ఇంత అమానుషమా?

ABN , First Publish Date - 2021-06-16T08:42:26+05:30 IST

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, మురళీధరన్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఒక ఎంపీపైనే రాజద్రోహం కేసు పెట్టి, దాని ముసుగులో ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్‌ డిగ్రీని

ఇంత అమానుషమా?

ఎంపీపైనే రాజద్రోహ నేరమా?

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి... కస్టడీలో తీవ్రంగా హింసిస్తారా?

వీటి కట్టడికి కఠినంగా వ్యవహరించాలి

ప్రహ్లాద్‌ జోషి, మురళీధరన్‌ స్పందన!

కేంద్ర మంత్రులతో రఘురామరాజు భేటీ


న్యూఢిల్లీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, మురళీధరన్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఒక ఎంపీపైనే రాజద్రోహం కేసు పెట్టి, దాని ముసుగులో ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్‌ డిగ్రీని ప్రయోగించి తీవ్రంగా గాయపరుస్తారా? ఇలాంటి అమానుష, చట్టవ్యతిరేక చర్యలను కట్టడి చేయడానికి కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్‌లో ఎంపీలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు‘ అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖను చూసే ఈ మంత్రులిద్దరూ రఘురామరాజు ముందు వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వీరిద్దరినీ మంగళవారమిక్కడ విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అండ చూసుకుని.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఐడీ పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి, కస్టడీలోనే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి, తీవ్రంగా గాయపరిచిన ఘటనపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో కేసు దాఖలు చేశానన్న కక్షతోనే చిత్రహింసలు పెట్టారని.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై తరచూ మీడియా ద్వారా ఎత్తిచూపినందుకు సీఎం కక్షగట్టారని తెలిపారు. రఘురామ కాళ్లకు గాయాలను చూసి మంత్రులు చలించిపోయినట్లు తెలిసింది. 


రఘురామకు తమ సానుభూతి ప్రకటిస్తూ.. పార్లమెటు సమావేశాల్లో కచ్చితంగా ఈ ఘటనపై చర్చకు సహకరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఒక పార్లమెంటు సభ్యుడి పట్ల అమానుషంగా వ్యవహరించి.. థర్డ్‌ డిగ్రీని ప్రయోగించి, తీవ్రంగా గాయపరచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారని సమాచారం. వైసీపీ అధికారిక వెబ్‌సైట్లోని ఎంపీల జాబితాలో తన పేరు తొలగించార ని, 48 గంటల్లోగా తిరిగి చేర్చకుంటే తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాల్సిందిగా స్పీకర్‌ను కోరతానని జగన్‌రెడ్డికి లేఖ రాసినప్పటికీ స్పందించలేదన్నారు. తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు, నేతలు పలుమార్లు ఫిర్యాదు చేశారని, తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మంత్రులకు వివరించినట్లు తెలిసింది. తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించేందుకు సహకరించాలని కూడా రఘురామరాజు వారిని కోరారు.

Updated Date - 2021-06-16T08:42:26+05:30 IST