, ఈ విజ్ఞానభారాన్నంతటినీ మోస్తేనే ఆధునిక మానవుడి విజ్ఞానానికి సమగ్రత వస్తుందని ప్రతిపాదించింది’’ ఈ పత్రం అన్నారు. ‘‘ఇది ఒక రాజకీయ ఉద్యమం కాదు. ఇది ప్రధానంగా వైజ్ఞానిక ఉద్యమం. కవికి రాజకీయాలతో సంబంధం ఉంటుంది, కాని రాజకీయ పార్టీలతో ఉండదు. రాజకీయ పార్టీలవాళ్ళు సభ్యులుగా ఉండవచ్చుగానీ మూలభూతమైన కవిసేన ఆశయా లకు లోబడి మాత్రమే ఉండగలరు’’ వంటి ప్రధాన లక్ష్యాలను వివరిస్తూ ఎనిమిది సూత్రాలను మార్గదర్శకాలుగా పొందుపర్చారు ఈ మానిఫెస్టోలో. ఈ వైజ్ఞానిక కళాత్మక భావనను తన కవిత్వ ఊహాశాలితతో స్వప్నించిన శేషేంద్ర 1977లలోని దేశ సామాజిక స్థితిగతులను ఈ రకంగా అధ్యయించాడు: ‘‘నీవు కాలేజికి పోతూంటే బాబూ! నిన్ను పొలాలు బిక్కమొహంతో చూస్తున్నాయి. ప్రతిరోజూ ఈ పుస్తకాలుగా ఊరేగింపు ఎందుకు ఈ దేశపు వీధుల్లో... మీరు పలకా పుస్తకాలు పట్టుకుపోతూంటే బాబూ! మీరు శిలువలు మోస్తున్న బాల క్రైస్తవుల్లా కనిపిస్తారు నా కళ్ళకు. లే బాబూ లే, నీ బాల్యంలోంచి లే! పుస్తకాలవతల పారేయ్‌! నాగలి భుజాన వేసుకో! ఈ కులాలు విడిచిపెట్టు ఆ పొలాల్లో కలువ్‌... పొలాలు మీకు స్వేచ్ఛాదానం చేస్తాయ్‌. హాయిగా పీల్చే ఊపిరిని కానుకగా ఇస్తాయ్‌, పీఠభూమిలాంటి ఛాతీనిస్తాయ్‌, ఇనుప ఊచల్లాంటి కాళ్ళిస్తాయ్‌...!’’ అంటాడు. ‘‘ఫూడల్‌ వ్యవస్థ పతనమై ధనస్వామ్య వ్యవస్థ అవతరించింది. యాంత్రిక నాగ రికత మధ్యతరగతి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. ఇప్పుడు కార్మికుడు ధనస్వామి చేతిలో పనిముట్టు. కర్షకుడు పాలకుల కుతంత్రాలలో చిక్కుకుని రాజకీయ దుష్టసంస్కృతితో పోటీపడ లేకపోతున్నాడు, ఇటువంటి మానవుడికి సరైన దిశానిర్దేశం చూపడంకోసమే మన కవిసేన ఉద్యమిస్తుంది’’ అని నినదించాడు. 


నిజానికి ఈ రకంగా రాజకీయాల్లో చురుగ్గా, బాధ్యతాయు తంగా ఆ సమాజ ఉన్నతీకరణలో పాల్గొనే ప్రజలకు స్థిరత్వమూ, నైతికతా, ధర్మాధర్మ విచక్షణాలేని కుళ్ళు రాజకీయ పార్టీలకు విధేయంగాగానీ, పార్టీవ్రత్యంతోగానీ ఉండవలసిన అవసరం లేదని, చిత్తశుద్ధితో స్వధర్మపాలనను సాగించ గల్గుతూ ఒక ఐడియల్‌ సమాజాన్ని సృష్టించే నిష్టగల పౌరులను స్వప్నించి తన కవితల్లో కాళోజీ ప్రస్తుతించాడు (పార్టీవ్రత్యం, 09-04- 1960, ‘నా గొడవ’). శేషేంద్ర తన కవిసేన మానిఫెస్టోలో ప్రతిపాదించిన పై సిద్ధాంతాన్ని కూడా కాళోజీ ఊహించిన పార్టీవ్రత్యం లేని స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత మానవ గణ సంఘంగా భావించవచ్చేమో. 


1994లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ పొందిన శేషేంద్ర తులనాత్మక సాహిత్య వ్యాసాల సంపుటి ‘కాలరేఖ’ ఎంతో విలు వైంది. విమర్శకునిగా, విశ్లేషకునిగా, వ్యాఖ్యాతగా శేషేంద్ర విభిన్నమైన దృష్టీ, దృక్పథమూ, విధానమూ విలక్షణంగా ఉండడం విజ్ఞులెవ్వరికైనా బోధపడ్తుంది ఈ గ్రంథంలో. ‘వాల్మీకి కవిత’, ‘మేఘసందేశము’, ‘అరవింద సావిత్రి’, ‘వ్యాసుడెవరు?’, ‘విక్రమోర్వశీయము’, ‘గజల్‌ ఒక అయస్కాంత విద్య’, ‘గజల్‌ ఒక అగ్ని.. ఒక సంస్కృతి’ వంటి అతిగాఢమైన, లోతైన విష యాలను విడమర్చి చర్చించిన తీరు జిజ్ఞాసువులకు తృప్తిని కలిగిస్తుంది. మనందరకు తెలిసిన రాయప్రోలు సుబ్బారావు, తిరుపతి వేంకటకవులు, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహంల గురించి రాసిన వ్యాసాలు కొంగ్రొత్త విషయాలనూ, సమాచారాన్నీ అందిస్తాయి. ఇండో సోవియట్‌ స్నేహసమితి 21-2-86 నాడు రష్యన్‌ కవి గుల్టినోవ్‌తో హైదరాబాద్‌లో ఒక ఇష్టాగోష్టి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సభకు శేషేంద్రతోపాటు నేనూ వెళ్ళాను. చాలామంది సీనియర్‌ కవులు గజ్జెల మల్లారెడ్డి, కొత్తపల్లి వీరభద్రరావు, పోతుకూచి సాంబశివరావు, చాగంటి సోమయా జులు వంటి దిగ్గజాలు ఉన్నారా సమావేశంలో. ఒక ఉస్మానియా అధ్యాపకురాలు దుబాసీగా సహాయపడ్తూండగా అనేక నిస్సార మైన ప్రశ్నలు జరుగుతున్నాయి. చాగంటి సోమయాజులు డేవిడ్‌ గుల్టినోవ్‌గారిని అడిగారు ‘‘మీ దగ్గర కవిత్వం చదువబడ్తుందా, పాడబడ్తుందా’’ అని. ఆ ప్రశ్నకు ఇంకాస్త వివరణ ఇస్తూ శేషేంద్ర అడిగారు ‘‘మీ కవిత లయాత్మక రచనా లేక పొడి వచన రచనా’’ అని. దానికి డేవిడ్‌గారు స్పష్టంగా ‘‘లయాత్మక రచనే’ అని సమాధానమిచ్చారు. ఇక అక్కడి నుండి చర్చ ఆధునిక ప్రపంచంలో వచన కవితలకు ఆధ్యుడుగా భావించ బడ్తున్న ఫ్రెంచ్‌ కవి చార్లెస్‌ బోదిలేర్‌ నుంచి మొదలై సింబలిస్ట్‌ కవి చతుష్టయం బోదిలేర్‌, స్టీఫెన్‌ మల్లార్మే, పాల్‌ వెర్లేన్‌, ఆర్థర్‌ రీంబోల మీదికి మళ్ళింది. వెర్లేన్‌ కవిత్వం రాగాత్మకంగా ఉంటే ప్రసిద్ధమౌ తుందని ప్రస్తావించి verse must be musical అని ప్రతిపాదించడం ప్రస్తావనకు వచ్చింది. అంతిమంగా ధారణకూ, పునరుత్పత్తికీ లొంగగల (మన తేటగీతిలా) సదుపాయం కలగా లంటే వచనకవిత్వం కూడా స్వచ్ఛందంగా రాగాత్మకమూ, లయాత్మకమూ, సంగీతాత్మకమూ అయి వ్యంజనతో కూడినదైతే సమగ్రతను సంతరించు కుంటుందని, కవిత ఆయుష్షు దీర్ఘమౌతుందని చర్చ భావిం చింది.  శేషేంద్ర తన ‘కాలరేఖ’లో ఈ ఉదంతాన్ని రాశారు. అదే విధంగా గజల్‌ గురించి.. దాని నిర్మాణమూ, హైదరాబాదీ గజల్స్‌ ఆవిర్భావ వికాసాలు, గజల్‌ ఒక అయస్కాంత విద్యగా భాసించడం, అగ్నిగా జ్వలించడం.. అదంతా ఒక మాయామయ లోకంగా శేషేంద్ర వివరించి వ్యాఖ్యానించారు. 


1977లో ప్రచురితమై వెలువడ్డ ‘షోడశి: రామాయణ రహ స్యములు’ ఆదికావ్యం రామాయణానికి సంబంధియైున కేవలం ఒక ఇతిహాస కావ్య విశ్లేషణ మాత్రమే కాదనీ, అట్లాగే ‘స్వర ్ణహంస’ కూడా హర్షనైషదానికి సంబంధించిన వ్యాఖ్యానం కాదనీ యోగతత్పరులూ, ఉపాసకులూ, మంత్రతంత్ర విద్యల్లో పారంగతులూ అయిన పండితులు సెలవివ్వగా శేషేంద్ర ప్రత్యేక పాండిత్య ప్రకర్ష అర్థమైంది. సుందరకాండలో కుండలినీ యోగం, త్రిజటా స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్రం ధ్వనిస్తున్న దనీ, రామాయణం ఇంద్ర పారమ్యాన్ని ప్రతిపాదిస్తున్నదనీ శాకుంతలంలోని నాందీ శ్లోకం దేవీ స్తోత్రమేననీ, షోడశి అనేది శ్రీవిద్యకు సంబంధించిన పదమనీ ఈ గ్రంథాలకు ఎన్‌. రమేషన్‌ (ఐయ్యేఎస్‌), జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారా యణ, ‘షోడశి’ని ఇంగీష్‌లోకి అనువదించిన గురజాడ సూర్య నారాయణ మూర్తిగార్ల ముందుమాటలను బట్టి అర్థమౌతోంది. 


కవిత్వానికి అనుభూతే సర్వదా ముఖ్యమనీ, అనుభూతి లోంచే కవిత్వంలోని అలంకారాలు, బింబాలు, ప్రతీకలు పుడతాయనీ, అనుభూతి తత్కాల జనిత భావాత్మక ఉద్వేజన చేత వ్యక్తి పొందేదనీ శేషేంద్ర అంటారు. 


శేషేంద్ర ‘కామోత్సవ్‌’ నవల 28-08-1987 నుండి 11-12- 1987 వరకు ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’లో ధారావాహికగా ప్రచురించబడి సంచలనాలను నమోదు చేసింది. ఐతే వ్యాపార, సాహిత్య కళా రంగాల్లో ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తికి చుట్టూ శత్రువులు మిత్రుల రూపంలోనే ఉంటూ హాని తలపెట్టేందుకు సర్వదా చేతుల్లో కత్తులతో సిద్ధంగా ఉంటారు. ఈ రకంగానే ‘కామోత్సవ్‌’ నవల ప్రచురించబడుతున్న కాలంలో కొందరు వ్యక్తులు ఈ నవల తన అశ్లీలతతో సభ్య సమాజానికి హాని కలిగిస్తోందని నరసరావుపేట మున్సిఫ్‌ కోర్ట్‌, అక్కడ ఓడిపోయి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌, అక్కడా ఓటమిపాలై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించి అక్కడ అప్పీల్‌ తిరస్క రణతో నిష్క్రమించారు. ఒక సాహిత్య కృతిపై ఇంత రభస జరగడం బహుశా తెలుగు నవలా చరిత్రలో ఒక చిత్రమైన విషయమే. ఇప్పటికి 33 ఏండ్ల క్రితం వెలువడ్డ ఈ ‘కామోత్సవ్‌’ నవలపై ఇంత దుమారం రేగిన తర్వాత శేషేంద్ర ఈ నవలపై వచ్చిన ఊకదంపుడు ఉదంతంపై ఒక సాధికారిక వివరణను ఇచ్చాడు స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో. అది ఈ విధంగా ఉంది: 


ప్రశ్న: ‘కామోత్సవ్‌’ రాయడంలో మీ ప్రథమ ఉద్దేశం ఏమిటి?

జవాబు: అన్ని నీతులూ, అన్ని చట్టాలూ సాధారణ ప్రజలకే గాని ఉన్నత వర్గాలకి వర్తించవు. ఉన్నత వర్గాల్లో ఉన్న అస్తవ్యస్త సంబంధాలు, సాంఘిక నైతిక పతనం, ఏ బాధ్యతా లేకపోవడం, ఐనప్పటికీ ఆ వర్గాలే దేశానికి పాలకవర్గంగా ఉండడం, కొనసాగుతూండడం.. దీన్ని చిత్రించడం నా ప్రధాన ఉద్దేశం. తత్సంబంధంగా వచ్చిన అనేక విషయాలు అందులో చర్చించబడ్డాయి. మన ఋషీశ్వరులు (కోర్టును ఆశ్రయించిన వారిని ఉద్దేశించి) ఘోషిస్తున్నట్టుగా ప్రమాదకర విషయాలు అందులో ఏమీలేవు. (‘నక్సలిజం వైపే నా ప్రయాణం’ ఇంటర్వ్యూ, కృష్ణా పత్రిక, 26-08-1991). 


భారత స్వాతంత్య్రం ఏర్పడే నాటికి ఈ దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం సంస్థానాల సంఖ్య 565. ఆ సంస్థానాదీశుల అరాచక ప్రవర్తన, దోపిడి, ప్రజాకంఠక పాలన గురించి తెలుసుకోడానికి దివాన్‌ జర్మనీదాస్‌ రాసిన ‘మహారాజా’, ‘మహారాణి’ గ్రంథాలను చదవాలె జిజ్ఞాసువులు. 


2004లో ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక గౌరవమైన ‘నోబెల్‌’ కోసం తెలుగు నేలపైనుంచి నామినేట్‌ చేయబడ్డ ఏకైక కవి, పండితుడు, విమర్శకుడు శేషేంద్ర శర్మ. ఆయన ‘నా దేశం - నా ప్రజలు’ గ్రంథం దీనికోసం ఎంపిక చేయబడింది. 1970 నుండి 1986 వరకు ప్రచురించబడ్డ శేషేంద్ర కవితా సంపు టాలు ‘నా దేశం-నా ప్రజలు’, ‘మండే సూర్యుడు’, ‘గొర్రిల్లా’, ‘అరుస్తున్న ఆద్మీ’, ‘సముద్రం నా పేరు’, ‘నీరై పారిపోయింది’, ‘శేషజ్యోత్స్న’ అన్నింటినీ ఒకే మహాకావ్యంగా సంపుటీకరించిన ‘ఆధునిక మహాభారతం’ గ్రంథం మొట్టమొదట 1985లో వెలుగు చూచింది. మొత్తం పది పర్వాలుగా, ముప్పది ఎనిమిది సర్గలుగా రూపు దిద్దుకుని తెలుగు ప్రజల సాహిత్య సంపదగా మిగిలిపోయింది. 


ఎప్పుడైనా కాలానుగతంగా లోకధర్మం పుడుతుంది. ఆ లోకఽ దర్మాన్ని దర్శింపజేసే పురాణ ఇతిహాస కావ్య శాస్త్రాదులూ పుడ్తాయి. వ్యాసమహాభారతం ప్రాచీన భరతఖండ వాసులకోసం, ఈ పుణ్యభూమి ధర్మబద్ధ వికాస ఉజ్జ్వలతకోసం ప్రసాదించ బడింది. ఇప్పటి ఈ ఆధునిక మహాభారతం వర్తమాన ప్రజల కోసం ఉద్భవించింది. శేషేంద్ర మాటల్లో ‘‘ఈ ఆధునిక మహా భారతాన్ని వింటే, గులాం మనస్తత్వం కారణంగా వంగిపోయిన మోకాళ్ళలో బలం వచ్చి, మనిషి కాళ్ళు నిటారుగా నిలుస్తాయి. దాని పైన, వంగి వంగి సలాములు చేసీ చేసీ వంకర టింకర్లు ఐపోయిన వెన్నెముక ఇనుప చువ్వలా నిల్చుంటుంది. సిగ్గు విడిచి తల వంచీ వంచీ మెలిగే అలవాటు చేత సదా వేలాడే తల ఒక్కసారి భుజాల మీద లేచి నిర్భయంగా నిలబడ్తుంది. మనిషి మనిషిగా మారిపోతాడు. భూగోళానికి ఇరుసు ఔతాడు.’’


ఇదీ శేషేంద్ర స్వప్నించిన, లక్ష్యించిన రైతులూ, శ్రామికులూ పాలించగల ఆదర్శ సమాజం. ఇది సాకారమౌతుందా? 

రామా చంద్రమౌళి

(అక్టోబర్‌ 20 గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి)