Advertisement
Advertisement
Abn logo
Advertisement

రావత్‌.. కోర్టుకు రండి!

2019నాటి బిల్లును ఇప్పటికీ చెల్లించలేదా?

తాజాగా మరో బిల్లు పెట్టాలని ఎలా చెబుతారు?

13న నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

సీఎఫ్ ఎంఎస్‌ వల్లే ఈ సమస్యలని వ్యాఖ్య


అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసిన విషయంలో 2019లో పెట్టిన బిల్లులకు నేటికీ చెల్లింపులు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 13న న్యాయస్థానం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ను ఆదేశించింది. విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. సీఎ్‌ఫఎంఎస్‌ విధానం వల్లే సమస్యలు ఎదురౌతున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసిన విషయంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ నేషనల్‌ కో-ఆపరేటివ్‌ కన్‌జ్యూమర్‌ ఫెడరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ తరఫున  బ్రాంచ్‌ మేనేజర్‌ ఎస్‌హెచ్‌ శ్రీహర్ష హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీ రవితేజ వాదనలు వినిపించారు. ‘‘స్టేషనరీ సరఫరా చేసిన విషయంలో రూ.1.29 కోట్ల చెల్లింపు నిమిత్తం 2019లో బిల్లులు సమర్పించగా.... 2020లో సీఎ్‌ఫఎంఎ్‌సలో  అప్‌లోడ్‌ చేశారు. బడ్జెట్‌ విడుదల ఆదేశాలు రాలేదని 2021 మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో ఆ బిల్లులు రద్దు చేశారు. తాజాగా మరోసారి బిల్లు పెట్టుకోవాలంటూ పిటిషనర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ...బిల్లు చెల్లింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని కోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయమూర్తి  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ను ఆదేశించారు.

Advertisement
Advertisement