Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామప్ప నంది రాజసమే వేరు...

కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా చెప్పుకునే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడంతో మరోసారి ఈ ఆలయ శిల్పంపై విశ్లేషణలు వెలువడుతున్నాయి. రామప్ప ఆలయంలో స్తంభాలు, పీఠములు, మండపం, గర్భాలయ ప్రవేశ ద్వారం, ద్వారా బంధనం, మకర తోరణాలు, అర్ధ మండపాలు, ప్రదక్షిణాపథం, మదనికలు, శాసనశిల్పం ఇలా ప్రతీ శిల్పంలోనూ ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే, వీటన్నింటికన్నా భిన్నమైనది రామప్ప నంది విగ్రహం. దేశంలోని పలు నిర్మాణశైలుల్లో నంది విగ్రహాలు ఎన్నో కన్పిస్తాయి. మైసూరు నంది, లేపాక్షి నంది, యాగంటి నంది, హొయసల నంది మొదలైనవి ఉన్నాయి.. కానీ వీటన్నింటిలో రామప్ప నంది శిల్పం ప్రత్యేకమైనది. ఆ మాటకొస్తే అన్ని కాకతీయ నంది విగ్రహాలు ఇతర నిర్మాణ శైలిలో నిర్మించిన నంది విగ్రహాల కన్నా అందంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. కాకతీయ నంది విగ్రహాలలో ఉన్న సున్నితమైన పనితనం కానీ, అలంకరణలు గానీ ఇతర చోట్ల నందులలో కన్పించవు. ప్రధానంగా హన్మకొండ వేయి స్తంభాల గుడిలోని నంది, రామప్ప లోని నంది విగ్రహాలను ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా చెక్కారు. వీటన్నింటిలో రామప్ప నందికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి.    

ఈ నంది విగ్రహాన్ని ఎదురుగా ఉండి చూసినా, మరే వైపు నుంచి చూసినా అది మననే చూస్తున్నట్టుగా అద్భుతంగా చెక్కారు. లే అనగానే, లేచి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుంటుంది అది. నంది మీద ఉన్న వివిధ ఆభరణాలను సైతం ఎంతో మనోహరంగా చెక్కారు. ఈ విగ్రహాన్ని బాసాల్ట్ అనే నల్లరాయితో నిర్మించారు. దీనిని ఇగ్నియన్ రాక్‌ అని కూడా అంటారు. అగ్నిపర్వతపు లావా ఘనీభవించినప్పుడు రూపొందినదే ఈ శిల. దీనిలో అనేక లోహసంబంధిత ధాతువులుంటాయి. ఎక్కువభాగం ఇనుము, గ్రానోడయారైట్ అనే మరొక రకం లోహం ఉంటాయి. ఈ శిలలో క్వార్ట్జ్, మైకా అనే పదార్థాలుండడం వల్ల పాలిష్‌తో దానికి వెలుగు పరావర్తనం చెందగల మెరుపు వస్తుంది. దీనికున్న కాఠిన్యం వల్ల అతిసూక్ష్మమైన నగిషీ డిజైన్లు చెక్కడం సాధ్యపడింది. 

కన్నెకంటి వెంకట రమణ


Advertisement
Advertisement