వర్షపాతం.. 34% అధికం

ABN , First Publish Date - 2021-08-01T08:48:19+05:30 IST

నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సగంకాలం ముగిసింది. రాష్ట్రంలో జూన్‌, జూలై ల్లో సాధారణం కంటే 34% అధికంగా వర్షపాతం నమోదైంది

వర్షపాతం.. 34% అధికం

రాష్ట్రంలో 34% అధిక వర్షాలు

గత రెండు నెలలు వానల జోరు

సీమలో 82 శాతం అధికం.. ఉత్తరాంధ్రలో లోటు

సాగులోకి 35లక్షల ఎకరాలు


అమరావతి, విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సగంకాలం ముగిసింది. రాష్ట్రంలో జూన్‌, జూలై ల్లో సాధారణం కంటే 34% అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణంగా 222 మి.మీ.లు కురవాల్సి ఉండగా 298మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమలో 163.5మి.మీ.కు గాను, 297 మి.మీ.(82ు ఎక్కువ) వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో 107శాతం, కడప జిల్లాలో 102శాతం ఎక్కువ నమోదైంది. ఇక కోస్తాంధ్రలో 263.1 మిల్లీమీటర్లకుగాను 298.8. మి.మీ.(14 శాతం ఎక్కువ) వర్షాలు కురిశాయి. అయితే, ఉత్తరకోస్తాలోని మూడు జిల్లాల్లో సాధారణం కంటే కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది.  శ్రీకాకుళంలో సాధారణం కంటే 6ు, విజయనగరంలో 11ు, విశాఖలో 13ు తక్కువ వాన పడింది. కోస్తాలోని మిగిలిన ఆరు జిల్లాల్లో సంతృప్తికరంగా వర్షాలు కురిశాయి. కాగా, నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో గడచిన వారం నుంచి రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జూలైలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడినా రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికితోడు పడమర గాలులు వీస్తుండడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 35లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు సాగులోకి వచ్చాయి.


దేశంలో 449.1 మి.మీ. వర్షం..

జూలై తొలి మూడువారాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. దీంతో కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తింది. శనివారం వరకు దేశంలో సాధారణంగా 452.2మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 449.1మి.మీ.(1శాతం లోటు)నమోదైంది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప మిగిలిన దక్షిణ, మధ్య, వాయవ్య భారతంలో అధిక వర్షపాతం నమోదైంది. 


రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు 

పడమర గాలుల కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణకేంద్రం తెలిపింది. శనివారం అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణానికి 1 డిగ్రీ హెచ్చుతగ్గులతో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


జిల్లాల వారీగా వర్షపాతం (జూన్‌ 1 నుంచి జూలై 31 వరకు)

జిల్లా   కురవాల్సింది కురిసింది శాతం

శ్రీకాకుళం 340.2 319 -6

విజయనగరం 325.3 288.8 -11

విశాఖపట్నం 297.6 257.5 -13

తూర్పుగోదావరి 366.9 423.5 +26

పశ్చిమ గోదావరి 325.3 449 +24

కృష్ణా 314.0 456.6 +45

గుంటూరు 241.5 308.4 +28

ప్రకాశం 166.9 186.3 +12

నెల్లూరు 143.5 175.7 +22

అనంతపురం 121.9 252.2 +107

చిత్తూరు 173.9 335.5 +93

కడప 163.9 330.5 +102

కర్నూలు 199.5 283.2 +42


శ్రీశైలానికి 5.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కర్నూలు, జూలై 31(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తుతోంది. శనివారం డ్యాం వద్ద 5,29,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 883.50 అడుగుల వద్ద ఉంది. నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 207.4103 టీఎంసీల నిల్వ ఉంది. డ్యాం నుంచి మొత్తం 5,30,352 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-08-01T08:48:19+05:30 IST