మండు వేసవిలో వాన

ABN , First Publish Date - 2021-04-14T05:34:06+05:30 IST

ఎండలు మండుతున్న వేళ.. మంగళవారం సాయంత్రం అశ్వారావుపేట, పినపాక, భద్రాచలంలో నియోజకవర్గాల్లో పలు చోట్ల పడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారింది.

మండు వేసవిలో వాన
కరకగూడెంలో పట్టాలపై నిలిచిన వాననీరు

భద్రాచలం, దుమ్ముగూడెం, కరకగూడెంలో గాలిదుమారం, వర్షం 

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం 

కల్లాల్లో తడిచిన ధాన్యం

భద్రాచలం/ దుమ్ముగూడెం/ కరకగూడెం ఏప్రిల్‌ 12: ఎండలు మండుతున్న వేళ.. మంగళవారం సాయంత్రం అశ్వారావుపేట, పినపాక, భద్రాచలంలో నియోజకవర్గాల్లో పలు చోట్ల పడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి ఉరుములు, ఈదురు గాలులతో వర్షం పడింది. సోమవారం రాత్రి అశ్వారావుపేట, అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, రామన్నగూడెం, వినాయకపురం, పేరాయిగూడెం, నారంవారిగూడెం తదితర గ్రామాల్లో ఈదురు గాలుల తీవ్రతకు మామిడికి కొంతమేర నష్టం జరిగినట్టు అంచ నా. ఇక అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని దమ్మపేట, మందలపల్లితో పాటు పలు గ్రామాలలో కూడా ఈదరుగాలులతో కూడిన వర్షం పడటంతో మామిడి స్వల్పంగా నేలరాలింది. 

భద్రాచలంలో గాలిదుమారం

భద్రాచలంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ప్రధాన రహదారులన్ని జలమయం అయ్యాయి. ఉదయం నుంచి మండుటెండతో ఉక్కపోతకు గురైన భద్రాద్రి వాసులకు ఒక్కసారిగా ఊరట లభించింది. కాగా గాలిదు మారం, వర్షం నేపథ్యంలో భద్రాచలంలో నాలుగు గంటలకు పైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇదిలా ఉండగా భద్రాద్రి రామాలయం పడమరమెట్లవైపు వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. 

అన్నదాతల్లో ఆందోళన

రైతులు ఆరుగాళం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో పలు రోజులుగా వాతావరణంలో మార్పులు, గాలి దుమారాలు, అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులువరి సాగుచేశారు. ధాన్యం పంట చేతికొచ్చిన రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోశారు. కాగా కొద్ది రోజుల నుంచి వాతావరణంలో మార్పులు ఏర్పడుతుండటంతో సాయంత్రం అయితే చాలు రైతుల గుండెల్లో ఆందోళన మొదలవుతోంది. సాయంత్రం సమయంలో గాలి దు మారంతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. అకాల వర్షంతో కోతకు వచ్చిన వరి ధాన్యం గింజలు రాలుతున్నాయని రైతులు అంటున్నారు. సోమవారం కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన రైతుల ధాన్యం తడిసింది. ఒక వైపు వరిపై తెగుళ్లు ముప్పేట దాడి చేయడంతో  ఎదుగుదల అంతంతమాత్రంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు కూడా రా వని ఆందోళన చెందుతున్న రైతులకు వాతావరణంలో మార్పులు అశనిపాతంగా మారాయి.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి కొ న్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్ప డింది. గాలిదుమారంతోపాటు, అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. ఆకాశం కారుమబ్బులు కమ్మడంతో మిర్చి, వరి రైతులు ఆందోళన చెందారు. కల్లాల్లోని మిర్చిపై బరకాలు కప్పి సంరక్షించారు. కాగా వర్షం వస్తే విత్తనాలు నేలరా లతాయని వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందు తున్నారు. 

Updated Date - 2021-04-14T05:34:06+05:30 IST