Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈసీకి మళ్లీ స్వతంత్రం వచ్చేనా?

తదుపరి సార్వత్రక ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉంది. మమతా బెనర్జీ ఏమి ఆలోచిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తనకుతానుగా పునరుజ్జీవమవుతుందా? నరేంద్రమోదీ వరుసగా మూడో పర్యాయం ప్రధానమంత్రి అయితే...? మొదలైన అంశాలను ఆసక్తితో చర్చిస్తున్న మనం ఈ పార్టీలు, రాజకీయాలకు ఆవల ఉండే (రాజ్యాంగ) సంస్థాగత ప్రశ్నలను విస్మరించకూడదు. స్వతంత్రంగా, సమర్థంగా వ్యవహరించడంలో భారత ఎన్నికలసంఘం ఒకనాటి తన సమున్నత యశస్సును ఎప్పుడు, ఏ మేరకు పునరుద్ధరించుకోగలుగుతుంది? అసలు ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పునస్సాధించుకోగలుగుతుందా లేదా అన్న దానిపైనే భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.


మే2న, నాలుగు ప్రధాన రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు నేను ప్రధానంగా ట్విటర్ మీదే ఆధారపడ్డాను. ఆ ఉదయం ట్విటర్ సైట్‌కు వెళ్ళినప్పుడు నన్ను అమితంగా ఆకట్టుకున్న మొదటి ట్వీట్ ఓట్లు లేదా ఆధిక్యతలు లేదా అభ్యర్థులు లేదా పార్టీల గురించి కాదు; అది, ఎన్నికలను నిష్పాక్షికంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తుందని మనం భావించే సంస్థ గురించి. రచయిత సైడిన్ వాడుకట్ ఆ ట్వీట్ చేశారు. వైరభావం లేని, సమయస్ఫూర్తితో కూడిన చమత్కారాలు ఆయన ట్వీట్‌లు. నేను ప్రస్తావించిన ట్వీట్‌లో ఆయన ఒక వార్తను ఉటంకించారు. ఎన్నికల కమిషనర్లపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసిందనేది ఆ వార్త సారాంశం. దీనిపై సైడిన్ సరసోక్తి: ‘సుప్రీంకోర్టు ఈ కేసును 15 సంవత్సరాల పాటు 35 విడతల్లో విచారిస్తుంది’. 


పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను నెలరోజులకు పైగా ఎనిమిది విడతలుగా (మొదటి పోలింగ్ మార్చి 27న కాగా చివరి పోలింగ్ ఏప్రిల్ 29) నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న విపరీత నిర్ణయంపై విసిరే వాడుకట్ వ్యాఖ్య అని మరి చెప్పాలా? తమిళనాడులో కేవలం ఒకేఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ను నిర్వహించిన నేపథ్యంలో బెంగాల్‌లో ఈసీ నిర్ణయం విపరీతమని అనడం చాలా తక్కువ చేసి వాఖ్యానించడమే అవుతుంది.


నిజానికది ఒక వెర్రి నిర్ణయం. గూగుల్‌కు వెళ్ళండి. భౌగోళిక వైశాల్యంలో బెంగాల్ (79,000 చదరపు కిలో మీటర్లు) తమిళనాడు (1,30,000 చదరపు కిలో మీటర్లు) కంటే చిన్న రాష్ట్రం. అయితే బెంగాల్ జనాభా దాదాపు పది కోట్లు కాగా తమిళనాడు జనాభా ఇంచుమించు ఎనిమిది కోట్లు మాత్రమే. బెంగాల్ రాజకీయ చరిత్ర భిన్నమైనది. తమిళనాట కంటే వంగభూమిలో ప్రత్యర్థి పార్టీల మధ్య హింసాకాండ ఎక్కువగా జరగడం పరిపాటి. ఈ వాస్తవాన్నే ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నా బెంగాల్‌లో రెండు లేదా మూడు దశల పోలింగ్ సరిపోతుంది. మరి ఎనిమిది విడతల పోలింగ్ నిర్వహించడం విపరీతమే కాదు, అందునా కొవిడ్ కాలంలో వెర్రిచేష్ట కాదూ?! 


బెంగాల్ విషయంలో ఈసీ ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్టు? కారణాలు ఏమిటో మనకు నిశ్చితంగా తెలియవు. తెలియబోవు కూడా. సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్ నీరు గార్చివేసింది కదా. మౌఖిక సంభాషణల ఆధారంగానే ఈసీ ఆ నిర్ణయం తీసుకుని ఉంటుందనడంలో సందేహం లేదు. బీజేపీ ప్రధాన ప్రచారకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌకర్యార్థమే ఆ నిర్ణయమని మనకు నిశ్చితంగా తెలుసు. పోలింగ్ రెండు లేక మూడు దశలలో కంటే ఎనిమిది దశలకు పొడిగిస్తే ప్రధానమంత్రి మరిన్నిసార్లు బెంగాల్లో పర్యటించి మరెన్నో ర్యాలీలలో ప్రసంగించేందుకు ఆస్కారముంటుంది మరి. జరిగింది కూడా ఇదే కదా. 


పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనాసరే అధికారంలోకి వచ్చి తీరేందుకు బీజేపీ మహా ఆరాటపడుతోందని కూడా అందరికీ తెలుసు. 2014 నుంచి అమిత్ షా లెక్కలేనన్నిసార్లు బెంగాల్‌ను సందర్శించారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించారు. వందలాది ర్యాలీలలో పర్యటించారు. భద్రలోక్ (మధ్యతరగతి ప్రజలు)నే కాదు, చోటోలోక్ (కిందిస్థాయి వర్గాలవారు)ను కూడా ఆకట్టుకునేందుకు ఆయన అమితంగా పాటుపడ్డారు. టాగోర్‌ను ప్రశంసించారు, కానీ రవి కవి పుట్టిన ప్రదేశం గురించి పొరపాటు పడ్డారు. విద్యాసాగర్‌ను కొనియాడారు. మరో పక్క ఆయన పార్టీ వారే ఆ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఒక దళితుని ఇంట మధ్యాహ్న భోజనం చేశారు. ఆదివాసీల మహావీరుడు బిర్సా ముండా పట్ల తన గౌరవాభిమానాలను చాటుకునేందుకు ఆయన విగ్రహానికి నమస్కరించారు తీరా ఆ ప్రతిమ బిర్సా ముండాది కాదని, అది పూర్తిగా మరొకరిదని వెల్లడయింది.


2019లో కేంద్ర హోంమంత్రి అయిన తరువాత, బెంగాల్‌లో తమ పార్టీ విజయానికి దోహదం చేసే విధంగా కేంద్రప్రభుత్వ విధానాలు ఉండేలా అమిత్ షా శ్రద్ధ వహించారు. నాటి తూర్పు పాకిస్థాన్, నేటి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు భరోసా కల్పించే లక్ష్యం పేరుతో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం అందుకొక ముఖ్య ఉదాహరణ. ఇదిలాఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పశ్చిమబెంగాల్‌లో పలు మార్లు పర్యటించారు. అవన్నీ దాదాపుగా ఆయన ప్రధానమంత్రిత్వ బాధ్యతలతో సంబంధం లేనివే. అమిత్ షా వలే ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ గెలుపొంది తీరాలని  భావించారు. చివరకు బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు కూడా పశ్చిమబెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దౌత్యమర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారు. 


గత ఆదివారం నాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటి నుంచి సంబంధిత నాయకులు, పార్టీలు నేర్చుకోవలసిన పాఠాల గురించి ఎంతోమంది చాలా చాలా రాశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు లభించిన చరిత్రాత్మక విజయంతో ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్ష మమతా బెనర్జీలో బలీయమవనున్నదా? కేరళలో లెఫ్ట్‌ ఫ్రంట్ విజయం సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన బహుమానమా? అపార ధనాన్ని ఖర్చు చేసి, సర్వశక్తులూ ఒడ్డినా బెంగాల్‌లో పరాజయంతో డీలా పడిపోయిన బీజేపీకి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకోగలగడం సాంత్వన కలిగిస్తుందా? అసోం, కేరళలో పరాజయాలతో పాటు బెంగాల్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం, కాంగ్రెస్ పార్టీకి ఎట్టకేలకు గాంధీయేతరుల సమర్థ నాయకత్వం లభించేందుకు దారితీస్తుందా? 


ఆ ప్రశ్నలకు తోడుగా ఈ కాలమ్ మరొక –- నిస్సందేహంగా మరింత ముఖ్యమైన-– ప్రశ్నను సంధించేందుకు సంకల్పించింది. భారత ఎన్నికల సంఘం విశ్వసనీయత ఇప్పటి కంటే ఇంతకు ముందెన్నడైనా ఇంత అధోస్థితిలో ఉన్నదా అనేదే ఆ ప్రశ్న. ఒక విశిష్ట వ్యక్తి మన మొదటి ఎన్నికల కమిషనర్ కావడం భారతదేశ గొప్ప అదృష్టమని నేను నా ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’లో సవివరంగా పేర్కొన్నాను. ఆ గొప్ప వ్యక్తి సుకుమార్ సేన్ (1898–-1961). ఆయన పటిష్ఠ ఎన్నికల వ్యవస్థను నిర్మించారు. ఎన్నికలను నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించడంలో గొప్ప ప్రమాణాలను నెలకొల్పారు. రంగంలో ఉన్న సకల రాజకీయపక్షాలు, సమస్త అభ్యర్థుల పట్ల ఆయన సమభా వంతో వ్యవహరించారు. ‘మన స్వాతంత్ర్య ప్రథమ దశాబ్దంలో ఆసియాకు మనం ఇచ్చిన గొప్ప కానుక సర్వోత్కృష్ట ఎన్నికల విధానం’ అని 1957లో ‘శంకర్స్ వీక్లీ’ వ్యాఖ్యానించింది. 


మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా మధ్య మొత్తం 21 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా వ్యవహరించారు. వీరిలో కొంతమంది సమర్థులు, మరికొంత మంది ఎటువంటి ప్రత్యేకత లేనివారు, ఇంకొంతమంది విశిష్టులు. టి. స్వామినాథన్ (1977లో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న తరుణంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు), టిఎన్ శేషన్ (భారత ప్రజాస్వామ్యనికి ఈయన తోడ్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాలా?), ఎన్.గోపాల కృష్ణన్, జెఎమ్. లింగ్డో, ఎస్‌వై ఖురైషీలు నిస్పందేహంగా విశిష్ట ఎన్నికల కమిషనర్లు. రాజకీయ జోక్యాలకు తావు లేకుండా తన విధ్యుక్తధర్మాన్ని నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. అయితే ఈసీ తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటుందా, రాజకీయ జోక్యాలను ప్రతిఘటిస్తుందా అన్నది ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వ్యక్తిపై ఆధారపడి ఉంది. సుకుమార్ సేన్, స్వామినాథన్, శేషన్, గోపాలకృష్ణన్, లింగ్డో, ఖురైషీ ఈ సీని ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా నిలబెట్టారు. తమ విధులను నైతికనిష్ఠతో నిర్వహించారు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే పదవీ విరమణ అనంతరం ప్రభుత్వంలో మరే పదవినీ వారు అంగీకరించలేదు.


గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్లు ప్రధానమంత్రి లేదా ఇతర కేబినెట్ మంత్రుల నుంచి వచ్చిన ఒత్తిడికి కించిత్ తలొగ్గేవారు. అయితే 2014 అనంతరం తలొగ్గుతున్న తీరు ఎన్నడూ సంభవించలేదు. పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందే గత సార్వత్రక ఎన్నికలలో ఇటువంటి విధేయతా ధోరణులు స్పష్టంగా కన్పించాయి. దేశవ్యాప్తంగా అధికార పక్ష అభ్యర్థులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడాన్ని ఈసీ అనుమతించింది. ప్రధానమంత్రి కేదార్‌నాథ్ యాత్ర పేరిట ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈసీ అనుమతించింది. ఎన్నికల బాండ్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరి కూడా ఈసీ పక్షపాతానికి ఒక తిరుగులేని నిదర్శనం.


తదుపరి సార్వత్రక ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉంది. మమతా బెనర్జీ ఏమి ఆలోచిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తనకుతానుగా పునరుజ్జీవమవుతుందా? నరేంద్రమోదీ వరుసగా మూడో పర్యాయం ప్రధానమంత్రి అయితే...? మొదలైన అంశాలను ఆసక్తితో చర్చిస్తున్న మనం పార్టీలు, రాజకీయాలకు ఆవల ఉండే (రాజ్యాంగ) సంస్థాగత ప్రశ్నలను విస్మరించకూడదు. స్వతంత్రంగా, సమర్థంగా వ్యవహరించడంలో భారత ఎన్నికలసంఘం ఒకనాటి తన సమున్నత యశస్సును ఎప్పుడు, ఏ మేరకు పునరుద్ధరించుకోగలుగుతుంది; అసలు ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పునస్సాధించుకోగలుగుతుందా లేదా అన్న దానిపైనే భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...