జోరుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ

ABN , First Publish Date - 2021-07-30T04:53:59+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ వేడుకగా జరుగుతోంది. ఈనెల 26 నుంచి రేషన్‌ కార్డుల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈనెల 31 వరకు వీటిని పంపిణీ చేయనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సభలు, సమావేశాలు పెట్టి వీటిని స్వయంగా పంపిణీ చేస్తున్నారు.

జోరుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ
రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్న తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ (ఫైల్‌)

5,712 మంజూరు... 2017 తిరస్కరణ


హన్మకొండ, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ వేడుకగా జరుగుతోంది.  ఈనెల 26 నుంచి రేషన్‌ కార్డుల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈనెల 31 వరకు వీటిని పంపిణీ చేయనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సభలు, సమావేశాలు పెట్టి వీటిని స్వయంగా పంపిణీ చేస్తున్నారు. అర్బన్‌ జిల్లాలోని పట్టణ, గ్రామీణప్రాంతాల్లో కార్డుల పంపిణీ సాగుతోంది. లబ్ధిదారులకు ప్రస్తుతం నూతన కార్డు మంజూరు చేస్తున్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్నారు. ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి ఆ తర్వాత అందజేస్తారు. అయితే ఈ ధ్రువీకరణ పత్రం కూడా కార్డుతో సమానమే. దీనిని చూపించి ఆగస్టు నెలలో సరుకులను తీసుకోవచ్చు. కొత్త రేషన్‌ కార్డులు మంజూరైనవారికి సరుకులను అందజేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కొత్త రేషన్‌ కార్డుల పంపిణీని  సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. 


కొత్త కార్డులు 

అర్బన్‌ జిల్లాలో 5,712 కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 2,66,056 రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చేవి వీటికి అదనం. రేషన్‌కార్డుల కోసం 7,729 దరఖాస్తులు రాగా, వీటిలో 5,712 దరఖాస్తులు సరైనవిగా గుర్తించారు. 2,017 దరఖాస్తులను తిరస్కరించారు. వరంగల్‌ అర్బన్‌ ప్రాంతంలో 2009 దరఖాస్తులు రాగా, 1,568 ఆమోదించారు. 441 దరఖాస్తులను తిరస్కరించారు. భీమదేవరపల్లి మండలంలో 114 దరఖాస్తుల్లో 86 ఆమోదించారు. 28 తిరస్కరించారు. ధర్మసాగర్‌లో 274 దరఖాస్తుల్లో 229 ఆమోదం పొందగా 45 తిరస్కరించారు. ఎల్కతుర్తిలో 105 దరఖాస్తులు రాగా, 94 ఆమోదం పొందాయి. 11 తిరస్కరణకు గురయ్యాయి. హన్మకొండలో 2,173 దరఖాస్తులు రాగా, 1,381 ఆమోదించారు. 792 తిరస్కరించారు. 

హసన్‌పర్తిలో 818 దరఖాస్తులు రాగా, 595 ఆమోదించి 223ను తిరస్కరించారు. ఐనవోలులో 273 దరఖాస్తులు రాగా, 225 ఆమోదించారు. 48 తిరస్కరింపబడ్డాయి. కమలాపూర్‌లో 161 దరఖాస్తులు రాగా, 146 ఆమోదం పొందాయి. 15 తిరస్కరించారు. కాజీపేటలో 865 దరఖాస్తులు రాగా, 544 ఆమోదం పొందాయి. 321 తిరస్కరించారు. ఖిలా వరంగల్‌లో 831 దరఖాస్తులకు గాను 747 ఆమోదం పొందగా 84 తిరస్కరించారు. వేలేరులో 106 దరఖాస్తులు రాగా, 97 ఆమోదం పొందాయి. 9 తిరస్కరించారు.


బీపీఎల్‌ కార్డులపై..

అర్బన్‌ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీపీఎల్‌ రేషన్‌కార్డులపై ప్రతీ నెల 4359.325 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కార్డుపై కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5కిలోలు, ఆహార భద్రత అంత్యోదయ కార్డుపై 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు కుటుంబంలో తలా ఒక్కరికి 10కిలోలు పంపిణీ చేస్తున్నారు. చెక్కరను అంత్యోదయ కార్డుదారులకు మాత్రమే ఒక కిలో చొప్పున అందజేస్తున్నారు.


ఉచితంగా పంపిణీ

కరోనా సంక్షోభం దృష్ట్యా జూలై నెలలో ప్రతీఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. అంతకు ముందు ఏప్రిల్‌లో 4,744 మంది ప్రైవేటు టీచర్లకు ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున 118.600 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా ఇచ్చారు. మే నెలలో 7,762 మంది ప్రైవేటు టీచర్లకు 285.450 మెట్రిక్‌ టన్నులు, జూన్‌లో 7,762 మందికి 194.50 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని అందజేశారు.


అన్నిటికీ కీలకం

రేషన్‌కార్డు కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి కావడంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు మాదిరిగా రేషన్‌ కార్డును కూడా కచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్‌ కార్డు కలిగినవారికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే రేషన్‌ సరుకులు అందిస్తుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుంది. ఇప్పటికే ప్రతీ కుటుంబానికి రేషన్‌ కార్డు ఉంటుంది. రేషన్‌ కార్డుల ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సరుకులను తక్కువ ధరకు అందిస్తోంది. కిలో బియ్యం రూపాయికి ఇవ్వడంతో పాటు కిరోసిన్‌, చెక్కర అందజేస్తోంది.

Updated Date - 2021-07-30T04:53:59+05:30 IST