ఏపీ డెయిరీ ఆస్తులు అమూల్‌కు ఎలా బదిలీ చేస్తారు?

ABN , First Publish Date - 2021-05-15T09:50:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీఎఫ్‌) ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్‌ సంస్థకు బదిలీ చేస్తూ ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని..

ఏపీ డెయిరీ ఆస్తులు అమూల్‌కు ఎలా బదిలీ చేస్తారు?

రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని రద్దుచేయండి

తక్కువ లీజుకివ్వడం అధికార దుర్వినియోగమే

రాష్ట్ర వనరులను వాణిజ్య సంస్థకు ఇస్తారా?

ఎలాంటి టెండర్లు లేకుండా.. 500 కోట్ల ఆస్తులను కట్టబెడతారా?

దీనివెనుక అదృశ్య శక్తి ఉంది

హైకోర్టులో రఘురామరాజు పిల్‌ 

లీజు, రెంట్‌ ఖరారు కమిటీ జీవో చెల్లదు

దాని సిఫారసులు కూడా చెల్లుబాటు కావు

అమూల్‌తో ఒప్పందాన్ని ఆమోదించే జీవో 25ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలి

పిటిషన్‌లో అభ్యర్థన.. ఎల్లుండి విచారణ 


అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీఎఫ్‌) ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్‌ సంస్థకు బదిలీ చేస్తూ ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్‌ చేశారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దుచేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలుచేశారు. కేబినెట్‌ నిర్ణయం మేరకు ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు బదలాయించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అమూల్‌ వాణిజ్య అవసరాల కోసం రాష్ట్ర నిధులు, ఉద్యోగులను వినియోగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని అభ్యర్ధించారు. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌, ఏపీడీడీఎఫ్‌ ఎండీ, నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు ఛైర్మన్‌, గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(అమూల్‌)ఎండీ, ప్రకాశం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎండీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ డెయిరీ ఆస్తులకు సంబంధించి లీజు, రెంట్‌ ఖరారు కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 5, కమిటీ చేసిన సిఫారసులు చెల్లుబాటు కావని ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు. ‘ప్రకాశం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు రూ.69 కోట్లు మంజూరు చేస్తూ పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన జీవో 68ని కంపెనీ చట్టనిబంధనలకు విరుద్దమైనదిగా ప్రకటించాలి. రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ, అమూల్‌ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని ఆమోదిస్తూ గత ఏడాది జులై 21న ప్రభుత్వం జారీ చేసిన జీవో 25ను కూడా చట్టవిరుద్ధంగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఉద్యోగులను అమూల్‌ వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డెయిరీ ప్రత్యేక సీఎస్‌, ఏపీడీడీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించాలి’ అని అభ్యర్థించారు.




వ్యాజ్యంలో ఏముందంటే..

‘అమూల్‌కు అనుచిత లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను బదిలీ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం చట్ట వ్యతిరేకం. ప్రభుత్వం గోప్యతతో ఆస్తులను తక్కువ లీజు మొత్తానికి  తను ఎంచుకున్న ఏజెన్సీకి బదిలీ చేయడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ పరిశ్రమ నాశనానికి దారి తీస్తుంది. రాష్ట్ర వనరులను వాణిజ్య సంస్థకు అప్పగించడం చట్టవిరుద్ధం. వాణిజ్య సంబంధ విషయాల్లో ఎలాంటి టెండర్లు లేకుండా, పారదర్శకత పాటించకుండా, ఆస్తుల సంరక్షణకు ఎలాంటి షరతులు లేకుండా రూ.500 కోట్ల విలువ చేసే ఆస్తులను ముందస్తుగా ఎంపిక చేసుకున్న ఏజెన్సీకి బదిలీ చేయడం లబ్ధి చేకూర్చడమే. ఆస్తులు లీజుకు ఇవ్వడం ద్వారా ఏడాదికి కేవలం రూ.3.38 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం  ఆస్తులను లీజుకు ఇవ్వదలిస్తే  దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి చట్టబద్దంగా ఏర్పడిన నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డుకు అప్పగించాల్సింది. అది పార్లమెంట్‌కు జవాబుదారీతనంగా ఉంటుంది. ఎన్‌డీడీబీ గ్రాంట్లు, రుణాలతో ఏపీ డెయిరీ ఆస్తుల సృష్టి  జరిగింది. ఆ రుణాలకు రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఇంకా కొంత రుణం చెల్లించాల్సి ఉంది. లీజ్‌ రెంట్‌ కింద వచ్చే సొమ్ముతో  రుణాలు తీర్చడం సాధ్యం కాదు. ఎన్‌డీడీబీ సమ్మతి లేకుండా ఆస్తులను బదిలీ చేయడం చట్టవిరుద్ధం. అలాంటి సంస్థను విస్మరించి వాణిజ్య వ్యవహారాల్లో నిమిగ్నమైన అమూల్‌ను ఎంచుకోవడం సరికాదు. ఎన్‌డీడీబీ ఇప్పటికే బాలాజీ డెయిరీ పేరుతో తిరుపతిలో డెయిరీ ఏర్పాటు చేసింది. సహకార విధానంలో పాడి పరిశ్రమ అభివృదిక్ధి  ఎన్‌డీడీబీ బాధ్యత కలిగి ఉంది. జాతీయవాదం, సామర్థ్యం కలిగి ఉన్న అలాంటి సంస్ధను పక్కనపెట్టి అమూల్‌ను ఎంచుకోవడం వల్ల వచ్చే ఫలాలను అమూల్‌ కంపెనీ వాటాదారులు అనుభవిస్తారు. సహకార సంస్థను నిర్వహించడానికి అమూల్‌ను అనుమతించడమంటే సమాంతర సహకార వ్యవస్థను ప్రోత్సహించడమే. దీనివల్ల రాజకీయ విభేధాలతో ఉన్న  గ్రామ వాతావరణం మరింత కలుషితమవుతుంది. అమూల్‌తో అవగాహన ఒ్పందం కుదుర్చుకున్న 2020 జూలై 21నే దానిని ఏపీడీడీసీఎఫ్‌ ఎండీకి ప్రత్యేక సీఎస్‌ పంపారు. దానిని వెంటనే అంగీకరించి అదే రోజు జీవో  జారీ చేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక అద్యృ శక్తి ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో జీవో 25ను రద్దు చేయండి. లీజు విధానం, షరతులు, ఎంత కాలం లీజు అనే విషయాన్ని ప్రతిపాదిత  లీజు విధి విధానాల్లో పేర్కొనలేదు. అమూల్‌ను ఏపీలోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్న తరువాత ప్రకాశం మిల్క్‌ ప్రోడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు భారీగా రుణం జారీ చేసేందుకు జీవో ఇవ్వడం ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. గుజరాత్‌ కోఆపరేటివ్‌ సొసైటీ కింద చట్టం ప్రకారం అమూల్‌ రిజిస్టర్‌ అయ్యింది. ఏపీలో సొసైటీలుగా నమోదైన వాటితో అనుబంధంగా వ్యవహరించే అధికారం దానికి లేదు. వ్యక్తిగత సంఘాలతో మాత్రమే మార్కెటింగ్‌  ఏర్పాట్లు చేసుకోగలదు. అమూల్‌ కార్యకలాపాలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ నేపఽథ్యంలో రాష్ట్రంలోని సహకార సంఘాలపై అమూల్‌కు అధికారం కల్పించడం చట్ట విరుద్ధం. ఈ ప్రక్రియ మొత్తం రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చేపట్టినదే. రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థికంగా బలవంతమైన పోటీదారును తీసుకురావడం వల్ల స్థానిక పరిశ్రమ వినాశనానికి దారితీస్తుంది. ప్రభుత్వం అమూల్‌ సంస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా  వేరే వారికి పాలు సరఫరా చేస్తే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని ఉత్పత్తిదారులను బెదిరించే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం చేపట్టింది కాదు. కేవలం అమూల్‌కు  అనుచిత లబ్ది చేకూర్చేందుకే  ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని రద్దు చేయండి’ అని కోరారు.

Updated Date - 2021-05-15T09:50:48+05:30 IST