జగన్‌ బెయిల్‌ రద్దు కోరాననే..నాపై కక్షగట్టారు!

ABN , First Publish Date - 2021-06-03T09:08:26+05:30 IST

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు

జగన్‌ బెయిల్‌ రద్దు కోరాననే..నాపై కక్షగట్టారు!

రాజద్రోహం కేసు పెట్టారు

సీఐడీ కస్టడీలో నాపై దాడి

తీవ్రంగా గాయపరిచారు

గుంటూరు వైద్యులు అసత్య నివేదిక ఇచ్చారు

గాయాలున్నట్లు ఆర్మీ ఆస్పత్రి వివరణాత్మక రిపోర్టు ఇచ్చింది

దాంతో సుప్రీంకోర్టు బెయిలిచ్చింది

సీఎం జగన్‌, డీజీపీ, సీఐడీ ఏడీజీ, ఏఎ్‌సపీలపై చర్యలు తీసుకోండి

లోక్‌సభ స్పీకర్‌కు రఘురామ వినతి

విచారించి న్యాయం చేస్తాం: ఓం బిర్లా


న్యూఢిల్లీ, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆయన బుధవారం రాత్రి ఇక్కడ 9.20 గంటలకు స్పీకర్‌ను కలిశారు. దాదాపు అర్ధ గంట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. తన కేసులో సీఎం జగన్‌రెడ్డి, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, ఏఎ్‌సపీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘నాపై ఐపీసీ 124-ఏ రాజద్రోహం కేసు పెట్టి.. చిత్రహింసలు పెట్టి.. తీవ్రంగా గాయపరిచారు. సీఐడీ పోలీసుల కస్టడీలో ఐదుగురు ముసుగు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. పార్లమెంటు సభ్యుడిగా నా హక్కులకు భంగం కలిగించారు. మీకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోండి’ అని అభ్యర్థించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం తన గాయాలపై అసత్యాలతో నివేదిక సమర్పించిందని.. సీఐడీ పోలీసులు సీఐడీ కోర్టు, హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని, వారికి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ అయ్యాయని తెలిపారు.


తాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తనకు గాయాలున్నట్లు ధ్రువీకరించి నివేదికను సమర్పించడంతో తనకు బెయిల్‌ మంజూరు చేసిందని స్పీకర్‌కు రఘురామ వివరించారు. ప్రస్తుతం తాను ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిపారు. రఘురామరాజు రెండు కాళ్లూ కట్లతో కనిపించడంతో ఓంబిర్లా చలించినట్లు తెలిసింది. ఎంపీ చెప్పినవన్నీ సావధానంగా విని.. వాటిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుని తగు న్యాయం చేస్తామని, ధైర్యంగా ఉండాలని స్పీకర్‌ భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తొలి రోజు తన కేసుపై మాట్లాడే అవకాశం కల్పించాలని రఘురామ కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-06-03T09:08:26+05:30 IST