భవిష్యత్తుపై వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతోంది... ఆర్‌బీఐ సర్వేలో వెల్లడి...

ABN , First Publish Date - 2021-04-10T01:10:46+05:30 IST

భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ధరల తగ్గుదల, ఉపాధి కల్పన తదితర అంశాలకు సంబంధించి వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

భవిష్యత్తుపై వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతోంది... ఆర్‌బీఐ సర్వేలో వెల్లడి...

న్యూఢిల్లీ : భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ధరల తగ్గుదల, ఉపాధి కల్పన తదితర అంశాలకు సంబంధించి  వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా వైరస్‌ మళ్లీ  విజృంభించడంతో ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు కమ్ముకోవడంతో వినియోగదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) తాజా సర్వేలో వెల్లడైంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు 13 నగరాల్లో 5,372 కుటుంబాలను భాగస్వాములను చేస్తూ ఆర్‌బీఐ క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించింది. సాధారణ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి తీరు, స్థూలంగా ధరల పరిస్థితి, ఆదాయవ్యయాలు తదితర అంశాలపై ఆయా కుటుంబాల అభిప్రాయాలను సేకరించి విడుదల చేసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి. 


 ప్రస్తుత ఏడాది మార్చిలో వినియోగదారుల విశ్వాస సూచీ 53.1 కి పడిపోయింది. 2021 జనవరిలో ఇది 55.5 గా ఉందని ఆర్‌బీఐ తెలిపింది. కాగా ఇది గతేడాది సెప్టెంబరులో అత్యల్పంగా 49.9 శాతానికి పడిపోయింది. సాధారణంగా ఇది 100 కు పైన ఉంటే విశ్వాసం, దిగువన ఉంటే నిరాశవాదంలో ఉన్నట్లు పరిగణిస్తారు. సాధారణ ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు, ధరలపై ప్రజల విశ్వాసం క్షీణించిందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్తు అంచనాల సూచీ (ఎఫ్‌ఇఐ) సైతం నిరాశవాదంలో ఉందని చెబుతోంది.  మార్చిలో ఎఫ్‌ఈఐ 108.8 కు పడిపోగా, జనవరిలో ఇది 117.1 గా నమోదైంది. భవిష్యత్తుకు సంబంధించి ఉపాధి పరిస్థితులు, ఆదాయాలు, ఆర్థిక పరిస్థితుల పట్ల పలు కుటంబాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఏడాదికేడాదితో పోల్చితే అత్యవసరాల కోసం అధికంగా వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తులో వీటిపై మరింత ఎక్కవ ఖర్చు చేయాల్సి రావచ్చన్న ఆందోళన వ్యక్తమైంది. 


భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక మిగతా డబ్బు వినియోగంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని వెల్లడైంది. వినియోగదారుల వైఖరి తీవ్ర సంకోచ స్థితికి చేరుకుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది లాక్‌డౌన్‌తో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర కుదుపునకు గురైన విషయం తెలిసిందే. ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుదనుకునే లోపే రెండో దశ కరోనా వైరస్‌ విజృంభించడంతో భవిష్యత్తుపై మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యలు కార్పొరేట్‌ వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, సామాన్య ప్రజల పరిస్థితులను గాలికి వదిలేసిందని ఆరోపణలు వినవస్తున్నాయి. జనవరి 2021 నాటి ధరలతో పోల్చితే ప్రస్తుత కాలంలో 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.7 శాతానికి, వచ్చే త్రైమాసికంలో 80 బేసిస్‌ పాయింట్లు ఎగసి 10.1 శాతానికి చేరొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 

Updated Date - 2021-04-10T01:10:46+05:30 IST