నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2021-01-18T05:00:59+05:30 IST

మౌలిక సౌకర్యాల కల్పనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గణనీయమైన పురోగతి సాధించింది.

నెంబర్‌వన్‌

  • విద్యుత్‌ కనెక్షన్లలో రాష్ట్రంలోనే ఉమ్మడిజిల్లా ‘టాప్‌’
  • రంగారెడ్డి రెండో స్థానం, మేడ్చల్‌ మూడో స్థానం, వికారాబాద్‌ 20వ స్థానం
  • మేడ్చల్‌, రంగారెడ్డిలో అత్యధికంగా వ్యవసాయేతర భూములు 


మౌలిక సౌకర్యాల కల్పనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గణనీయమైన పురోగతి సాధించింది. ముఖ్యంగా విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. దీంతోపాటు రోడ్ల విస్తరణ, వ్యవసాయ రంగం, వ్యవసాయేతర భూములు, అడవుల విస్తీర్ణం తదితర అంశాల్లో ముందంజలో ఉన్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన 2019-20 ఆర్ధిక గణాంకాల్లో వెల్లడైంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

విద్యుత్‌ సౌకర్యాల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అగ్రస్థానంలో ఉంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన  ఆర్ధికగణాంకాల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అనేక అంశాల్లో ముందంజలో ఉంది. గతంలో కంటే విద్యుత్‌, రోడ్లు, తదితర సౌకర్యాల్లో ఉమ్మడి జిల్లా పురోగతిలో ఉంది. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ విస్తరించడం వల్ల ఉమ్మడిజిల్లాలో పలు అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా మౌలిక సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. రవాణా సౌకర్యాలు మరింత పెరుగుతున్నాయి. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణ, లింక్‌ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల కొత్తపారిశ్రామిక వాడలు రావడంతో మౌలిక సదుపాయాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వాసులకు సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో 33,06,411 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహవినియోగ కనెక్షన్లు అత్యధికంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలవారీగా చూస్తే రంగారెడ్డిజిల్లాలో మొత్తం 16,39,333 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగ కనెక్షన్లు 13,15,653 కాగా, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు 2,16,625, వ్యవసాయ కనెక్షన్లు 1,07,055 ఉన్నాయి. ఇక మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 13,65,859 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగ కనెక్షన్లు 11,81,538 కాగా.. వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు 1,64,396, వ్యవసాయ కనెక్షన్లు 19,925 ఉన్నాయి. అలాగే వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 3,01,219 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగ కనెక్షన్లు 2,10,615 కాగా.. వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు 30,812, వ్యవసాయ కనెక్షన్లు 59.792 ఉన్నాయి. 


రోడ్ల విస్తరణ

రోడ్ల విస్తరణలో రంగారెడ్డిజిల్లా నాలుగో స్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా 5,076కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 167.3 కి.మీ కాగా, పంచాయతీ రహదారులు 3,843కి.మీ, ఆర్‌అండ్‌బీ రహదారులు 1,068 కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. అలాగే రోడ్ల విస్తరణలో వికారాబాద్‌ జిల్లా ఎనిమిదో స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 3,875 కి.మీ. పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 77కి.మీ కాగా, పంచాయతీ రహదారులు 2,909కి.మీ, ఆర్‌అండ్‌బీ రహదారులు 889కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇక రోడ్ల విస్తరణలో మేడ్చల్‌ అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా 942 కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో  జాతీయ రహదారులు 50.3 కి.మీ కాగా.. పంచాయతీ రహదారులు 510కి.మీ, ఆర్‌అండ్‌బీ రహదారులు 381 కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. 


వ్యవసాయేతర భూములు ఎక్కువ

ఇదిలాఉంటే వ్యవసాయేతర భూములు రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 31శాతం ఉండగా తరువాత స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 14శాతం వ్యవసాయేతర అవసరాలకు భూవినియోగం ఉంది. 


వ్యవసాయ రంగం 

రంగారెడ్డిజిల్లాలో ఉన్న మొత్తం భూముల్లో 37.58శాతం వ్యవసాయ సాగు భూములు ఉన్నాయి. ఇందులో 3.2శాతం భూమిలో ఏడాదిలో రెండు అంతకంటే ఎక్కువసార్లు పంట సాగు చేస్తున్నారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 53.82శాతం వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో 0.6శాతం భూమిలో ఏడాదిలో రెండు అంతకంటే ఎక్కువసార్లు పంట సాగు చేస్తున్నారు.  మేడ్చల్‌ జిల్లాలో 11.25శాతం సాగు భూములు ఉన్నాయి. ఇందులో 3.7శాతం భూమిలో రెండు అంతకంటే ఎక్కువసార్లు సాగు చేస్తున్నారు. 


అడవులు 

అటవీ విస్తీర్ణంలో కొన్ని జిల్లాల కంటే కూడా మెరుగ్గా ఉన్నాయి. వికారాబాద్‌లో అత్యధికంగా 12.33శాతం అడవులు విస్తరించగా.. మేడ్చల్‌ జిల్లాలో 7.75శాతం, రంగారెడ్డిజిల్లాలో 5.79శాతం అడవులు ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. గతంతో పోలిస్తే రంగారెడ్డి, వికారాబాద్‌లో స్వల్పంగా అటవీ విస్తీర్ణం తగ్గగా మేడ్చల్‌లో స్వల్పంగా పెరిగింది. 

Updated Date - 2021-01-18T05:00:59+05:30 IST