20 బంతులు చెత్తగా ఆడినా.. నమ్మకం కోల్పోలేదు: రాహుల్ తెవాటియా

ABN , First Publish Date - 2020-09-28T23:21:04+05:30 IST

రాహుల్ తెవాటియా.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిన తెవాటియా

20 బంతులు చెత్తగా ఆడినా.. నమ్మకం కోల్పోలేదు: రాహుల్ తెవాటియా

షార్జా: రాహుల్ తెవాటియా.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిన తెవాటియా విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ బౌలింగులో 5 సిక్సర్లు బాదాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెవాటియా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 20 బంతులను చెత్తగా ఆడినప్పటికీ తనపై తాను విశ్వాసం కోల్పోలేదన్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకునేందుకు తెవాటియా బాగా కష్టపడ్డాడు. ఆ తర్వాత మాత్రం చెలరేగిపోయాడు. 


‘‘నేను బంతిని దూరంగా కొట్టగలనని డగౌట్‌కు తెలుసు. నన్ను నేను నమ్మాల్సి ఉందన్న విషయం కూడా తెలుసు. కాకపోతే ఒకే ఒక్క సిక్సర్‌కు సంబంధించిన విషయం ఇది’’ అని 27 ఏళ్ల తెవాటియా పేర్కొన్నాడు. ఒక్క ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం అద్భుతమని, తొలుత తాను లెగ్ స్పిన్నర్ల బౌలింగులో కొట్టాలని భావించానని, అయితే, దురదృష్టవశాత్తు ఆ పని చేయలేకపోయానని, కాబట్టి ఇతరుల బౌలింగ్‌లో బాదాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. 


స్మిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెవాటియా తొలుత బంతిని ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. జట్టు పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో బంతులు వృథా చేయడంతో సంజు శాంసన్‌పై ఒత్తిడి పెరిగింది. దీని గురించి తెవాటియా మాట్లాడుతూ.. 20 బంతులను చెత్తగా ఆడిన తర్వాత హిట్టింగ్ ప్రారంభించినట్టు చెప్పాడు. ఈ ఆటను తాను ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్‌లో రెండు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. ఈ నెల 30న దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. 

Updated Date - 2020-09-28T23:21:04+05:30 IST