షట్లర్‌ నుంచి అంపైర్‌గా..

ABN , First Publish Date - 2020-08-04T09:12:59+05:30 IST

కొమ్ము రాజేందర్‌ (47).. తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ లైన్‌ జడ్జిగా ఎంపికైన ప్రథముడు. రాజేందర్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా

షట్లర్‌ నుంచి అంపైర్‌గా..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

కొమ్ము రాజేందర్‌ (47).. తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ లైన్‌ జడ్జిగా ఎంపికైన ప్రథముడు. రాజేందర్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా నెక్కొండ. కుటుంబ బాధ్యతల కారణంగా షట్లర్‌గా కెరీర్‌ను మలుచుకోవడంలో విఫలమైన అతడు, ఆ తర్వాత ప్రభుత్వ పీఈటీగా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆటగాడిగా కెరీర్‌ అర్ధంతరంగా ముగిసిపోవడంతో అంపైర్‌గా బ్యాడ్మింటన్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు.

2007లో అంపైర్‌గా...

ఆటగాడిగా ఉన్నప్పటి నుంచే సాంకేతిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న రాజేందర్‌ అంపైర్‌గా మారాలని భావించాక దానిపై మరింత కసరత్తు చేయడం ప్రారంభించాడు. అలా 2007లో రాష్ట్ర స్థాయి అంపైరింగ్‌ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో శుభారంభం చేశాడు. మూడేళ్లు తిరిగేసరికి దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అంపైరింగ్‌ పరీక్షల్లో రెండో ర్యాంక్‌ సాధించి గ్రేడ్‌-1 అంపైర్‌గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాటా ఓపెన్‌ (2014, 16, 18), ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (2016, 17) అంపైర్‌గా విధులు నిర్వహించిన రాజేందర్‌.. థామ్‌స-ఉబెర్‌ కప్‌ (2014), ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (2015)లో లైన్‌ జడ్జిగా సమర్థవంతమైన పాత్ర పోషించాడు. ఇటీవల అతడి నైపుణ్యాన్ని గుర్తించిన బీడబ్ల్యూఎఫ్‌ అంతర్జాతీయ లైన్‌ జడ్జిగా రాజేందర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ అంపైర్‌ కావాలన్న లక్ష్యంతో రాజేందర్‌ ముందుకు సాగుతున్నాడు.

Updated Date - 2020-08-04T09:12:59+05:30 IST