బుల్లితెరపై మళ్ళీ రామాయణ భారతాలు

ABN , First Publish Date - 2020-03-28T05:48:37+05:30 IST

‘మహా... భారత్‌! మహా... భారత్‌! అథ్‌ శ్రీ మహా భారత్‌ కథా... కథా హై పురుషార్థ్‌ కీ.. యే స్వార్థ్‌ కీ పరమార్థ్‌కీ... సారథీ జిస్‌ కే బనే శ్రీకృష్ణ్‌ భారత్‌ పార్థ్‌ కీ’ ఇలా సాగే...

బుల్లితెరపై మళ్ళీ రామాయణ భారతాలు

‘మహా... భారత్‌! మహా... భారత్‌! అథ్‌ శ్రీ మహా భారత్‌ కథా... కథా హై పురుషార్థ్‌ కీ.. యే స్వార్థ్‌ కీ పరమార్థ్‌కీ... సారథీ జిస్‌ కే బనే శ్రీకృష్ణ్‌ భారత్‌ పార్థ్‌ కీ’ఇలా సాగే... ఈ పాట, ఆ బాణీ విననివాళ్ళు కొన్నేళ్ళ క్రితం దేశమంతటా తక్కువ. ‘మై కాల్‌ హూ...’ అంటూ కాలచక్రం టీవీలో చెప్పే పౌరాణిక గాథ మహాభారతం చూడనివాళ్ళు మరీ తక్కువ. దూరదర్శన్‌ మాత్రమే ఉన్న పోర్టబుల్‌ టీవీల కాలం నాటి ఆదివారం వీక్లీ సీరియల్‌ బి.ఆర్‌. చోప్రా ‘మహాభారత్‌’ జ్ఞాపకం అది.


దానికి కొన్నేళ్ళ ముందు దర్శక, నిర్మాత రామానంద్‌ సాగర్‌ సండే సీరియల్‌ ‘రామాయణ్‌’ కూడా దేశమంతటినీ ఇళ్ళలో కట్టిపడేసింది. కొన్ని తరాలకు చిరకాల జ్ఞాపకాలు అవి. మరి మీ పిల్లల తరానికి అలాంటివి లేవే అని ఎప్పుడూ బాధపడుతుంటారా? అయితే... ఇప్పుడు మీ చింత తీరుతోంది. 

ఇంటిల్లిపాదీ ఇంట్లోనే ఉంటున్న ఈ ఇరవై ఒక్క రోజుల లాక్‌డౌన్‌ కాలంలో... ఇప్పుడు ఆ సీరియల్స్‌ మళ్ళీ దూరదర్శన్‌లో పలకరించనున్నాయి. ‘రామాయణ్‌’, ‘మహాభారత్‌’ లాంటి పౌరాణిక ధారావాహికలు మాత్రమే కాదు... చంద్రప్రకాశ్‌ ద్వివేదీ రూపొందించిన ‘చాణక్య’, ఇప్పటి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తన కెరీర్‌ మొదట్లో నటించిన ‘సర్కస్‌’, డిటెక్టివ్‌ షో ‘బ్యోమ్‌కేశ్‌ బక్షీ’ లాంటి 6 ఆణిముత్యాల లాంటి సీరియళ్ళను ఈ తరం కోసం మళ్ళీ బుల్లితెర మీదకు తెస్తోంది దూరదర్శన్‌.


రోజుకు రెండు భాగాలుగా రామాయణ్‌, మహాభారత్‌!

‘రామాయణ్‌’ ఇప్పటికి సరిగ్గా 33 ఏళ్ళ క్రితం వచ్చిన డెబ్భై అయిదు ఎపిసోడ్ల సండే వీక్లీ సీరియల్‌. 1987 జనవరి 25న మొదలై 1988 జూలై చివరి దాకా ఏణ్ణర్ధం పైగా ప్రసారమైన ఈ సీరియల్‌ వస్తోందంటే, అప్పట్లో దేశమంతటా ఆదివారం టీవీలకు అతుక్కుపోయేవారు. శ్రీరాముడిగా అరుణ్‌ గోవిల్‌, సీతాదేవిగా దీపిక చిఖలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లాహ్రి, హనుమంతుడిగా దారాసింగ్‌ నటించిన ఈ సూపర్‌ హిట్‌ సీరియల్‌ ‘‘ప్రపంచంలో అత్యధికులు చూసిన పౌరాణిక సీరియల్‌’’ అంటూ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకీ ఎక్కింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు రవికాంత్‌ నగాయిచ్‌ స్పెషల్‌ ఎఫెక్టులు అందించిన ఆ సీరియల్‌ ఆ రోజుల్లో 82శాతం వ్యూయర్‌ షిప్‌ను అందుకోవడమే కాక, ఆ రోజుల్లోనే ప్రతి ఎపిసోడ్‌కూ దాదాపు రూ.40 లక్షల మేర దూరదర్శన్‌కు వాణిజ్య ప్రకటనల ఆదాయం సమకూర్చింది. దూరదర్శన్‌ మాతృసంస్థ అయిన ప్రసార భారతి ఇటీవల ఆరేడు నెలలుగా పలువురి కోరికపై ఈ సీరియల్‌ పునః ప్రసార హక్కుల కోసం ప్రయత్నిస్తూ వచ్చింది. రామానంద్‌ సాగర్‌ సంస్థ వారు అప్పటి ఆ సీరియల్‌ భాగాల సాఫ్ట్‌వేర్‌ అంతటినీ కష్టపడి సేకరించి, దూరదర్శన్‌కు అందించడం విశేషం. ‘ప్రజల కోరిక మేరకు ఈ శనివారం (మార్చి 28) నుంచి ‘డి.డి - నేషనల్‌’ ఛానల్‌లో ‘రామాయణ్‌’ పునఃప్రసారం చేస్తున్నాం. ఉదయం 9  నుంచి 10 గంటల దాకా ఒక భాగం, రాత్రి 9 నుంచి 10 గంటల దాకా మరో భాగం వస్తాయిు అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ ప్రకటించారు. 


మరోసారి... ‘మహాభారత్‌’!

‘మహాభారత్‌’ సీరియల్‌ కూడా ఈ శనివారం  నుంచే పునః ప్రసారం కానుంది. (డిడి భారతిలో మధ్యాహ్నం 12.00కు, రాత్రి 7.00కు - రోజుకు రెండు భాగాలు).  1988 ప్రాంతంలో ప్రతి వారం ఉదయం గంట చొప్పున రెండేళ్ళు ఈ సీరియల్‌ విశేష ఆదరణతో ప్రసారమైంది. ఇప్పుడు ఆ ‘మహాభారత్‌’, అలాగే ‘చాణక్య’, చిన్మయా మిషన్‌ వారి ‘ఉపనిషద్‌ గంగ’లాంటివి ‘డి.డి. - భారతి’ ఛానల్‌లో ప్రసారం కానున్నాయి. కొద్ది కాలంగా ఈ టీవీ సీరియల్స్‌ పునః ప్రసార హక్కులను పొందేందుకు దూరదర్శన్‌ ప్రయత్నిస్తున్నా, ఇప్పుడీ కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాల రీత్యా తక్షణం రీ-టెలికాస్ట్‌ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. నిజానికి, ‘రామాయణ్‌’, ‘మహాభారత్‌’ సీరియల్స్‌ ఎంత పాపులర్‌ అంటే... తరువాతి కాలంలో పలు ప్రైవేట్‌ టీవీ ఛానల్స్‌ వాటిని పలుమార్లు పునఃప్రసారం చేశాయి. 


బాల్య జ్ఞాపకాలలోకి...

టీవీ ‘రామాయణ్‌’లోని ఆనాటి సీతారామ లక్ష్మణులు ఇటీవలే ‘ది కపిల్‌ శర్మ షో’లో బుల్లితెరపై చాలా దశాబ్దాల తరువాత కలిసి, కనిపించారు. ఆనాటి అందాల రాముడు అరుణ్‌ గోవిల్‌కు ఇప్పుడు ఏడుపదుల వయసు దాటింది. అప్పటి సీత పాత్రధారిణి దీపికకు ఇప్పుడు 54 ఏళ్ళు. తాజా షోలో వారు ఆనాటి సంగతుల్ని పంచు కున్నారు. ‘‘బయట ఎదురైనా సరే జనం నాకు చేతులు జోడించి నమస్కరించేవారు’’ అంటూ దీపిక ఆనందంగా గుర్తు చేసుకున్నారు. కాగా, ఆణిముత్యాల లాంటి ఆరు టీవీ సీరియళ్ళు ఇప్పుడిలా డి.డి. నేషనల్‌, డి.డి. భారతి ఛానల్స్‌లో మళ్ళీ ప్రసారం కానుండడం పట్ల వివిధ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ కరోనా వేళలో ఇంట్లోనే కూర్చొని, కుటుంబమంతా ఆనందించే సత్కథా కాలక్షేపం కానున్నాయి. అందరూ మరోసారి చిన్నప్పటి జ్ఞాపకాలలోకి వెళ్ళే అవకాశం అందిస్తున్నాయి.



Updated Date - 2020-03-28T05:48:37+05:30 IST