Abn logo
May 17 2021 @ 06:55AM

నాగపూర్ ఐటీ కమిషనరుపై అత్యాచారం కేసు

నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర): నాగ్‌పూర్‌లో ఐటీ కమిషనర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని చెప్పి నాగపూర్ ఆదాయ పన్నుశాఖ కమిషనర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 లో నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఎన్ఎడీటీ) లో శిక్షణ పొందుతున్న ఐటీ కమిషనర్ పుదుచ్చేరి నివాసి. నిందితుడైన ఐటీ కమిషనర్ వైద్య చికిత్స కోసం నాగపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినపుడు అక్కడ పనిచేస్తున్న మహిళా వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా డాక్టరుకు నిందితుడైన ఐటీ కమిషనర్ తన మొబైల్ నంబరు ఇచ్చాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.నిందితుడు మహిళ అశ్లీల చిత్రాలు కూడా తీశాడు. మహిళ గర్భం దాల్చడంతో గర్భస్రావం చేయించుకోవాలని నిందితుడు కోరాడు. తనను పెళ్లి చేసుకోవాలని బాధిత మహిళ పట్టుబట్టడంతో తన అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు ఐటీ కమిషనరుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (2) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడిని బెంగళూరులో పోస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు. 

Advertisement