అన్నం పెట్టి... ఉపాధి చూపి

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

కొవిడ్‌తో తలకిందులైన జీవితాలు... ఉపాధి కోల్పోయి పూట గడవని కుటుంబాలు ఎన్నో! ఈ

అన్నం పెట్టి... ఉపాధి చూపి

కొవిడ్‌తో తలకిందులైన జీవితాలు... ఉపాధి కోల్పోయి పూట గడవని కుటుంబాలు ఎన్నో! ఈ ఆపత్కాలంలో అలాంటి వారెందరికో అండగా నిలుస్తున్నారు ముంబయికి చెందిన హీనా మాండవియా. రోజూ వందలమందికి కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు... పని కూడా కల్పించి ఆర్థికంగా ఆదుకొంటున్నారు. తన కొడుకు హర్ష్‌తో కలిసి దీన్ని ఒక ఉద్యమంలా నడిపిస్తున్న హీనా సేవా సంకల్పం ఇది. 


‘‘మా తాతయ్య ఎప్పుడూ అనేవారు... ‘మనది చాచే చెయ్యి కాకూడదు... ఇచ్చే చెయ్యి కావాలని’! ఆ మాటలే మా అబ్బాయి హర్ష్‌కు చెబుతుంటాను. లాక్‌డౌన్లు పెంచుకొంటూ పోవడంవల్ల దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఒక నిశ్శబ్ద అలజడి మొదలైంది. ఉద్యోగాలు పోయి, జీతాల్లో కోతలు పడి, ఈఎంఐలు, పిల్లల స్కూల్‌ ఫీజులు, అద్దెలు కట్టలేక అల్లాడుతున్నారు. ఆకాశమంత ఎత్తున లేచిన ముంబయి మహానగరంలోని అపార్ట్‌మెంటుల్లో కనీసం రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు సమకూరక అవస్థలు పడుతున్న కుటుంబాలు ఎన్నో! ఎవరికీ చెప్పుకోలేక ఆ కుటుంబాలు పడుతున్న బాధ చూసినప్పుడు నాకు నిద్ర పట్టలేదు. దీర్ఘకాలిక ప్రణాలికలేవీ అక్కర్లేదు. వారికి కావల్సింది తక్షణ ఉపశమనం. దాని కోసం నేనేమి చేయగలను అని ఆలోచించాను. 



సాయం ఏ రూపంలో..! 

నేను, మా అబ్బాయి కలిసి కొన్నేళ్లుగా సొంత రెస్టారెంట్‌ ‘హర్ష్‌ థాలీ అండ్‌ పరాఠాస్‌’ (హెచ్‌టీపీ) నడిపిస్తున్నాం. చుట్టూ ఉన్నవారికి సాయం చేయాలనుకుంటున్న విషయాన్ని హర్ష్‌కు చెప్పగానే ఎంతో సంతోషపడ్డాడు. మరి సాయం ఎలా చేయాలి? ఏదో తోచిన డబ్బు ఇస్తామన్నా, అన్నం పెడతామన్నా వాళ్లు ఒప్పుకోరు. ఆత్మాభిమానం అడ్డొస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే... ఇంతలో మా కస్టమర్‌ ఒకాయన పేదలకు ఉచితంగా భోజనం పెట్టాలనుకున్నట్టు చెప్పారు. వండి వార్చే బాధ్యత మమ్మల్ని తీసుకోమన్నారు. ఇందులో మధ్యతరగతి మహిళలను భాగస్వాములను చేస్తే ఎలా ఉంటుంది? ఉచితంగా ఇచ్చే కంటే ఉపాధి మార్గం చూపితే ఎవరూ కాదనరు కదా! ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టాను. 


నెలకు రూ.15 వేలు...  

మా రెస్టారెంట్‌లో నేను చపాతీలు చేస్తాను. మిగిలినవి చెఫ్‌లు చూసుకొంటారు. ఎలాగూ మా రోజువారీ ఆర్డర్లు మాకు ఉంటాయి. కనుక ఇళ్లలో ఉండే మహిళలకు ఈ కాంట్రాక్ట్‌ ఇస్తే, దాని ద్వారా వారికి కొంత డబ్బు సమకూరుతుంది. ఇల్లు గడుస్తుంది. ఈ విషయం చెప్పి, నేను అడగ్గానే చాలా కుటుంబాల్లోని మహిళలు సంతోషంగా ఒప్పుకున్నారు. నా ఈ ప్రయత్నం వల్ల ప్రస్తుతం ప్రతి కుటుంబం రోజుకు 100 చపాతీలు, వారాంతాల్లో మరో 50 పూరీలు చేస్తున్నారు. తద్వారా నెలకు సగటున రూ.15 వేలు సంపాదిస్తున్నారు. ఇందులో మాకు ఒక్క రూపాయి కూడా మిగలక్కర్లేదు. కానీ ఈ కష్ట కాలంలో సమాజానికి కొంతైనా తిరిగి ఇచ్చామన్న సంతృప్తి మిగులుతోంది. అంతకంటే ఏంకావాలి! 



వేల భోజనాలు... 

మేం వండినదంతా అనాథలు, వలస కూలీలు, వీధి బాలలు, చెత్త సేకరించేవారు, రిక్షావాలాలు, ఇళ్లల్లో పనివారికి పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు పాతిక వేలకు పైగా భోజనాలు, దాదాపు లక్ష చపాతీలు, స్వీట్స్‌ అందించాం. ఆరోగ్యం కూడా ముఖ్యం కనుక ఇమ్యూనిటీ బూస్టర్‌ స్వీట్స్‌ కూడా పంచుతున్నాం. సగటున రోజుకు రెండొందల కుటుంబాల కడుపు నింపే మహత్తర కార్యక్రమం ఇది. 


ఆ కష్టం నాకు తెలుసు...  

పెళ్లయిన కొన్నేళ్లకే నా భర్త చనిపోయారు. ఒంటరి తల్లిగా పిల్లలను పెంచడం, కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంత కష్టమో నాకు తెలుసు. పిల్లాడి చదువు కోసం నేను సంపాదించేది ఏ మూలకూ సరిపోయేది కాదు. ఆ సమయంలో ఎంతో మంది దాతల సాయంతో మా అబ్బాయి చదువు పూర్తి చేశాడు. వాళ్లే లేకపోతే ఇవాళ నేను, మా వాడు ఎక్కడ ఉండేవారమో తలుచుకొంటేనే భయంగా ఉంటుంది. ఉన్నట్టుండి సంపాదన ఆగిపోతే ఒక కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో నాకు అనుభవం. కనుకనే ఇతరుల కోసం నాకు తోచింది చేస్తున్నాను. 


మోముల్లో చిరునవ్వు... 

ప్రీప్రైమరీ స్కూల్లో టీచర్‌... సినీ పరిశ్రమలో వర్కర్లు... ఆఫీసులో అడ్మిన్లు... ఇలా రకరకాల వృత్తులవారు. కరోనా సమయంలో సంపాదన లేక కష్టాలుపడుతున్నారు. వారంతా ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని వంట చేస్తున్నారు. భార్య, భర్త, పెద్దలు, పిల్లలు... తలా ఒక చేయి వేస్తున్నారు. ఏడాదిగా వీరందరికీ పని కల్పించగలుగుతున్నానంటే చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ల మోముల్లో తిరిగి వచ్చిన చిరునవ్వు చూస్తుంటే మాటలకందని అనుభూతి. మా ఈ చిరు ప్రయత్నాన్ని అభినందించి స్పందించిన దాతలు ఎందరో! వారందరి నుంచి ఇప్పటికి  21 లక్షల రూపాయల నిధులు సమకూరాయి. కరోనా తరువాత కూడా దీన్ని ఒక ఉద్యమంలా నిరంతరం నడిపించాలనుకొంటున్నాం. అదే జరిగితే అనేకమంది అభాగ్యుల కడుపు నిండుతుంది కదా! 


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST