కోల్‌కత్తా పేలవ బ్యాటింగ్.. బెంగళూరు లక్ష్యం 85 పరుగులు

ABN , First Publish Date - 2020-10-22T02:52:13+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో..

కోల్‌కత్తా పేలవ బ్యాటింగ్.. బెంగళూరు లక్ష్యం 85 పరుగులు

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు జట్టు ముందు 85 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తాకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్ కీలక మ్యాచ్‌లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెంగళూరు బౌలర్ సిరాజ్ బౌలింగ్‌లో కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్స్ 3 వికెట్లను సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కీపర్ క్యాచ్‌గా డివిలియర్స్‌కు చిక్కి ఔటయ్యాడు. 5 బంతులు ఆడిన రాహుల్ త్రిపాఠి ఒక్క పరుగు మాత్రమే చేశాడు.


రాహుల్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ రాణా అదే ఓవర్‌లో నాలుగో బంతికే సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నవదీప్ సైనీ బౌలింగ్ చేసిన మూడో ఓవర్ రెండో బంతికే గిల్ కూడా మోరిస్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. తరువాత.. ఓ ఫోర్, సిక్స్‌తో టామ్ బంటన్ మెరిసినా ఔట్ కావటానికి ఎక్కువ సేపు పట్టలేదు. సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో ఓవర్ మూడో బంతికి డివిలియర్స్‌కు కీపర్ క్యాచ్‌గా చిక్కి బంటన్ కూడా వెనుదిరిగాడు. దినేష్ కార్తీక్ 4 పరుగులు, మోర్గాన్ 30, కమ్మిన్స్ 4, కుల్దీప్ యాదవ్ 12, ఫెర్గ్యూసన్ 19 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా రాణించడంతో నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లకు 100 పరుగుల మార్క్‌ను కూడా చేరుకోలేక చతికిలపడింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లతో రాణించగా, చాహల్ 2, సైనీ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.

Updated Date - 2020-10-22T02:52:13+05:30 IST