అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతించలేదు: రామ్మోహన్‌ నాయుడు

ABN , First Publish Date - 2020-06-30T18:36:04+05:30 IST

గుంటూరు: జీజీహెచ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును టీడీపీ నేతలు దేవినేని ఉమ, రామ్మోహన్‌నాయుడు పరామర్శించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతించలేదు: రామ్మోహన్‌ నాయుడు

గుంటూరు: జీజీహెచ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు వెళ్లారు. ఆయనను చూసేందుకు అధికారులు అనుమతించకపోవడంతో వైద్యులను అడిగి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యం దృష్ట్యా కోర్టు ఆసుపత్రికి పంపిందని... ఆరోగ్యం కుదుట పడిన తరువాత నేరుగా అచ్చన్నాయుడును కోర్టుకు అప్పగించాలని దేవినేని ఉమ, రామ్మోహన్‌నాయుడు కోరారు.


అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడును కలిసేందుకు ఇవాళ కూడా అధికారులు అంగీకరించలేదన్నారు. ఆసుపత్రి అధికారులతో మాట్లాడి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామన్నారు. ఆయనపై కేసులు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనన్నారు. శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకు వచ్చారన్నారు. న్యాయమూర్తి చెబితే గాని ఆసుపత్రికి తీసుకురాలేదని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. 


అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని.. కానీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతకం లేకుండానే నివేదిక ఇస్తున్నారన్నారు. కింది స్థాయి అధికారుల పేరిట నివేదిక పంపిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడుని ఎలాగైనా జైలులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందు కోసం ముఖ్యమంత్రి.. ఏసీబీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అర్థరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేసేందుకు యత్నించారన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-30T18:36:04+05:30 IST